Cordyceps: బంగారం కంటే విలువైన ఆ పుట్టగొడుగుల కోసమే చైనా చొరబాటు?
Keeda Jadi: సరిహద్దులో నిత్యం డ్రాగన్ కవ్వింపు చర్యలకు పాల్పుడుతోంది.
Cordyceps: బంగారం కంటే విలువైన ఆ పుట్టగొడుగుల కోసమే చైనా చొరబాటు?
Keeda Jadi: సరిహద్దులో నిత్యం డ్రాగన్ కవ్వింపు చర్యలకు పాల్పుడుతోంది. గాల్వాన్ తరువాత.. అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్ వద్ద.. ఈనెల 9న చైనా సైనికులు చొరబాటుకు యత్నించారు. అయితే బీజింగ్ దళాల కదలికలను ముందే పసిగట్టిన భారత సేనలు.. ఎత్తుకు పైఎత్తు వేసి.. పీఎల్‌ఏను చావుదెబ్బ కొట్టాయి. అయితే డ్రాగన్ కంట్రీ చొరబాట్ల వెనుక పెద్ద కథే ఉంది. బంగారం కంటే విలువైన దానిపై చైనా కన్నేసింది. బీజింగ్ చొరబాట్లపై ఇండో-పసిఫిక్ సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ కమ్యూనికేషన్స్- IPCSC నివేదికను తాజాగా వెల్లడించింది. చైనా చొరబాట్లపై పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. సూపర్ మష్‌రూమ్ కోసమే సరిహద్దును దాటేందుకు డ్రాగన్ యంట్రీ యత్నించినట్టు వెల్లడించింది.
2021లో గాల్వాన్ లోయలో ఘర్షణ తరువాత.. తరచూ డ్రాగన్ సైన్యం కవ్వింపులకు పాల్పడుతోంది. ఇరుదేశాల గస్తీ బృందాలు ఎదురుపడడం, ఉద్రిక్తతలు చోటుచేసుకోవడం పరిపాటిగా మారింది. సరిహద్దు వెంబడి నవంబరులోనే చైనా సైనిక గస్తీని పెంచడాన్ని భారత సైన్యం గుర్తించింది. ఈ పరిణామాల నేపథ్యంలో మన బలగాల సంఖ్యను అధికారులు పెంచారు. ఆధిపత్యాన్ని చాటుకునేందుకు మన భూభాగంలోకి డ్రాగన్ సేన చొరబడొచ్చని అంచనా వేశారు. అందుకు తగ్గట్టుగా.. ఎదురుదాడికి భారత సైన్యం సిద్ధమైంది. ఈ నెల 9న భారత భూభాగంలోకి చొరబడేందుకు యత్నించారు. అయితే ముందే భారత దళాలు సిద్ధం కావడంతో డ్రాగన్ సైనికులు ఊహించని విధంగా దెబ్బ కొట్టి.. అక్కడి నుంచి తరిమేశారు. ఈ దాడిలో 10 నుంచి 15 మంది చైనా సైనికులకు తీవ్ర గాయాలయ్యాయి. జరిగింది ఇదైతే.. డ్రాగన్ కంట్రీ మాత్రం మరోరకంగా చెప్పుకొచ్చింది. చొరబాట్లను తామే అడ్డుకున్నట్టు వెల్లడించింది. అదే సమయంలో.. టిబెట్‌లోని వైమానిక స్థావరాల్లో పెద్ద సంఖ్యలో డ్రోన్లు, యుద్ధ విమానాలను చైనా మోహరించింది. భారత్ సైతం అరుణాచల్‌లో వాయుసేన గగనతల గస్తీని ముమ్మరం చేసింది. ఈ సీన్ అంతా.. నాణానికి ఒకవైపు మాత్రమే.. మరోవైపు డ్రాగన్ భారీ స్కెచ్చే వేసింది. భారత సైన్యం దృష్టి మళ్లించి.. డ్రాగన్ బలగాలు.. అసలు పని చేసుకుపోయేలా ప్లాన్ వేసుకున్నట్టు తెలుస్తోంది. బంగారం కంటే అత్యంత విలువైన ఓ సూపర్ మష్‌రూమ్ కోసమే ఈ కవ్వింపు చర్యలకు పాల్పడినట్టు తాజాగా ఇండో-పసిఫిక్ సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ కమ్యూనికేషన్స్ -IPCSC నివేదిక వెల్లడించింది. అసలు బంగారం కంటే విలువైన ఆ మష్‌రూమ్ ఎక్కడుంది? దాని కోసం డ్రాగన్ ఎందుకు యుద్ధానికి దిగుతోంది?
