H-1B visa: హెచ్‌ 1బీ వీసాల కోసం కొత్త నిబంధనలు..

H-1B visa: చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు వ్యవహరిస్తోంది ట్రంప్ ప్రభుత్వం. హెచ్‌-1బీ వీసా రుసుమును లక్ష డాలర్లకు పెంచిన అగ్ర రాజ్యం కొత్త నిబంధనలు తీసుకువచ్చే పనిలో నిమగ్నమైంది.

Update: 2025-09-25 06:41 GMT

H-1B visa: చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు వ్యవహరిస్తోంది ట్రంప్ ప్రభుత్వం. హెచ్‌-1బీ వీసా రుసుమును లక్ష డాలర్లకు పెంచిన అగ్ర రాజ్యం కొత్త నిబంధనలు తీసుకువచ్చే పనిలో నిమగ్నమైంది. ఈ క్రమంలో అధిక వేతనాలు, నైపుణ్యం ఉన్న విదేశీయులను మాత్రమే అనుమతించడం ఇందులోని ముఖ్యాంశం. అలాగే అమెరికన్లకు ప్రాధాన్యం కల్పించే ఉద్దేశంతో ప్రస్తుతం ఉన్న లాటరీ విధానంలో కీలక మార్పులు తెచ్చే యోచనలో ఉంది అమెరికా ప్రభుత్వం. ఉద్యోగి వేతన స్థాయిని అనుసరించి నాలుగు ఎంట్రీ లెవల్స్ తీసుకొస్తున్నారు. మరోవైపు కొత్త వీసా విధానంలో డాక్టర్లు, మెడికల్ రెసిడెంట్లకు భారీ ఫీజు నుంచి మినహాయింపు ఇవ్వడం ఊరటనిస్తోంది.

హెచ్‌-1బీ వీసా రుసుమును ఏకంగా లక్ష డాలర్లకు పెంచేసి అందరినీ ఆందోళనకు గురి చేసిన అమెరికా.. ఇప్పుడు వీటికి సంబంధించి కొత్త నిబంధనలు తీసుకువచ్చే పనిలో నిమగ్నమైంది. ఆ వీసాలు జారీ చేయడానికి ప్రస్తుతం ఉన్న లాటరీ విధానంలో కీలక మార్పులు తెచ్చే యోచనలో ఉంది. ఇప్పటిదాకా హెచ్‌-1బీ వీసాల జారీకి అమెరికా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ DHS అనుసరిస్తున్న లాటరీ విధానంలో.. ఆ వీసాపై రావాలనుకునే దరఖాస్తుదారులంతా సమానమే. ప్రతిభ ఆధారంగాగానీ.. జీతం ఆధారంగాగానీ ఎవరికీ ఎలాంటి ప్రాధాన్యమూ ఇవ్వరు. వచ్చిన దరఖాస్తులన్నింటినీ తీసుకుని కంప్యూటరైజ్డ్‌ విధానంలో లాటరీ వేసేవారు. ఎంపికైనవారు అమెరికాకు వచ్చేవారు. ఈ క్రమంలోనే హెచ్‌-1బీ వీసా ఎంపిక ప్రక్రియలో ఈ మార్పులకు సంబంధించిన ప్రతిపాదనలను ఫెడరల్‌ రిజిస్ట్రార్‌ తాజాగా రిలీజ్​ చేసింది.

కొత్తగా ప్రతిపాదించిన హెచ్‌-1బీ వీసా విధానంలో వెయిటెడ్‌ సెలక్షన్‌ పద్ధతిని అనుసరిస్తారు. ఎక్కువ నైపుణ్యం ఉండి, అధిక జీతం అందుకునే వారికి ఎంపిక ప్రక్రియలో ఎక్కువ అవకాశాలు ఇస్తారు. కొత్తగా ఉద్యోగంలో చేరేవారికి తక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ఇందులో భాగంగా.. హెచ్‌-1బీ వీసాల కోసం వచ్చే దరఖాస్తులను.. ఎక్కువ జీతం -లెవెల్‌ 4, మధ్యస్థ జీతం -లెవెల్‌ 3, తక్కువ జీతం -లెవెల్‌ 2, ఎంట్రీ లెవెల్‌ అని నాలుగు రకాలుగా వర్గీకరిస్తారు. వీరిలో ఎక్కువ నైపుణ్యం, అధిక జీతం ఉండే లెవెల్‌ 4 వారికి సెలెక్షన్‌పూల్‌లో నాలుగు ఎంట్రీలు ఇస్తారు. మధ్యస్థ జీతం ఉన్నవారికి 3 ఎంట్రీలు, తక్కువ జీతం ఉన్నవారికి 2 ఎంట్రీలు, ప్రవేశస్థాయివారికి ఒక ఎంట్రీ ఇస్తారు. ఒక ఎంట్రీని ఒక టికెట్‌గా పరిగణిస్తే.. ఒక టికెట్‌ ఉన్నవారు ఎంపికయ్యే అవకాశం 20% ఉంటుంది. అదే నాలుగు టికెట్లు ఉన్నవారు ఎంపికయ్యే అవకాశం 80 % దాకా ఉంటుంది.

