India - China: చైనాతో కోర్‌ కమాండర్‌ స్థాయి చర్చలు విఫలం.. భారత ఆర్మీ ప్రకటన

*తూర్పు లడాఖ్‌లోని సరిహద్దు సమస్యలపై చర్చ *ఎల్ఏసీ వివాదాస్పద అంశాల పరిష్కారానికి అంగీకారం *భారత్ సూచలను అంగీకరించని చైనా

Update: 2021-10-11 07:15 GMT

చైనాతో చర్చలపై భారత ఆర్మీ ప్రకటన(ఫైల్ ఫోటో)

India - China: సరిహద్దుల్లోని ఎల్‌ఏసీ వెంబడి, తూర్పు లద్దాఖ్‌లో నెలకొన్న ప్రతిష్టంభనను పరిష్కరించుకునేందుకు భారత్‌, చైనా మధ్య ఆదివారం జరిగిన 13వ విడత కోర్‌ కమాండర్‌ స్థాయి చర్చలు ఫలించలేదు. అయితే వివాద పరిష్కారం కోసం భారత్‌ చేసిన సూచనలను చైనా అంగీకరించకపోవడమే ఇందుకు కారణమని భారత ఆర్మీ వెల్లడించింది.

సరిహద్దుల్లో దెప్సాంగ్‌ సహా ఉద్రిక్త ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణపై భారత్, చైనా మధ్య కోర్ కమాండర్‌ స్థాయి చర్చలు జరిగాయి. చైనా వైపు ఉన్న మోల్డో బోర్డర్‌ పాయింట్‌లో మొదలైన ఈ చర్చలు దాదాపు ఎనిమిదన్నర గంటల పాటు జరిగాయి. ఈ చర్చల్లో భారత్‌.. బలగాల ఉపసంహరణతో పాటు పలు అంశాలను లేవనెత్తింది. ద్వైపాక్షిక ఒప్పందాలను ఉల్లంఘిస్తూ చైనా బలగాల ఏకపక్ష చర్యలతో వాస్తవాధీన రేఖ వెంబడి నెలకొంటున్న ఉద్రిక్త పరిస్థితులను ప్రధానంగా ప్రస్తావించినట్లు భారత ఆర్మీ తాజాగా వెల్లడించింది.

నిన్న జరిగిన సమావేశంలో ఉద్రిక్త ప్రాంతాల్లో సమస్య పరిష్కారం కోసం భారత్‌ పలు నిర్మాణాత్మక సూచనలు చేసింది. కానీ చైనా వాటికి అంగీకరించలేదు. వివాదాన్ని పరిష్కరించుకునేందుకు వేరే ఎలాంటి ప్రతిపాదనలు కూడా చేయలేదు. దీంతో ఉద్రిక్త ప్రాంతాల్లో బలగాల ఉపసంహరణపై ఈ చర్చల్లో ఎలాంటి ఫలితం రాలేదు.

అయితే ఇరు దేశాల మధ్య సంబంధాల పూర్తి దృక్పథాన్ని చైనా పరిగణనలోకి తీసుకుంటుందని ద్వైపాక్షిక ఒప్పందాలు, ప్రొటోకాల్స్‌కు కట్టుబడి సరిహద్దు వివాదంపై సత్వర పరిష్కారానికి పొరుగు దేశం కృషి చేస్తుందని భావిస్తున్నామని భారత సైన్యం వెల్లడించింది.

Tags:    

Similar News