వుహాన్ హాస్పిటల్ డైరెక్టర్ COVID-19 తో మృత్యువాత

Update: 2020-02-18 08:34 GMT

కరోనావైరస్ వ్యాప్తికి కేంద్రంగా ఉన్న చైనా కేంద్ర నగరమైన వుహాన్ లో ఒక ప్రముఖ ఆసుపత్రి అధిపతి మంగళవారం కోవిడ్-19 తో మరణించారు. దీంతో వైరస్ భారిన పడి మృతిచెందిన వైద్యులలో ఆయన రెండవ ప్రముఖ వ్యక్తి అయ్యారు. వుహాన్ వుచాంగ్ హాస్పిటల్ డైరెక్టర్ లియు జిమింగ్ ఉదయం 10:30 గంటలకు మరణించారని అధికారిక టెలివిజన్ వెల్లడించింది. కాగా ఈ నెల ప్రారంభంలో, కరోనావైరస్ గురించి ముందస్తు హెచ్చరిక జారీ చేసిన వైద్యుడు లి వెన్లియాంగ్ మరణానికి చైనాలో లక్షలాది మంది సంతాపం తెలిపారు. లి మరణం మాదిరిగా, సోమవారం రాత్రి లియు పరిస్థితి గురించి చైనా ఇంటర్నెట్‌లో గందరగోళం నెలకొంది.

సోమవారం రాత్రి, హుబీ హెల్త్ కమిషన్ యొక్క కమ్యూనిస్ట్ పార్టీ ప్రచార విభాగం సోషల్ మీడియా పోస్టులో లియు మరణించినట్లు రాసింది. ఆ తరువాత కొద్దేసేపటికే పోస్ట్‌లో మార్పు చేసి లియు సజీవంగానే ఉన్నారని పేర్కొంది. ఆ తరువాత "లియు బంధువు వెల్లడించిన వివరాల ప్రకారం, ఆసుపత్రి వైద్య సిబ్బంది అతన్ని రక్షించడానికి ఇంకా ప్రయత్నిస్తోందని కమిషన్ తన రెండవ పోస్ట్‌లో పేర్కొంది. అయితే మంగళవారం ఉదయం లియు మరణాన్ని రాష్ట్ర టెలివిజన్ అధికారికంగా ప్రకటించినప్పటికి ఈ కమిషన్ ఎటువంటి సందేశాన్ని పోస్ట్ చేయలేదు. మరోవైపు1,716 మంది ఆరోగ్య కార్యకర్తలు కరోనావైరస్ బారిన పడ్డారని , వారిలో ఆరుగురు మరణించారని చైనా సీనియర్ ఆరోగ్య అధికారి ఒకరు తెలిపారు.

ఇదిలావుంటే చైనాలో కోవిడ్-19 (కరోనా వైరస్) మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. మంగళవారం నాటికి మొత్తం 1,868 మంది ఈ వైరస్ భారిన పడి మరణించారు. అలాగే నిన్న ఒక్కరోజే 98 మరణాలను సంభవించాయి, ఇందులో 90 శాతం హుబే ప్రావిన్స్ లోనే నమోదయ్యాయి. ఇక మంగళవారం 1,886 కొత్త వైరస్ కేసులు నమోదుకాగా.. అవి దాదాపు సాధారణమేనని చైనా ఆరోగ్య శాఖ తేల్చింది. వైరస్ వ్యాప్తి తగ్గుతున్నా.. మరణాల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. ఇక ధృవీకరించిన మొత్తం కేసులు 72,436 గా నమోదయ్యాయి. 

Tags:    

Similar News