Pregnancy : గర్భిణీలకు అలర్ట్.. డాక్టర్ సలహా లేకుండా పారాసెటమాల్, ఐబుప్రోఫెన్ వాడుతున్నారా ?
గర్భధారణ సమయంలో ఒక మహిళ శరీరం అనేక మార్పులకు లోనవుతుంది. ఈ కీలకమైన దశలో తల్లి, బిడ్డ ఇద్దరి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరం.
Pregnancy : గర్భిణీలకు అలర్ట్.. డాక్టర్ సలహా లేకుండా పారాసెటమాల్, ఐబుప్రోఫెన్ వాడుతున్నారా ?
Pregnancy : గర్భధారణ సమయంలో ఒక మహిళ శరీరం అనేక మార్పులకు లోనవుతుంది. ఈ కీలకమైన దశలో తల్లి, బిడ్డ ఇద్దరి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరం. కొన్నిసార్లు గర్భిణులకు నొప్పి, జ్వరం, ఇన్ఫెక్షన్లు లేదా విటమిన్ల లోపం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇలాంటి సమయాల్లో వైద్యుల సలహా మేరకు మందులు వాడాల్సి వస్తుంది. అయితే, అన్ని మందులు సురక్షితమైనవి కావు. కొన్ని మందులు గర్భంలో పెరుగుతున్న శిశువు అభివృద్ధిని ప్రభావితం చేయవచ్చు లేదా తల్లికి సైడ్ ఎఫెక్ట్స్‌ను కలిగించవచ్చు. కాబట్టి, మందుల వాడకంలో చాలా జాగ్రత్త అవసరం.
గర్భిణీలు ఏ మందులు తీసుకోకూడదు?
గర్భిణీలు కొన్ని రకాల మందులను డాక్టర్ పర్యవేక్షణ లేకుండా అస్సలు తీసుకోకూడదు. సాధారణంగా నొప్పి, జ్వరం కోసం వాడే పారాసెటమాల్, ఐబుప్రోఫెన్ వంటివి డాక్టర్ సలహా లేకుండా తీసుకోకూడదు. కొన్ని రకాల యాంటీబయాటిక్స్ కూడా బిడ్డకు హానికరం. ఆస్పిరిన్, ఇతర బ్లడ్ థిన్నర్ మందులు గర్భస్రావం ప్రమాదాన్ని పెంచుతాయి. అంతేకాకుండా, కొన్ని హెర్బల్ మందులు, ఓవర్-ది-కౌంటర్ మందులు కూడా సురక్షితమైనవి కావు. కొన్ని మందుల వల్ల బిడ్డ అవయవాలు, ముఖ్యంగా గుండె, కిడ్నీలు, మెదడు అభివృద్ధిపై ప్రభావం పడవచ్చు. అందుకే గర్భిణులు ఎల్లప్పుడూ డాక్టర్ సలహా మేరకే మందులు తీసుకోవాలి, సొంతంగా ఎట్టిపరిస్థితుల్లోనూ మందులు వాడకూడదు.
తప్పుడు మందుల వాడకంతో కలిగే నష్టాలు
గర్భిణీలు తప్పుడు మందులు వాడటం వల్ల కలిగే తీవ్రమైన పరిణామాలు తలెత్తే ప్రమాదం ఉంది. బిడ్డకు గుండె, చేతులు, కాళ్లు, మెదడు, వెన్నెముకలో పుట్టుకతోనే సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా గర్భధారణ ప్రారంభ నెలల్లో కొన్ని మందుల వల్ల గర్భస్రావం అయ్యే ప్రమాదం ఉంది. తల్లికి కాలేయం లేదా కిడ్నీ సమస్యలు, రక్తస్రావం, అలర్జీలు లేదా చర్మంపై దద్దుర్లు వంటి సమస్యలు తలెత్తవచ్చు.
కొన్ని మందుల ప్రభావం బిడ్డ పుట్టిన తర్వాత కూడా కనిపించవచ్చు. ఉదాహరణకు, నరాల వ్యవస్థ బలహీనపడటం, నేర్చుకునే సామర్థ్యం తగ్గడం లేదా ప్రవర్తనలో మార్పులు రావచ్చు. యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్, హెర్బల్ మందులు తెలియకుండానే నష్టాన్ని కలిగించవచ్చు. అందుకే గర్భధారణ సమయంలో ఏ మందును తీసుకునే ముందు డాక్టర్ సలహా, పూర్తి సమాచారం తెలుసుకోవడం చాలా ముఖ్యం.
గర్భిణీలు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు
గర్భధారణ సమయంలో మందుల వాడకంలో తీసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు ఇక్కడ ఉన్నాయి. ఎల్లప్పుడూ డాక్టర్ సలహా లేకుండా ఎలాంటి మందులూ తీసుకోకండి. డాక్టర్ సూచించిన మోతాదు, సమయాన్ని కచ్చితంగా పాటించండి. హెర్బల్, ఓవర్-ది-కౌంటర్ మందుల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి, అవి సురక్షితమైనవి కాకపోవచ్చు. ఏదైనా కొత్త మందు లేదా సప్లిమెంట్ తీసుకునే ముందు డాక్టర్‌ను తప్పకుండా సంప్రదించండి. మందులు తీసుకునేటప్పుడు లేబుల్, ఎక్స్‌పైరీ డేట్ తప్పకుండా తనిఖీ చేయండి. మందుల వల్ల ఏదైనా సైడ్ ఎఫెక్ట్ కనిపిస్తే, వెంటనే డాక్టర్‌కు తెలియజేయండి. ఈ జాగ్రత్తలు పాటించడం ద్వారా తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉంటారు.