Pakistan: భయపడ్డ పాకిస్థాన్.. సాయం చేయాలంటూ పుతిన్ దగ్గర కాళ్లబేరానికి శత్రుదేశం..! ఏం కోరిందంటే?
Pahalgam attack: పహల్గామ్ దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత గణనీయంగా పెరిగింది. భారత్ తీసుకుంటున్న నిరంతర చర్యల కారణంగా పాకిస్తాన్ భయపడుతోంది. అందుకే ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి పాకిస్తాన్ ఇప్పుడు రష్యా సహాయం కోరింది. మాస్కోలో పాకిస్తాన్ రాయబారి మొహమ్మద్ ఖలీద్ జమాలీ ఉద్రిక్తతలను తగ్గించడంలో రష్యా సహాయం కోరారు. మరో ప్రకటనలో, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ భారత్, పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇరు దేశాలు సంయమనం పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఒక ఇంటర్వ్యూలో పాకిస్తాన్ రాయబారి మొహమ్మద్ ఖలీద్ జమాలి మాట్లాడుతూ, రష్యాకు భారతదేశంతో ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం ఉందని అన్నారు. రష్యాకు పాకిస్తాన్ తో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. తాష్కెంట్ ఒప్పందాన్ని ప్రస్తావిస్తూ జమాలి రష్యాతో మధ్యవర్తిత్వం గురించి మాట్లాడారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి రష్యా తన మంచి సంబంధాలను ఉపయోగించుకోగలదని ఆయన అన్నారు. 1966లో అప్పటి సోవియట్ యూనియన్ భారత్, పాకిస్తాన్ మధ్య తాష్కెంట్ ఒప్పందంపై సంతకం చేసింది. ఈ ఒప్పందం తర్వాత రెండు దేశాల మధ్య యుద్ధం ముగిసింది.
రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ రెండు దేశాలు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. భారతదేశం, పాకిస్తాన్ మధ్య సరిహద్దులో పెరుగుతున్న వివాదంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో పాకిస్తాన్ ఉప ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రి ఇషాక్ జార్ రష్యా విదేశాంగ మంత్రితో టెలిఫోన్ ద్వారా మాట్లాడారని తెలిపింది. ఈ సమయంలో డార్ పరిస్థితి గురించి లావ్రోవ్‌కు తెలిపాడు. "పరిస్థితిపై లావ్రోవ్ ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యలను పరిష్కరించడానికి దౌత్య ప్రయత్నాల ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు" అని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇరు పక్షాలు సంయమనం పాటించాలని, ఉద్రిక్తతలు పెరగకుండా నిరోధించాలని ఆయన నొక్కి చెప్పారు.