Vivek Ramaswamy: ప్రచారంలో వివేక్ దూకుడు.. ఆరు రోజుల్లో 42 ఈవెంట్లు

Vivek Ramaswamy: ట్రంప్ తర్వాతి స్థానంలో వివేక్

Update: 2023-12-17 15:15 GMT

Vivek Ramaswamy: ప్రచారంలో వివేక్ దూకుడు.. ఆరు రోజుల్లో 42 ఈవెంట్లు

Vivek Ramaswamy: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున అభ్యర్థిత్వం కోసం పోటీపడుతున్న భారతీయ అమెరికన్‌ వివేక్‌ రామస్వామి ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఆరు రోజుల్లో ఏకంగా 42 ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు యూఎస్‌ఏ టుడే సంస్థ వెల్లడించింది. వచ్చే వారం కూడా 38 ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆయన ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన మిగిలిన వారి కంటే చాలా ముందున్నట్లు పేర్కొంది. ప్రచారంలో అంత ఉత్సాహంగా ఎలా పాల్గొంటున్నారన్న ప్రశ్నకు స్పందించిన వివేక్‌.. తన సభలకు వస్తున్న ప్రజల నుంచే ప్రేరణ పొందుతున్నట్లు తెలిపారు.

తన ప్రచార కార్యక్రమాలకు హాజరవుతున్న ప్రజలను చూస్తుంటే.. ఎంతో శక్తి లభిస్తోందని వివేక్ చెప్పారు. దేశం పట్ల వారికున్న శ్రద్ధే తనను ప్రోత్సహిస్తోందని... మీడియా, సోషల్ మీడియా కూడా ఈ స్థాయి ప్రచారం అసాధ్యమని పేర్కొన్నారు. విరాళాల కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించటం కంటే పిజ్జా అవుట్‌లెట్లలో ప్రజలతో సంభాషించడం మేలని తాను భావిస్తున్నట్లు వివేక్ తెలిపారు. రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిగా తన ఎన్నికపై పూర్తి విశ్వాసం ఉందని వివేక్‌ చెప్పారు.

అమెరికా అధ్యక్ష ఎన్నిక్లలో అభ్యర్థిత్వం కోసం రిపబ్లికన్ పార్టీ తరపున మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ సహా ఐదుగురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వారిలో భారతీయ అమెరికన్లు వివేక్‌ రామస్వామి, నిక్కీ హేలీతోపాటు ఫ్లోరిడా గవర్నర్‌ రాన్‌ డీశాంటిస్‌, న్యూజెర్సీ మాజీ గవర్నర్ క్రిస్ క్రిస్టీ కూడా పోటీలో ఉన్నారు. ప్రస్తుతం 60 శాతం రిపబ్లికన్‌ ఓటర్ల మద్దతుతో ట్రంప్‌ ఈ రేసులో ముందంజలో ఉన్నారు. తర్వాతి స్థానంలో వివేక్‌ కొనసాగుతున్నారు.

మరో వైపు వివేక్ నిర్వహిస్తున్న సమావేశాలకు ప్రజలు పెద్దఎత్తున తరలివస్తున్నారు. అమెరికాలో నివసిస్తున్న భారతీయుల కంటే అమెరికన్లే ఎక్కువగా వివేక్ ప్రసంగాలకు ఆకర్షితులవుతున్నారు. నిర్మోహమాటంగా తన వైఖరిని వెల్లడిస్తూ వివేక్ తన క్యాంపెయిన్‌లో దూసుకుపోతున్నారు. తాను హిందువునని.. పొలిటికల్‌ కెరీర్‌ కోసం మతం మారబోనని వివేక్‌ రామస్వామి స్పష్టం చేశారు. హిందూ నేతను అమెరికా అధ్యక్షుడిగా అంగీకరిస్తుందా అని మీడియా ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పారు వివేక్. తాను హిందువుని అని.. రాజకీయాలు, పదవుల కోసం హిందూ మతం మారనని తేల్చి చెప్పారు. హిందూ మతం, క్రైస్తవ మతం ఉమ్మడి విలువలు కలిగి ఉంటాయని వివేక్ రామస్వామి.. తాను రాజకీయంగా జీవితంలో ఎదగాలనుకుంటే మతం మార్చుకోవచ్చు కానీ తాను అలా చేయబోనని పేర్కొన్నారు.

మరోవైపు.. ఇటీవల వివేక్ రామస్వామికి బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపింది. వివేక్ రామస్వామితోపాటు ఆయన నిర్వహించే ఎన్నికల డిబేట్‌కు హాజరైన ప్రతీ ఒక్కరినీ చంపేస్తానని ఓ అజ్ఞాత వ్యక్తి మెసేజ్ పంపించడం తీవ్ర సంచలనంగా మారింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. అనుమానితుడిని అరెస్ట్ చేశారు. న్యూహాంప్‌షైర్‌లోని డోవర్‌ నుంచి ఈ బెదిరింపు మెసేజ్‌లు వచ్చినట్లు గుర్తించిన పోలీసులు 30 ఏళ్ల టైలర్‌ అండర్సన్‌ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో నేరం రుజువైతే.. టైలర్ అండర్సన్‌కు ఐదేళ్ల జైలు శిక్షతో పాటు 2.50 లక్షల డాలర్ల జరిమానా పడే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Tags:    

Similar News