Girija Oak : మా అబ్బాయి ఆ ఫోటోలు చూస్తే..అశ్లీల ఫోటోలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన లేటెస్ట్ సెన్సేషన్
ప్రస్తుతం బాలీవుడ్, మరాఠీ సినిమాల్లో నటిస్తున్న నటి గిరిజా ఓక్ కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నారు.
Girija Oak : మా అబ్బాయి ఆ ఫోటోలు చూస్తే..అశ్లీల ఫోటోలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన లేటెస్ట్ సెన్సేషన్
Girija Oak : ప్రస్తుతం బాలీవుడ్, మరాఠీ సినిమాల్లో నటిస్తున్న నటి గిరిజా ఓక్ కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నారు. ఆమె ఇంటర్వ్యూలు, నీలిరంగు చీరలో ఉన్న ఆమె లుక్ వైరల్ కావడంతో కొంతమంది దీనిని దుర్వినియోగం చేశారు. వారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించి ఆమె అశ్లీల ఫోటోలను క్రియేట్ చేసి, ఆన్‌లైన్‌లో వైరల్ చేశారు. ఈ మార్ఫింగ్ ఫోటోలపై గిరిజా ఓక్ తాజాగా స్పందిస్తూ నెటిజన్లకు ఒక విన్నపం చేశారు.
గిరిజా ఓక్ ఇటీవల సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్‌లో ఉన్నారు. దీనిపై ఆమె సంతోషం వ్యక్తం చేస్తూ అభిమానులు పంపుతున్నమీమ్స్‌కు కృతజ్ఞతలు తెలిపారు. "సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ అంశాలు నాకు చాలా సంతోషాన్నిస్తున్నాయి. నాకు చాలా మంచి కామెంట్లు, మెసేజ్‌లు వస్తున్నాయి. నాకు ఇంత ప్రేమ లభిస్తున్నందుకు చాలా కృతజ్ఞురాలిని" అని ఆమె అన్నారు.
తన బంధువులు, స్నేహితులు పంపుతున్న ఫొటోలు, మీమ్స్‌లో కొన్ని చాలా క్రియేటివ్‌గా, సరదాగా ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. సంతోషంతో పాటు ఈ ట్రెండ్‌ను ఉపయోగించుకుని కొందరు ఏఐ టెక్నాలజీతో క్రియేట్ చేసిన అశ్లీల ఫోటోలను వైరల్ చేయడంపై గిరిజా ఓక్ తీవ్రంగా స్పందించారు. "కొన్ని ఫోటోలు అశ్లీలంగా ఉన్నాయి. అవి ఏఐ ఉపయోగించి తయారు చేయబడినవని మనందరికీ తెలుసు. నేను ఈ కాలంలో సోషల్ మీడియా వాడుతున్న అమ్మాయిని కాబట్టి, ఏదైనా వైరల్ అయినప్పుడు ఇలాంటి పోస్ట్‌లు చేస్తారని నాకు తెలుసు. ఏఐ ఉపయోగించి మహిళలు, పురుషుల ఫొటోలను మార్ఫింగ్ చేస్తారని లేదా మారుస్తారని తెలుసు" అని గిరిజా అన్నారు.
కేవలం ఎక్కువ మందిని ఆకర్షించడానికి ఇలాంటి ప్రయత్నాలు చేస్తారని ఆమె పేర్కొన్నారు. ఏఐ ద్వారా క్రియేట్ చేసిన ఈ ఫోటోల వల్ల తన వ్యక్తిగత జీవితంపై పడే ప్రభావం గురించి, ముఖ్యంగా తన 12 ఏళ్ల కొడుకు భవిష్యత్తు గురించి గిరిజా ఓక్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ప్రతి ఒక్కరినీ కదిలించే అంశం. "నాకు 12 ఏళ్ల కొడుకు ఉన్నాడు. అతను ఇప్పుడు సోషల్ మీడియా వాడటం లేదు. కానీ భవిష్యత్తులో వాడవచ్చు. మనం ఈ రోజు లేదా రేపు ఈ మార్ఫింగ్ ఫొటోలను చూసి వదిలేస్తాం. కానీ అవి ఇంటర్నెట్‌లో శాశ్వతంగా ఉండిపోతాయి. మా అబ్బాయి పెద్దయ్యాక నా గురించి మార్ఫింగ్ చేసిన ఆ ఫోటోను చూస్తే? ఆ ఆలోచనే నాకు చాలా భయంగా ఉంది" అని ఆమె భావోద్వేగానికి లోనయ్యారు.