Peanuts : వేరుశనగలు తింటే బరువు పెరుగుతారా? తగ్గుతారా? అసలు నిజం ఇదే

Peanuts : చలికాలం వచ్చిందంటే చాలు.. వేడివేడి వేరుశనగ పప్పులు తినడం అందరికీ ఇష్టమే. వీటిని పేదల బాదం అని కూడా పిలుస్తారు.

Update: 2026-01-09 08:30 GMT

Peanuts : వేరుశనగలు తింటే బరువు పెరుగుతారా? తగ్గుతారా? అసలు నిజం ఇదే

Peanuts: చలికాలం వచ్చిందంటే చాలు.. వేడివేడి వేరుశనగ పప్పులు తినడం అందరికీ ఇష్టమే. వీటిని పేదల బాదం అని కూడా పిలుస్తారు. అయితే, వేరుశనగలు తింటే బరువు పెరుగుతారని కొందరు, లేదు బరువు తగ్గుతారని మరికొందరు వాదిస్తుంటారు. మరి ఇందులో నిజమెంత? వేరుశనగలు బరువు పెంచుతాయా లేక తగ్గిస్తాయా? అసలు వీటిని ఎలా తింటే ఆరోగ్యానికి మంచిది? వంటి ఆసక్తికర విషయాలు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం.

చాలామంది వేరుశనగల్లో కేలరీలు ఎక్కువగా ఉంటాయని, వీటిని తింటే బరువు పెరుగుతామని భయపడుతుంటారు. వేరుశనగలు బరువు తగ్గడానికి కూడా సహాయపడతాయి. పల్లీల్లో ప్రొటీన్ శాతం చాలా ఎక్కువ. పరిశోధనల ప్రకారం అధిక ప్రొటీన్ ఉండే ఆహారం తీసుకోవడం వల్ల శరీరానికి త్వరగా ఆకలి వేయదు. వేరుశనగలో ఉండే దాదాపు 25% కేలరీలు ప్రొటీన్ నుంచే వస్తాయి. ఇవి తిన్నప్పుడు కడుపు నిండుగా ఉన్న అనుభూతి కలుగుతుంది, తద్వారా మీరు జంక్ ఫుడ్ లేదా అదనపు ఆహారం తీసుకోకుండా అడ్డుకుంటుంది. ఇది బరువు నియంత్రణకు దోహదం చేస్తుంది.

వేరుశనగలో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు ఎంతో మేలు చేస్తుంది. అయితే పల్లీలను మీరు ఎలా తింటున్నారనే దానిపైనే బరువు పెరగడం లేదా తగ్గడం ఆధారపడి ఉంటుంది. పచ్చి వేరుశనగలను ఉడకబెట్టుకుని లేదా దోరగా వేయించుకుని తింటే మేలు జరుగుతుంది. కానీ, అదే పల్లీలను నూనెలో లేదా నెయ్యిలో వేయించి, ఉప్పు దట్టించి తింటే మాత్రం ఖచ్చితంగా బరువు పెరుగుతారు. నూనెలో వేయించినప్పుడు వాటిలో కేలరీల శాతం అమాంతం పెరిగిపోతుంది.

మన దగ్గర వేరుశనగలను బెల్లంతో కలిపి తినే అలవాటు ఎప్పటి నుంచో ఉంది. ఇది ఆరోగ్యానికి ఎంతో శ్రేష్ఠమైన కాంబినేషన్. బెల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, పల్లీల్లో ప్రొటీన్ ఉంటుంది. ఈ రెండూ కలిపి తీసుకుంటే శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది, రక్తహీనత సమస్య తగ్గుతుంది. అయితే అతిగా తినడం ఏ వస్తువుకైనా మంచిది కాదు. రోజుకు 25 గ్రాముల కంటే ఎక్కువ వేరుశనగలు తీసుకోకూడదని నిపుణులు సూచిస్తున్నారు.

ఎవరు తినకూడదు?

వేరుశనగలు అందరికీ పడవు. ముఖ్యంగా ఈ కింద పేర్కొన్న సమస్యలు ఉన్నవారు పల్లీలకు దూరంగా ఉండటం లేదా వైద్యులను సంప్రదించి తీసుకోవడం ఉత్తమం:

మలబద్ధకం: తీవ్రమైన మలబద్ధకం సమస్య ఉన్నవారు పల్లీలు ఎక్కువగా తినకూడదు.

అలర్జీ: వేరుశనగ అలర్జీ ఉన్నవారు పొరపాటున కూడా వీటిని ముట్టుకోకూడదు, ఇది ప్రాణాంతకం కావచ్చు.

అతి తక్కువ బరువు: ఇప్పటికే చాలా సన్నగా ఉండి బరువు పెరగాలనుకునే వారు డైటీషియన్ సలహాతో సరైన పద్ధతిలో తీసుకోవాలి.

కిడ్నీ సమస్యలు: మూత్రపిండాల వ్యాధులు, అధిక రక్తపోటు ఉన్న రోగులకు వేరుశనగలు అంత మంచిది కాదు. వీటిలోని సోడియం లేదా ఇతర ఆమ్లాలు కిడ్నీపై ఒత్తిడి పెంచే అవకాశం ఉంటుంది.

Tags:    

Similar News