అమెరికన్లకు ప్రాధాన్యం కల్పించే ఉద్దేశంతో కొత్త హెచ్‌-1బీ వీసా విధానం రూపొందించినట్లు తెలుస్తోంది. అంటే.. ఎక్కువ నైపుణ్యం ఉన్నవారే అమెరికాలో అడుగుపెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. అలాంటివారి వల్ల తమ దేశానికి ఎక్కువ ప్రయోజనం చేకూరుతుందన్నది ట్రంప్‌ సర్కారు ఉద్దేశం. అలాగని అధిక జీతం, ఎక్కువ ప్రతిభ ఉన్నవారినే కాకుండా.. అన్ని స్థాయులవారికీ అవకాశాలు కల్పించేలాగా ఈ విధానాన్ని రూపొందించినట్టు ట్రంప్‌ యంత్రాంగం చెబుతోంది. ఈ కొత్త విధానం వల్ల.. హెచ్‌-1బీ వీసా వచ్చే అవకాశాన్ని మెరుగుపరిచేందుకకు కంపెనీలు తమ ఉద్యోగుల జీతాలు పెంచుతాయని.. ఇలా పెరిగే మొత్తం 502 మిలియన్‌ డాలర్ల దాకా అంటే.. దాదాపు రూ.4,400 కోట్లు ఉంటుందని DHS అంచనా వేస్తోంది. ఈ విధానం ప్రస్తుతానికి ప్రతిపాదన దశలోనే ఉంది. దీనిపై ప్రజలు, పరిశ్రమ వర్గాలు.. ఇలా అందరి అభిప్రాయాలు, సూచనలు, సలహాలను తీసుకున్నాకే కొత్త విధానానికి సంబంధించిన మార్గదర్శకాలు, నియమ, నిబంధనలను ఖరారు చేస్తారు.

అయితే.. లెవెల్‌ 1 ఉద్యోగాలకు హెచ్‌-1బీ వీసా కోసం దరఖాస్తు చేసే చిన్న కంపెనీలపై ఈ విధానం వల్ల ఎక్కువగా భారం పడే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. చిన్నవే అయినప్పటికీ.. ఎక్కువ జీతాలిచ్చే ఉద్యోగాలు కల్పించే కంపెనీలకు మాత్రం ఈ విధానం ఎక్కువగా ఉపయోగపడుతుందని పేర్కొంటున్నారు. ట్రంప్‌ సర్కారు ప్రతిపాదిస్తున్న ఈ కొత్త విధానం.. అడ్వాన్స్‌డ్‌ డిగ్రీలు కలిగి ఉండి, అత్యధిక వేతనాలు అందుకునే భారతీయ సీనియర్‌ టెకీలకు ప్రయోజనకరమని, కొత్తగా ఉద్యోగంలో చేరేవారికి మాత్రం దీనివల్ల నష్టమేనని వారు వివరిస్తున్నారు.

ఈ కొత్త నిబంధనలను వచ్చే ఏడాది నుంచి అమలు చేసేందుకు ప్రణాళికలు రచిస్తుంది అమెరికా ప్రభుత్వం. ఒకవేళ ఇవి అమల్లోకి వస్తే హెచ్‌-1బీ ఉద్యోగులకు చెల్లించే మొత్తం వేతనాలు 2026 ఆర్థిక సంవత్సరంలో 502 మిలియన్‌ డాలర్లకు పెరుగుతాయని డీహెచ్‌ఎస్‌ అంచనా వేసింది. 2027లో 1 బిలియన్‌ డాలర్లు, 2028లో 1.5బి.డాలర్లు, 2029లో 2 బి.డాలర్లు పెరిగే అవకాశం ఉందని తెలిపింది.

అమెరికాలో కొరత ఉన్న రంగాల్లో ఉన్నత విద్యావంతులు, నిపుణులైన విదేశీ నిపుణులను నియమించుకోవడానికి 1990లో ప్రారంభమైన H-1B వీసా కార్యక్రమాన్ని తీసుకువచ్చారు. ఈ వీసా కార్యక్రమం కింద భారత్‌కు చెందిన అనేక కంపెనీలు ప్రయోజనం పొందుతూ, వేలాది మంది నిపుణులను అమెరికాకు పంపిస్తున్నాయి. ఏడాదికి సుమారుగా 6,50,000 వీసాలను అందిస్తుండగా, మరో 20,000 వీసాలను అమెరికాలో డిగ్రీ పూర్తి చేసిన వారికి అదనంగా కేటాయిస్తారు.

