న్యూయార్క్ లో మృతదేహాలను ఆ ద్వీపంలో ఖననం చేస్తున్నారు.. ఎందుకంటే..

కరోనావైరస్ మహమ్మారి ద్వారా మరణించిన వారిని న్యూయార్క్ నగర అధికారులు హార్ట్ ద్వీపంలో ఖననం చేస్తున్నారు.

Update: 2020-04-10 08:55 GMT

కరోనావైరస్ మహమ్మారి ద్వారా మరణించిన వారిని న్యూయార్క్ నగర అధికారులు హార్ట్ ద్వీపంలో ఖననం చేస్తున్నారు.. మరణాలు వేలాది సంఖ్యలో ఉండటం వలన.. మృతదేహాలను పాతిపెట్టడానికి కాంట్రాక్ట్ కార్మికులను నియమించుకున్నారు. న్యూయార్క్ నగరంలో మాత్రమే 5,000 మందికి పైగా మరణించారు.

దీంతో మృతదేహాలు అధికంగా ఉండటం వలన హార్ట్ ద్వీపంలో ఉన్న పొలాలను స్మశాన వాటికలుగా ఉపయోగించుకుంటున్నారు. ఇక్కడ స్థలం ఎక్కువగా ఉండటం వలన ఇలా చేస్తున్నారు. 19 వ శతాబ్దం నుండి న్యూయార్క్ వాసులను ఖననం చేయడానికి.. పేదవారి మృతదేహాలను పూడ్చడానికి న్యూయార్క్ రాష్ట్ర ప్రభుత్వం హార్ట్ ద్వీపాన్ని ఉపయోగిస్తోంది.

సాధారణంగా, ఈ ద్వీపంలో తక్కువ జీతంతో జైలు ఖైదీలచేత ప్రతి వారం 25 మృతదేహాలను ఖననం చేయిస్తారు, ఈ ప్రాంతానికి చేరుకోవాలి అంటే.. పడవ ద్వారా మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. న్యూయార్క్ లో కరోనావైరస్ వేగంగా వ్యాపించడం, మార్చిలో కేసుల సంఖ్య పెరగడం ప్రారంభమైంది.. ఈ క్రమంలో రోజుకు రెండు డజన్ల మృతదేహాలను వారంలో ఐదు రోజులపాటు ఈ ద్వీపంలో ఖననం చేయబడుతున్నాయని.. ఈ ప్రక్రియను పర్యవేక్షించే న్యూయార్క్ నగర ప్రతినిధి జాసన్ కెర్స్టన్ చెప్పారు.

ఖననం చేయడానికి ముందు, చనిపోయినవారిని శవ పేటికలలో ఉంచుతారు. మరణించిన వారి పేరు పేటికపై పెద్ద అక్షరాలతో రాస్తారు. అనంతరం యంత్రాల ద్వారా తవ్విన పొడవైన, ఇరుకైన కందకాలలో మృతదేహాలను ఖననం చేస్తారు. ఇందుకోసం రిఫ్రిజిరేటెడ్ ట్రక్కులలో మృతదేహాలను తీసుకువస్తుంటారు.

ప్రస్తుతం సామాజిక దూరం మరియు భద్రతా కారణాల దృష్ట్యా, శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు మృతదేహాలను ఖననం చేయడానికి ముందుకు రావడం లేదు అని కెర్స్టన్ చెప్పారు. దీంతో అధిక డబ్బులు చెల్లించి ఖనన ఏర్పాట్లు చేస్తున్నామని.. ఇందుకోసం ప్రత్యేకంగా కార్మికులను నియమించినట్టు ఆయన తెలిపారు.

కాగా అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో కరోనా వైరస్ మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తోంది. జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ గణాంకాల ప్రకారం.. మరణాల సంఖ్య 16,527 గా ఉంది.. 24 గంటల్లోనే 15 వందలకు పైగా మరణాలు నమోదయ్యాయి. అంతేకాదు మొత్తం కేసులు అర మిలియన్ కు దగ్గరగా ఉన్నాయి.. ప్రస్తుతం అమెరికాలో 460,967 కరోనావైరస్ కేసులు ఉన్నాయి. అమెరికాలో కరోనా వ్యాప్తికి కేంద్రంగా ఉన్న న్యూయార్క్ రాష్ట్రంలో ధృవీకరించబడిన కేసుల సంఖ్య 159,937 కు చేరుకుంది.


Tags:    

Similar News