Kaikala Satyanarayana: సిపాయి కూతురుతో కెరీర్ ప్రారంభించిన కైకాల..
* అతను యమగోల, యమలీల చిత్రాల్లో యముడిగా వేసి అలరించాడు. కృష్ణుడిగా, రాముడిగా ఎన్.టీ.ఆర్ ఎలానో, యముడిగా సత్యనారాయణ అలా నటించారు.
దిగ్గజ నటుడు కైకాల సత్యనారాయణ గురించి చెప్పడానికి మాటలు చాలవు
Kaikala Satyanarayana: సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూశారు. హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. కొన్ని రోజులుగా అస్వస్థతతో బాధపడుతున్న ఆయన ఈరోజు తెల్లవారు జామున 4 గంటలకు తుదిశ్వాస విడిచారు. కైకాల సత్యనారాయణ 1935 జూలై 25న ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతవరంలో జన్మించారు. ప్రస్తుతం ఈయన వయసు 87 సంవత్సరాలు. 1960 ఏప్రిల్ 10న నాగేశ్వరమ్మతో వివాహమైంది.
ఈయనకు ఇద్దరు కుమారులు కైకాల లక్ష్మీనారాయణ, కైకాల రామారావు, కైకాల రమాదేవిలతో సహా మరో కూతురు ఉన్నారు. కైకాల సత్యనారాయణకు నవరస నటనా సార్వభౌమ అనే బిరుదు అందుకున్నారు. సినిమాలు, రాజకీయంలో కైకాల సత్యనారాయణ తెలుగు ప్రజలకు సుపరిచితుడు. కైకాల సత్యనారాయణ ప్రాథమిక, ప్రాథమికోన్నత విద్యను గుడివాడ, విజయవాడలలో పూర్తిచేసి, గుడివాడ కళాశాల నుంచి పట్టభద్రుడయ్యాడు. తన గంభీరమైన కాయంతో, కంచు కంఠంతో, సినిమాలలో వేషాల కోసం సత్యనారాయణ మద్రాసు వెళ్ళాడు.
అతన్ని మొదట గుర్తించింది డి.యల్.నారాయణ. 1959లో నారాయణ సిపాయి కూతురు అనే సినిమాలో సత్యనారాయణకు ఒక పాత్ర ఇచ్చారు. దానికి దర్శకుడు చంగయ్య. ఆ సినిమా బాక్సు ఆఫీసు దగ్గర బోల్తాపడినా సత్యనారాయణ ప్రతిభను గుర్తించారు. అలా గుర్తించడానికి ఆసక్తి గల కారణం, అతను రూపు రేఖలు ఎన్.టీ.ఆర్‌ను పోలి ఉండటమే. ఎన్.టీ.ఆర్ కు ఒక మంచి నకలు దొరికినట్లయింది. అప్పుడే ఎన్.టీ.ఆర్ కూడా ఇతడిని గమనించారు.
1960లో ఎన్.టీ.ఆర్ తన సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణిలో ఇతనికి ఓ పాత్ర ఇచ్చారు. ఈ సినిమాకి యస్.డి.లాల్. దర్శకత్వం వహించారు ఈ సినిమాలో సత్యనారాయణ యువరాజు పాత్ర పోషించారు.సత్యనారాయణను ఒక ప్రతినాయకుడుగా చిత్రించవచ్చని కనిపెట్టింది బి.విఠలాచార్య. ఇది సత్యనారాయణ సినిమా జీవితాన్నే మార్చేసింది. విఠలాచార్య సత్యనారాయణ చేత ప్రతినాయకుడుగా కనకదుర్గ పూజా మహిమలో వేయించాడు.
ఆ పాత్రలో సత్యనారాయణ సరిగ్గా ఇమడటంతో, తర్వాతి సినిమాల్లో అతను ప్రతినాయకుడుగా స్థిరపడి పోయాడు. ప్రతినాయకుడిగా తన యాత్ర కొనసాగిస్తూనే, సత్యనారాయణ సహాయ పాత్రలు కూడా వేశారు. ఇది ఆయనను సంపూర్ణ నటుడిని చేసింది. తెలుగు చిత్ర పరిశ్రమకు సత్యనారాయణ రూపంలో విలక్షణ నటుడు దొరికినట్లయింది. అతను యమగోల, యమలీల చిత్రాల్లో యముడిగా వేసి అలరించాడు. కృష్ణుడిగా, రాముడిగా ఎన్.టీ.ఆర్ ఎలానో, యముడిగా సత్యనారాయణ అలా నటించారు.
ఎస్.వీ.రంగారావు ధరించిన పాత్రలను చాలావరకు సత్యనారాయణ పోషించారు. పౌరాణికాల్లో రావణుడు, దుర్యోధనుడు, యముడు, ఘటోత్కచుడు సాంఘికాల్లో రౌడీ, కథానాయకుడికి, కథాకనాయికలకు తండ్రి, తాత తదితర పాత్రలు పోషించారు.సత్యనారాయణ రమా ఫిల్మ్ ప్రొడక్షన్ అనే సంస్థను స్థాపించి ఇద్దరు దొంగలు, కొదమ సింహం, బంగారు కుటుంబం, ముద్దుల మొగుడు సినిమాలు నిర్మించాడు. 1996లో అతను రాజకీయాల్లోకి వచ్చి, మచిలీపట్నం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి 11వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు.