Iran Protests: ఇరాన్‌లో ఆందోళనలు వందలు కాదు.. వేలాది మంది మృతి చెందినట్టేనా?
Iran Protests: ఇరాన్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొనసాగుతున్న ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. ఈ నిరసనల్లో భారీ సంఖ్యలో ప్రాణనష్టం జరిగినట్లు అంతర్జాతీయ స్థాయిలో ఆందోళన వ్యక్తమవుతోంది.
Iran Protests: ఇరాన్‌లో ఆందోళనలు వందలు కాదు.. వేలాది మంది మృతి చెందినట్టేనా?
Iran Protests: ఇరాన్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొనసాగుతున్న ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. ఈ నిరసనల్లో భారీ సంఖ్యలో ప్రాణనష్టం జరిగినట్లు అంతర్జాతీయ స్థాయిలో ఆందోళన వ్యక్తమవుతోంది. అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటివరకు 600 మందికి పైగా మరణించగా, వాస్తవ సంఖ్య రెండు వేల వరకు ఉండొచ్చని ఇరాన్ అధికారులు సంకేతాలు ఇస్తున్నారు. అయితే, కొన్ని మీడియా కథనాలు ఈ సంఖ్య మరింత భయంకరంగా ఉండొచ్చని చెబుతున్నాయి.
ఇరాన్‌లో పెరుగుతున్న హింసపై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంఘం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇదే సమయంలో ‘ఇరాన్ ఇంటర్నేషనల్’ అనే వెబ్‌సైట్ సంచలన కథనాన్ని ప్రచురించింది. ఇటీవల జరిగిన ఆందోళనల్లో పది వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్లు ఆ కథనంలో పేర్కొంది.
కనీవినీ ఎరుగని హింస
దేశవ్యాప్తంగా జరిగిన ఘర్షణల్లో పౌరులతో పాటు భద్రతా సిబ్బంది కూడా మృతి చెందినట్లు ఇరాన్ అధికారులు అంతర్జాతీయ మీడియాకు తెలిపారు. ఈ హింసాత్మక ఘటనల వెనుక ఉగ్రవాదులు ఉన్నారని వారు ఆరోపించారు. అయితే, భద్రతా సంస్థలు, అధ్యక్ష కార్యాలయం, ప్రత్యక్ష సాక్షులు, వైద్య వర్గాల సమాచారం ఆధారంగా జనవరి 8, 9 తేదీల్లోనే సుమారు 12 వేల మంది మరణించి ఉండొచ్చని ‘ఇరాన్ ఇంటర్నేషనల్’ వెల్లడించింది. ఆధునిక ఇరాన్ చరిత్రలో ఇంతటి స్థాయిలో హింస ఎప్పుడూ జరగలేదని ఆ కథనం పేర్కొంది.
మరణశిక్ష భయం పెరుగుతోంది
అమెరికా కేంద్రంగా పనిచేసే మానవ హక్కుల కార్యకర్తల సంస్థ ప్రకారం, ఇరాన్‌లోని 31 ప్రావిన్సుల్లో 600కుపైగా ప్రాంతాల్లో నిరసనలు జరిగాయి. వందలాది మంది మృతి చెందగా, 10 వేల మందికిపైగా నిరసనకారులను పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే పరిస్థితి మరింత తీవ్రంగా మారే ప్రమాదం ఉందని ఐరాస మానవ హక్కుల హైకమిషనర్ హెచ్చరించారు. ప్రజల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తప్పకుండా వినాలని ఆయన సూచించారు.
అంతేకాదు, అరెస్టైన వారిలో చాలామందికి మరణశిక్ష పడే అవకాశం ఉందనే భయాన్ని ఐరాస అధికార ప్రతినిధి జెరెమీ లారెన్స్ వ్యక్తం చేశారు. ఇరాన్‌లో జరుగుతున్న ఈ పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు కారణమవుతున్నాయి.