Chaava: శంభాజీ గురించి పాఠశాలలో నేర్పించలేదేం..? ఆకాశ్ చోప్రా ప్రశ్నలు వైరల్
ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా ఛావా సినిమాను దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించారు. ఫిబ్రవరి 14న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తోంది.
శంభాజీ గురించి పాఠశాలలో నేర్పించలేదేం..? ఆకాశ్ చోప్రా ప్రశ్నలు వైరల్
Chhaava: ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా ఛావా సినిమాను దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించారు. ఫిబ్రవరి 14న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తోంది. ఛావా సినిమా ద్వారా శంభాజీ జీవిత కథను ప్రేక్షకుల హృదయాలకు అత్తుకునేలా చూపించారు లక్ష్మణ్. మరాఠా సామ్రాజ్యాన్ని పాలించిన రెండో పాలకుడి పాత్రలో విక్కీ కౌశల్ అద్భుతంగా నటించగా.. ఆయన భార్య ఏసుబాయి పాత్రలో రష్మిక మందన్నా ఆకట్టుకుంటున్నారు. ఔరంగజేబుగా అక్షయ్ ఖన్నా నటించారు. అయితే తాజాగా ఈ సినిమా పై మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు ప్రస్తుతం వైరల్‌గా మారింది.
పాఠ్యపుస్తకాల్లో అక్బర్ గురించి, ఔరంగజేబు గురించి చదువుకున్నాం కానీ శంభాజీ మహారాజ్ గురించి ఎక్కడా చెప్పలేదన్నారు. ఛావా సినిమా చూశాక ఇంత గొప్ప చక్రవర్తి గురించి పిల్లలకు ఎందుకు నేర్పించడంలేదని అనిపించిందని ఆకాశ్ చోప్రా పోస్టులో తెలిపారు. ఈ చిత్రంలో ధైర్యం, నిస్వార్థం, తన పనిపై అంకితభావంతో ఎన్నో విషయాలు కలిసిన గొప్ప కథ అని కొనియాడారు. కానీ అక్బర్ గొప్ప నాయకుడు అని, న్యాయంగా పాలించిన చక్రవర్తి అని నేర్పించారని అన్నారు.
ఢిల్లీలో ఓ పెద్ద రహదారికి ఔరంగజేబు పేరు పెట్టారు. కానీ శంభాజీ గురించి ఎక్కడా చెప్పలేదు. అలా ఎందుకు చేశారు..? అంటూ ఆకాశ్ చోప్రా ప్రశ్నించారు. ఈ పోస్టుపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. మీరు చరిత్ర చదవలేదా..? అని ఓ నెటిజన్ ప్రశ్నించారు. దీనికి సమాధానంగా చరిత్రలో తనకు 80 శాతం మార్కులు వచ్చాయని రిప్లై ఇచ్చారు. కొందరు ఆకాష్ పోస్టుకు మద్దతు తెలుపుతుండగా.. మరికొందరు వివాదస్పదం చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదిలా ఉంటే విడుదలైన తొలి రోజు ఛావా రూ.31 కోట్లు వసూళ్లు రాబట్టింది. ఇప్పటి వరకు దాదాపుగా రూ.121 కోట్లు వసూల్లు చేసినట్టు సినీ వర్గాల టాక్. హిస్టారికల్ సినిమాకు ఈ విధంగా వసూళ్లు రావడంతో ఛావా చిత్రం రికార్డు సృష్టించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 6,670 షోలను ప్రదర్శిస్తున్నారు.