Dhanush files case against Nayanthara and Vignesh Shivan: కోలీవుడ్ హీరో ధనుష్, నయనతార మధ్య వివాదం మరింత ముదురుతోంది. తాజాగా నయనతారతో పాటు ఆమె భర్త, దర్శకుడు విఘ్నేశ్ శివన్‌పై ధనుష్ కోర్టులో పిటిషన్ వేశారు. నయనతార డాక్యుమెంటరీలో తన అనుమతి లేకుండా నానుమ్ రౌడీ దాన్ అనే సినిమా విజువల్స్ వాడుకోవడంతో ఆయన నిర్మాణ సంస్థ తాజాగా మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. పిటిషన్ పరిశీలించిన న్యాయస్థానం విచారణకు అనుమతించింది.
నానుమ్ రౌడీ దాన్ మూవీలోని మూడు సెకన్ల క్లిప్పును అనుమతి లేకుండా వినియోగించారంటూ ధనుష్ టీమ్ ఆరోపించింది. ఈ విషయంపై ఇప్పటికే నయనతారకు నోటీసులు కూడా పంపారు. నానుమ్ రౌడీ దాన్ సినిమా విజువల్స్‌ను వాడుకున్నందుకు ధనుష్ రూ.10 కోట్లు అడిగాడని.. నయనతార ఓ పెద్ద లేఖ రాసింది. ధనుష్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కోలీవుడ్‌లో ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఆమెకు పలువురు హీరోయిన్లు మద్దతు తెలిపారు. ధనుష్‌కు ఆయన అభిమానులు సపోర్ట్ చేశారు. అయితే ఇన్నాళ్లు మౌనంగా ఉన్న ధనుష్.. ఇప్పుడు నయనతార దంపతులపై కేసు వేయడంతో ఈ వివాదం మరో మలుపు తిరిగింది.
నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్ డాక్యుమెంటరీ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. నయనతార కెరీర్, ఆమె ఎదుర్కొన్న అవమానాలు, విమర్శలను ఇందులో చూపించారు. ముఖ్యంగా విఘ్నేష్ శివన్‌తో ఆమె పరిచయం, ప్రేమ, పెళ్లిని ఇందులో చూపించారు.
విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన నానుమ్ రౌడీ దాన్ మూవీలో నయనతార హీరోయిన్ గా నటించారు. ధనుష్ నిర్మాత. ఈ సినిమా సెట్‌లోనే నయనతార, విఘ్నేష్ శివన్ మధ్య స్నేహం మొదలై ప్రేమగా మారింది. అందుకే ఈ సినిమా వీడియోలు, పాటలను డాక్యుమెంటరీలో చూపించాలని ఈ దంపతులు భావించారు. తమ డాక్యుమెంటరీలో ఆ సినిమా ప్రస్తావన లేకపోతే అసలేం బాగుండదు అనేది వారి ఉద్దేశం. కాకపోతే అందుకు ధనుష్ అంగీకరించలేదు. అక్కడే వారి మధ్య ఈ కాపీ రైట్స్ యాక్ట్ గొడవ మొదలైంది.