Global market crash: ట్రంప్ నిర్ణయాల షాక్...ప్రపంచ మార్కెట్లు కుప్పకూలాయి, భారత్‌లో భారీ నష్టం
Global market crash: ట్రంప్ విధానపరమైన నిర్ణయాల ప్రభావంతో ప్రపంచ స్టాక్ మార్కెట్లు పతనమయ్యాయి. భారత్‌లో ఒక్క రోజులోనే రూ.10 లక్షల కోట్ల పెట్టుబడిదారుల సంపద ఆవిరైంది.
Global market crash: ట్రంప్ నిర్ణయాల షాక్...ప్రపంచ మార్కెట్లు కుప్పకూలాయి, భారత్‌లో భారీ నష్టం
Global market crash : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న వరుస విధానపరమైన నిర్ణయాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్నాయి. ‘అమెరికా ఫస్ట్’ విధానంతో ముందుకెళ్తున్న ట్రంప్ నిర్ణయాలు గ్లోబల్ మార్కెట్ల సెంటిమెంట్‌ను దారుణంగా దెబ్బతీశాయి. ఇరాన్, యూరోపియన్ దేశాలు, గ్రీన్‌ల్యాండ్ అంశాలపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు, సుంకాల హెచ్చరికలతో ప్రపంచ స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా పతనమయ్యాయి.
ట్రంప్ తాజా నిర్ణయాల నేపథ్యంలో జనవరి 20న భారత స్టాక్ మార్కెట్లు తీవ్రంగా నష్టపోయాయి. సెన్సెక్స్ 1066 పాయింట్లు, నిఫ్టీ 353 పాయింట్లు కోల్పోయాయి. ఇది గత మూడు నెలల కనిష్ఠ స్థాయిగా నమోదైంది. ఒక్క రోజులోనే దాదాపు రూ.10 లక్షల కోట్ల పెట్టుబడిదారుల సంపద ఆవిరైంది. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.465 లక్షల కోట్ల నుంచి రూ.455 లక్షల కోట్లకు తగ్గింది.
ట్రంప్ సుంకాల హెచ్చరికలు యూరోప్ మార్కెట్లను కూడా ప్రభావితం చేశాయి. అమెరికా మార్కెట్లు సైతం నెగటివ్‌గా స్పందించాయి. నాస్‌డాక్ 2.39 శాతం, ఎస్ అండ్ పీ 500 సూచీ 2.06 శాతం, డౌ జోన్స్ 1.76 శాతం నష్టపోయాయి. ఇది గత అక్టోబర్ తర్వాత అత్యంత దారుణమైన రోజుగా మార్కెట్ వర్గాలు అభివర్ణిస్తున్నాయి.
యూరోపియన్ మార్కెట్లలో జర్మనీ 1.03 శాతం, ఫ్రాన్స్ 1.78 శాతం, యూకే 0.67 శాతం పతనం నమోదు చేశాయి. ఆసియాలో జపాన్ నిక్కీ 225 సూచీ 1.11 శాతం తగ్గింది. అయితే చైనా మార్కెట్ మాత్రం స్వల్ప లాభాలతో నిలిచింది. చైనా ప్రభుత్వం తీసుకున్న తక్షణ ఆర్థిక ఉపశమన చర్యలే ఇందుకు కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు.
మరోవైపు ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి పెరగడంతో పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడుల వైపు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. అదే సమయంలో భారత రూపాయి అమెరికా డాలర్‌తో పోలిస్తే ఆల్‌టైమ్ కనిష్ఠ స్థాయికి పడిపోయి జనవరి 20న రూ.90.97 వద్ద ట్రేడ్ అయింది. ట్రంప్ నిర్ణయాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఎంతటి ప్రభావం చూపిస్తున్నాయో ఈ పరిణామాలు స్పష్టంగా చూపిస్తున్నాయి.