Ram Charan: గేమ్‌ ఛేంజర్‌ ఫలితంతో రామ్‌ చరణ్‌ కీలక నిర్ణయం.. దిల్‌ రాజు కోసం

Update: 2025-01-21 08:42 GMT

Ram Charan movie with Dil Raju: రామ్‌ చరణ్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో వచ్చిన 'గేమ్‌ ఛేంజర్‌' మూవీ డిజాస్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. సుమారు రూ. 450 కోట్లతో నాలుగేళ్ల పాటు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ప్రేక్షకులను మాత్రం ఆకట్టుకోలేకపోయిందని చెప్పాలి.

ఇక ఈ సినిమాతో పాటు సంక్రాంతికి థియేటర్లలోకి వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం మాత్రం ప్రేక్షకులను మెప్పించింది. బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసుకున్న ఈ సినిమా కలెక్షన్ల పరంగాను మంచి ఫలితాన్ని రాబట్టింది. ఈ సినిమాకు కూడా దిల్‌ రాజు నిర్మాతగా వ్యవహరించిన విషయం తెలిసిందే. గేమ్‌ ఛేంజర్‌ నడుస్తున్న చాలా వరకు థియేటర్లు సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో రీప్లేస్‌ చేశారు.

ఇదిలా ఉంటే గేమ్‌ ఛేంజర్‌ ఫ్లాప్ రిజల్ట్ నేపథ్యంలో రామ్‌ చరణ్‌ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దిల్‌ రాజు, రామ్‌ చరణ్‌ కాంబినేషన్‌లో గతంలో చాలా సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. వీటిలో కొన్ని ఇండస్ట్రీ హిట్‌గా కూడా నిలిచాయి. అయితే తాజాగా రామ్‌ చరణ్‌, దిల్‌ రాజుకు తనకు తోచిన రీతిలో సాయం చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఒక మంచి కథతో గేమ్‌ ఛేంజర్‌ నష్టాన్ని పూరించాలని చరణ్‌ ఆలోచిస్తున్నట్లు సమాచారం.

కొన్ని రోజుల్లోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రామ్‌ చరణ్‌ చేతిలో రెండు ప్రాజెక్టులు ఉన్నాయి. వీటిలో ఒకటి బుచ్చిబాబు దర్శకత్వంలోని మూవీ కాగా మరొకటి సుకుమార్‌ డైరెక్ట్ చేయనున్న సినమా. ఈ రెండు చిత్రాల తర్వాత దిల్‌ రాజు, రామ్‌ చరణ్‌ కాంబినేషన్‌లో ఒక సినిమా రానుందని తెలుస్తోంది. ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News