Nail Health: మీ గోళ్లు మీ ఆరోగ్యం గురించి చెబుతాయి.. ఈ సంకేతాలను అస్సలు వదిలేయొద్దు!
Nail Health: ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి సరైన పోషకాలు అందడం చాలా ముఖ్యం.
Nail Health: మీ గోళ్లు మీ ఆరోగ్యం గురించి చెబుతాయి.. ఈ సంకేతాలను అస్సలు వదిలేయొద్దు!
Nail Health: ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి సరైన పోషకాలు అందడం చాలా ముఖ్యం. పోషకాలు సరిగా అందకపోతే ఆ ప్రభావం మన గోళ్లు, చర్మం, జుట్టుపై మొదట కనిపిస్తుంది. ముఖ్యంగా, మన గోళ్లలో కనిపించే మార్పులు మీ శరీరంలో పోషకాల కొరత ఉందని సూచిస్తాయి. శరీరానికి కావాల్సిన విటమిన్లు, మినరల్స్ తక్కువైనప్పుడు, గోళ్లు కొన్ని సంకేతాలు ఇస్తాయి. పసుపు లేదా తెల్లటి గోళ్లు, బలహీనంగా విరిగిపోవడం, గోళ్లపై గీతలు పడటం, పగిలిపోవడం లేదా గోళ్లలో చిన్న గుంతలు పడటం వంటివి వీటిలో కొన్ని. ముఖ్యంగా శరీరంలో ఐరన్ తక్కువైతే గోళ్లు చెంచాలాగా లోపలికి వంపు తిరుగుతాయి. బయోటిన్ కొరత ఉంటే గోళ్లు బలహీనంగా మారి విరిగిపోతాయి, అలాగే విటమిన్ B12 తక్కువైతే గోళ్లు పెళుసుగా మారతాయి. ఈ లక్షణాలు కనిపిస్తే, రక్తహీనత, థైరాయిడ్ లేదా కాలేయ సమస్యలు కూడా ఉండొచ్చు. వెంటనే డాక్టర్‌ను కలవడం మంచిది.
పోషకాల కొరతను సరిచేసుకోవడానికి మీ ఆహారంలో మార్పులు చేసుకోవాలి. ప్రతిరోజూ ఆకుకూరలు, పప్పులు, తాజా పండ్లు, డ్రై ఫ్రూట్స్ తినడం చాలా అవసరం. అలాగే, గుడ్లు, పాలు, పెరుగు, చేపలు వంటి ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. ఐరన్ కోసం పాలకూర, బీట్‌రూట్, దానిమ్మ, బెల్లం; బయోటిన్ కోసం గుడ్డు పచ్చసొన, వేరుశెనగలు; విటమిన్ D కోసం పాలు, పెరుగు, ఎండలో ఉండటం మంచిది. ఒకవేళ ఆహారం ద్వారా సరిపడా పోషణ అందట్లేదనిపిస్తే, డాక్టర్ సలహా మేరకు మాత్రమే మల్టీవిటమిన్ లేదా ఇతర సప్లిమెంట్లు తీసుకోవచ్చు. మీరే సొంతంగా ఏ మందులు వాడకండి.
ఆరోగ్యంగా ఉండటానికి కొన్ని చిట్కాలు కూడా పాటించాలి. రోజూ ఉదయం మంచి పౌష్టిక అల్పాహారం తీసుకోవాలి. ప్రతి భోజనంలో ప్రొటీన్లు, ఫైబర్, విటమిన్లు ఉండేలా చూసుకోవాలి. బయటి ఫాస్ట్ ఫుడ్, ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి. శరీరం డీహైడ్రేట్ కాకుండా సరిపడా నీళ్లు తాగాలి. ఒత్తిడి తగ్గించుకొని, సరిపడా నిద్ర పోవడం కూడా చాలా ముఖ్యం. అప్పుడప్పుడు బ్లడ్ టెస్టులు చేయించుకొని మీ ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవడం వల్ల, ఏవైనా పోషకాల లోపాలు ఉంటే వాటిని ముందుగానే గుర్తించి సరిచేసుకోవచ్చు.