బంగారం కంటే విలువైన పుట్టగొడుగులు హిమాలయ పర్వత శ్రేణుల్లో మాత్రమే లభిస్తాయి. వాటిని అనేక పేర్లతో పిలుస్తున్నారు. భారత్‌లో కిడా జాడి అని.. హిమాలయన్ గోల్డ్ అని.. చైనా, టిబెట్, నేపాల్‌లో మాత్రం యర్సాగంబు అని.. ఇంగ్లీష్‌లో గొంగళి పురుగుగా పిలుస్తారు. అసలు ఈ పుట్టగొడుగుల కథేమిటి? అంటే.. కిడా జాడిగా పిలిచే ఈ పుట్టగొడుగును మూలికగా భావిస్తారు. హిమాలయాల్లో మాత్రమే పెరిగే ఒక రకమైన శిలీంధ్రం ఇది. దీని శాస్త్రీయ నామం ఒఫియోకార్డిసెప్స్ సినెన్సిస్. సింపుల్‌గా కార్డిసెప్స్‌గా పేర్కొంటారు. IPCSC ప్రకారం ఈ పుట్టగొడుగు కోసమే చైనా సైన్యం చొరబాట్లకు యత్నించినట్టు తెలుస్తోంది. ఈ హిమాలయన్ గోల్డ్‌గా పిలిచే ఈ పుట్టగొడుగులు పసువు, కాషాయ రంగులో సన్నని పోగుల్లా ఉంటాయి. అతి శీతల వాతావరణం ఉన్నచోటనే ఈ కార్డిసెప్స్ పెరుగుతాయి. కిడా జాడి పొడవు రెండు అంగుళాల వరకు ఉంటుంది. ఇది ప్రధానంగా హిమాలయ ప్రాంతాల్లో, నైరుతి చైనాలోని క్వింగై-టిబెటన్ ప్రాంతంలో 3వేల నుంచి 5వేల మీటర్ల ఎత్తున్న పర్వత ప్రాంతాల్లో మాత్రమే ఇది పెరుగుతుంది. ఇది బయో యాక్టివ్ అణువు నుంచి ఉద్భవించిన గొప్ప చికిత్సా సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని నమ్ముతారు. దీన్ని హిమాలయన్ వయగ్రాగా కూడా కొందరు భావిస్తారు. దీనికి ఔషధ విలువతతో పాట.. క్రిమి సంహారిగా కూడా పని చేస్తుందంటున్నారు. టిబెటన్ పీఠభూమి, హిమాలయ ప్రాంతాల ప్రజల్లో 80 శాతం మంది దీనిపైనే ఆధారపడుతున్నారు. హిమాలయాల్లోని కొన్ని ప్రాంతాల ప్రజలు ఈ ఫంగస్‌ను సేకరించి, అమ్మి డబ్బు సంపాదిస్తుంటారు.