హెచ్‌-1బీ వీసా రుసుము ఇప్పటివరకు దాదాపు రూ.1 లక్ష నుంచి రూ.6 లక్షల మధ్యే ఉండేది. కానీ ఇప్పుడు ఏకంగా దానిని రూ.88 లక్షలకు పెంచింది అమెరికా ప్రభుత్వం. దీంతో ఉద్యోగుల్లో తీవ్ర గందరగోళం ఏర్పడటంతో కొత్త H-1B వీసా దరఖాస్తులకు మాత్రమే వార్షిక రుసుము లక్ష డాలర్లు ఉంటుందని వైట్​హౌస్ వివరణ ఇచ్చింది. ఇప్పటికే ఉన్న వీసా హోల్డర్లకు లేదా పునరుద్ధరణలకు ఈ ఫీజు పెంపు ఉండబోదని తెలిపింది. .

కాగా ట్రంప్‌ హెచ్‌-1బీ వీసాపై తీసుకున్న నిర్ణయం భస్మాసురుడి హస్తంలా ఆ దేశ టెక్‌ కంపెనీలపైనే ప్రభావం చూపనుంది. అమెరికా టెక్‌ కంపెనీల యాజమాన్యాలు ఇక నుంచి హెచ్‌1బీ వీసాలపై ఏటా 14 బిలియన్‌ డాలర్లు వెచ్చించాల్సి రావొచ్చు. హెచ్​-1బీ వీసా ఫీజును భారీగా పెంచి లక్ష డాలర్లు చేయడం ఆయా సంస్థలకు మోయలేని భారంగా మారే ప్రమాదం ఉందని అందనా వేస్తున్నారు. హెచ్‌-1 బీ వీసా ఫీజుపై ట్రంప్‌ తీసుకున్న నిర్ణయం విదేశీ ఉద్యోగుల్లో తీవ్ర గందరగోళానికి దారి తీసింది. గతేడాది అన్నీ కలిపి లక్షా 41వేల హెచ్‌1బీ వీసాలు జారీ చేసినట్లు అమెరికా సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమిగ్రేషన్‌ సర్వీసెస్‌ లెక్కలు చెబుతున్నాయి. అదే స్థాయిలో వీసాలు జారీ చేస్తే వాటి కోసం చెల్లించాల్సిన ఫీజు మొత్తం 14 బిలియన్‌ డాలర్లుగా అంచనాలు ఉన్నాయి. ఈ నిర్ణయం స్టార్టప్‌ సంస్థలకు ఇబ్బందికరమేనని చెబుతున్నారు. విదేశాల్లోని టెక్‌ హబ్‌లకు ఇది ఓ బహుమతిగా మారిందని ఆందోళన వ్యక్తంచేశారు.

మరోవైపు కొత్త వీసా విధానంలో కొన్ని వర్గాల వారికి ముఖ్యంగా డాక్టర్లు, మెడికల్ రెసిడెంట్లకు ఈ భారీ ఫీజు నుంచి మినహాయింపు లభించనున్నాయి. అమెరికాలోని గ్రామీణ ప్రాంతాల్లో వైద్యుల కొరతను తీర్చడానికి ఈ చర్య ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. అమెరికాలో 76 మిలియన్ల కంటే ఎక్కువ మంది ప్రజలు తగినంత ప్రాథమిక వైద్య సేవలు లేని ప్రాంతాల్లో నివసిస్తున్నారు.భవిష్యత్ అంచనాలు: 2037 నాటికి అమెరికాలో 87,000 మంది ప్రైమరీ కేర్ వైద్యుల కొరత ఏర్పడొచ్చని ప్రభుత్వ నివేదికలు అంచనా వేశాయి.

అమెరికాలో మాయో క్లినిక్, క్లీవ్‌ల్యాండ్ క్లినిక్, సెయింట్ జూడ్ చిల్డ్రన్స్ రీసెర్చ్ హాస్పిటల్ వంటి ప్రముఖ వైద్య సంస్థలు పెద్ద సంఖ్యలో హెచ్-1బీ వీసాలను స్పాన్సర్ చేస్తున్నాయి.ఈ మినహాయింపు అవకాశాన్ని హాస్పిటల్స్, మెడికల్ అసోసియేషన్లు స్వాగతించాయి. వైద్యులకు ఊరట లభిస్తుందనే వార్తతో అమెరికాలోని హాస్పిటల్ స్టాక్స్ పెరిగాయి.

Tags:    

Similar News