World Cancer Day 2026: మీ ఆలోచన ఈ ఒక్కరోజుకే పరిమితం చేయకుండా.. రెగ్యులర్ చెక్‌అప్స్ చేసుకుని క్యాన్సర్‌ను జయించండి!
World Cancer Day 2026: ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4న 'ప్రపంచ క్యాన్సర్ డే'ను ప్రపంచవ్యాప్తంగా పాటిస్తారు. 2026లో క్యాన్సర్ ప్రాముఖ్యత మరింత పెరిగింది. ఎందుకంటే..
World Cancer Day 2026: మీ ఆలోచన ఈ ఒక్కరోజుకే పరిమితం చేయకుండా.. రెగ్యులర్ చెక్‌అప్స్ చేసుకుని క్యాన్సర్‌ను జయించండి!
World Cancer Day 2026: ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4న 'ప్రపంచ క్యాన్సర్ డే'ను ప్రపంచవ్యాప్తంగా పాటిస్తారు. 2026లో క్యాన్సర్ ప్రాముఖ్యత మరింత పెరిగింది. ఎందుకంటే.. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర వ్యాధుల్లో ఒకటైన క్యాన్సర్ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రాణాలను బలితీసుకుంటోంది. ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ (IARC) గణాంకాల ప్రకారం.. 2022లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 2 కోట్ల కొత్త క్యాన్సర్ కేసులు, 97 లక్షల క్యాన్సర్ సంబంధిత మరణాలు నమోదయ్యాయి. ట్రిలియన్ల కణాలతో కూడిన మానవ శరీరంలో ఎక్కడైనా క్యాన్సర్ రావొచ్చు. వ్యాధి నివారణ, ముందస్తు గుర్తింపు, సరైన చికిత్స పొందడం గురించి ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4న ప్రపంచ క్యాన్సర్ దినోత్సవంగా నిర్వహిస్తారు.
భారత్‌లో పరిస్థితి మరింత ఆందోళన కలిగిస్తోంది. 2024లో దేశంలో 15 లక్షలకుపై గా క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి. 2019లో 13.5 లక్షలుగా ఉన్న క్యాన్సర్ కేసులు క్రమంగా పెరుగుతూ.. 2020లో 13.9 లక్షలు, 2021లో 14.2 లక్షలు, 2022లో 14.6 లక్షలు, 2023లో 14.9 లక్షలు, 2024లో 15.3 లక్షలుగా పెరిగాయి. ఈ గణాంకాలు భారతదేశంలో క్యాన్సర్ పెరుగుతున్న ప్రమాదాన్ని తెలియజేస్తున్నాయి. ప్రపంచ క్యాన్సర్ డే 2026 థీమ్ 'United by Unique'. ప్రతి వ్యక్తి క్యాన్సర్ ప్రయాణం వేరు అయినప్పటికీ.. అందరికీ ఒకే లక్ష్యం. అదే మెరుగైన చికిత్స, మద్దతు, మంచి ఫలితాలు. ఈ థీమ్ క్యాన్సర్‌ను మాత్రమే కాకుండా.. క్యాన్సర్‌తో పోరాడుతున్న వ్యక్తిని కేంద్రంగా ఉంచి ఆరోగ్య వ్యవస్థలు మరింత సున్నితంగా, వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా మారాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది.
ప్రపంచ క్యాన్సర్ డే కేవలం సోషల్ మీడియాలో హ్యాష్‌ట్యాగ్‌లకే పరిమితం కాదు.. ఇది చర్యలకు ఓ పిలుపు. క్యాన్సర్‌ను తొలిదశలో గుర్తిస్తే ప్రాణాలు కాపాడవచ్చు. అయినప్పటికీ బ్రెస్ట్, సర్వైకల్, ఓరల్, కొలొరెక్టల్ క్యాన్సర్లకు సంబంధించిన స్క్రీనింగ్ టెస్టులు చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ సరిగా జరగడం లేదు. భయం, అపోహలు, అవగాహన లోపం కారణంగా చాలామంది స్క్రీనింగ్‌ను నిర్లక్ష్యం చేస్తున్నారు. లైఫ్‌స్టైల్ మార్పులు సింపుల్ అయినప్పటికీ చాలా మంది పాటించడం లేదు. పొగాకు మానేయడం, మద్యం పరిమితం చేయడం, ఆరోగ్యకరమైన బరువు, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, మంచి పోషకాహారం తీసుకోవడం వంటి అలవాట్లు క్యాన్సర్ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తాయి. ఇవి ఆకర్షణీయంగా అనిపించకపోయినా.. ఫలితాలు మాత్రం స్పష్టంగా ఉంటాయి.
