Lifestyle: పెద్దపేగు క్యాన్సర్ బారినపడొద్దంటే ఇలా చేయాల్సిందే
Colorectal Cancer prevention tips: పెద్దపేగు క్యాన్సర్ బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఒకప్పుడు 50 ఏళ్లు దాటిన వారిలోనే ఈ సమస్య కనిపించేది. కానీ తాజాగా 30 ఏళ్ల వయస్సు వారు కూడా ఈ పెద్ద పేగు క్యాన్సర్ బారిన పడుతున్నారు.
Colorectal Cancer prevention tips: మారిన జీవనవిధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా ఇటీవల పెద్దపేగు క్యాన్సర్ బారిన పడుతోన్న వారి సంఖ్య పెరుగుతోంది. సరైన ఆహారం తీసుకోకపోవడం, చెడు అలవాట్ల కారణంగా పెద్దపేగు క్యాన్సర్ వస్తుందని తెలిసిందే. ఈ సమస్య బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఒకప్పుడు 50 ఏళ్లు దాటిన వారిలోనే ఈ సమస్య కనిపించేది. కానీ తాజాగా 30 ఏళ్ల వయస్సు వారు కూడా ఈ పెద్ద పేగు క్యాన్సర్ బారిన పడుతున్నారు.
ఇదిలా ఉంటే పెద్ద పేగు క్యాన్సర్‌కు చెక్ పెట్టాలంటే తీసుకునే ఆహారంలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. త్వరగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవడం వల్ల పెద్ద పేగు క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయని నిపుణులు సూచిస్తున్నారు. అయితే కేవలం ఫైబర్ మాత్రమే కాకుండా మరో అంశం కూడా పెద్దపేగు క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని తగ్గిస్తుందని తాజాగా నిపుణులు అంటున్నారు.
భవిష్యత్తులో పెద్దపేగు క్యాన్సర్ బారినపడకూడదని అనుకుంటే తీసుకునే ఆహారంలో కచ్చితంగా తగినంత క్యాల్షియం ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు. రోజులో కనీసం 300 మి.గ్రా. క్యాల్షియం తీసుకునే మహిళలకు పెద్దపేగు లేదా మలాశయ క్యాన్సర్ ముప్పు 17% తగ్గుతున్నట్టు తాజా అధ్యయనంలో తేలింది. కేవలం పాలు, పాల పదార్థాలతోనే కాదు.. ఆకు కూరల వంటి వాటితోనూ క్యాల్షియం లభించేలా చూసుకున్నా ఇలాంటి ఫలితమే కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
అయితే క్యాల్షియం ట్యాబ్లెట్స్‌తో ఈ ప్రయోజనం ఉంటుందా లేదా అనే దాన్ని పరిశోధకులు ఇంకా పరీక్షించాల్సి ఉంది. పెద్ద పేగులోని పైత్య రసాలు, సంచార కొవ్వు ఆమ్లాలకు క్యాల్షియం అంటుకొని బయటకు వెళ్లేలా చేస్తుంది. ఇలా ఇది క్యాన్సర్ కారక ప్రభావాలను తగ్గిస్తున్నట్టు తేలిందని పరిశోధకులు అంటున్నారు. పైత్య రసాలు, కొవ్వు ఆమ్లాలు లోపల పోగవకుండా పెద్దపేగు వాటిని తేలికగా వదిలించుకోవడానికి వీలు కల్పిస్తోందన్న మాట. కాబట్టి క్యాల్షియం లభించే పదార్థాలను కచ్చితంగా ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.