ఈ నేపథ్యంలో ఆండ్రోమెడా క్యాన్సర్ హాస్పిటల్ డైరెక్టర్ అండ్ సర్జికల్ ఆంకాలజీ, బ్రెస్ట్ ఆంకాలజీ విభాగం అధిపతి డాక్టర్ వైశాలి జామ్రే స్క్రీనింగ్ ప్రాముఖ్యతను వివరించారు. 'ప్రజలను ఒకే ఒక టెస్ట్ చేయమని ఒప్పించాల్సి వస్తే.. అది మమ్మోగ్రఫీ' అని చెబుతున్నారు. 'బ్రెస్ట్ క్యాన్సర్ తొలిదశలో ఎలాంటి నొప్పి లేదా లక్షణాలు కనిపించవు. మమ్మోగ్రఫీ ద్వారా లక్షణాలు కనిపించకముందే క్యాన్సర్‌ను గుర్తించవచ్చు. దీంతో చికిత్స సులభమవుతుంది, సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగా ఉంటాయి, జీవించే అవకాశం పెరుగుతుంది' అని చెప్పారు. చాలామంది పట్టించుకోని క్యాన్సర్ హెచ్చరిక లక్షణాలపై కూడా ఆమె హెచ్చరిస్తున్నారు. నొప్పి లేని గడ్డలు, కారణం లేకుండా బరువు తగ్గడం, తీవ్రమైన అలసట, ఎక్కువ రోజులు తగ్గని దగ్గు, మలమూత్ర వ్యవస్థలో మార్పులు, అసాధారణ రక్తస్రావం, మానని గాయాలు, చర్మంపై వింత మార్పులు వంటి లక్షణాలను తేలికగా తీసుకోకూడదని సూచనలు చేశారు.
యువతలో కూడా కొన్ని క్యాన్సర్లు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా బ్రెస్ట్, కొలొరెక్టల్, ఎండోమెట్రియల్, థైరాయిడ్, మెలనోమా క్యాన్సర్లు యువ వయస్సులోనే కనిపిస్తున్నాయి. వీటిని తొలిదశలో గుర్తించేందుకు మమ్మోగ్రఫీ, కొలనోస్కోపీ, పాప్ స్మియర్ + HPV టెస్టింగ్, స్కిన్ ఎగ్జామ్ వంటి స్క్రీనింగ్ టెస్టులు ఎంతో కీలకం. మమ్మోగ్రఫీ ద్వారా చిన్న మార్పులు ముందుగానే గుర్తించవచ్చు. కొలనోస్కోపీ ద్వారా ప్రీక్యాన్సర్ పాలిప్స్‌ను తొలగించవచ్చు. పాప్ స్మియర్, HPV టెస్టులు సర్వైకల్ క్యాన్సర్‌కు ముందే హెచ్చరిక జారీ చేస్తాయి. స్కిన్ ఎగ్జామ్ ద్వారా చర్మ క్యాన్సర్‌ను తొలిదశలో గుర్తించవచ్చు. ప్రపంచ క్యాన్సర్ డే ఒక్కరోజు ఆలోచనలకే పరిమితం కాకూడదు. గణాంకాలను అర్థం చేసుకోవాలి, వాస్తవాలను ఎదుర్కోవాలి, క్రమం తప్పకుండా చెక్‌అప్స్ చేయించుకోవాలి, ఆరోగ్యకర జీవనశైలిని అలవాటు చేసుకోవాలి, క్యాన్సర్‌తో పోరాడుతున్నవారికి మద్దతుగా నిలవాలి. రోజూ క్యాన్సర్‌ను సీరియస్‌గా తీసుకుంటేనే.. ఫిబ్రవరి 4కి అసలైన అర్థం ఉంటుంది.