నేలలో ఉండే ఒక విధమైన ఫంగస్ సోకి.. చనిపోయిన గొంగళి పురుగే యర్సాగంబుగా మారుతుంది. మే, జూన్ నెలల్లో వేలాది మంది హిమాలయన్ ప్రాంతాల్లో దీని కోసం వేటలో పడుతారు. అంత ఎత్తులో పని చేయడం ప్రాణాలకు ప్రమాదమే. అయినా.. దాని విలువ అత్యంత ఖరీదు కావడంతో.. ప్రజలు తెగిస్తున్నారు. కొన్ని సార్లు మంచు, వర్షాలతో కొన్నిసార్లు ప్రాణాలు కూడా కోల్పోయిన సందర్భాలు ఉన్నాయని చెబుతున్నారు. నిజానికి స్థానికులు ఈ శిలీంధ్రాన్ని తక్కువకే విక్రయిస్తారు. ఒక్కో దాన్ని 250 నుంచి 300 రూపాయల మధ్యలో ధర పలుకుతుంది. ఈ కిడా జాడిని ఎక్కువగా అమెరికా, బ్రిటన్, చైనా, సింగపూర్, జపాన్, కొరియా, మయన్మార్, థాయ్‌లాండ్ దేశాలకు ఎగుమతి చేస్తారు. ఆయా దేశాల్లో ఒక గ్రాము కిడా జాడిని 7వేల రూపాయలకు పైగా విక్రయిస్తారు. అంటే.. బంగారం కంటే దీని ధర అధికమని స్పష్టమవుతోంది. అయితే గ్లోబల్ వార్మింగ్ కారణంగా.. ఫంగస్ మనుగడ తగ్గిపోతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్థానికులు గతంలో రోజుకు వందకు పైగా కిడాజాడిలను వెతుక్కునేవారు. కానీ.. ఇప్పుడు 20 కంటే ఎక్కువగా లభించడం లేదట. కొన్ని సార్లు అస్సలు దొరకడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు ప్రధానంగా వీటిపైనే ఆధారపడి జీవన సాగిస్తున్నారు. హిమాలయాల్లో మంచు కరిగి.. పచ్చిక బయళ్లు కనిపిస్తే చాలు.. హిమాలయ ప్రాంత ప్రజలకు పండుగే. ఎందుకంటే.. ఆ సమయంలోనే వారు కిడా జాడి వేటకు వెళ్తారు. అప్పుడే వారికి డబ్బు చేతి నిండా దొరుకుతుంది.
హిమాలయన్ పుట్టగొడుగుల విలువ చైనాకు భాగా తెలుసు. అందుకే డ్రాగన్ కంట్రీ యర్సాగంబుపై కన్నేసింది. నిజానికి ప్రపంచంలోనే అత్యధికంగా కిడా జాడిని ఉత్పత్తి చేసి.. ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసేది డ్రాగన్ కంట్రీనే. ఈ మూలిక విలువ బంగారం కంటే అధికంగా ఉంటుంది. 2022లో అంతర్జాతీయ మార్కెట్‌లో ఈ శిలీంధ్రం విలువ 8వేల 900 కోట్ల రూపాయలు. కేజీ హిమాలయన్ గోల్డ్ విలువ 70 లక్షలరూపాయల మేర పలుకుతోంది. కిడా జాడి కోసం చైనా కంపెనీలు భారీ ప్రయత్నాలే చేస్తున్నాయి. ఏకంగా హిమాలయ పర్వత ప్రాంతాల్లోని పలు ప్రదేశాలను కొనుగోలు చేసి.. కోట్ల రూపాయలను వెచ్చిస్తున్నాయి. ప్రధానంగా రెండేళ్లుగా టిబెట్‌లోని క్వింగై ప్రాంతంలో వీటి లభ్యత తగ్గిపోయింది. అదే సమయంలో కిడా జాడికి డిమాండ్ కూడా పెరిగింది. కిడ్ని వ్యాధుల నుంచి క్యాన్సర్, నపుంసకత్వం వరకు నయం చేసే దివ్య ఔషదంగా పని చేస్తుందని చైనీయులు నమ్ముతున్నారు. అయితే దీనిపై ఎలాంటి శాస్త్రీయమైన ఆధారాలు లేవు. 2010, 2011లో చైనా ఈ శిలీంద్రాన్ని ఏకంగా లక్షా 50వేల కేజీలను ఉత్పత్తి చేసేది. కాస్తా.. 2018 నాటికి 41వేల 200 కిలోలకు పడిపోయింది. గత రెండేళ్లుగా వాటి ఉత్పత్తి పూర్తిగా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో డ్రాగన్ కంట్రీ ఈ శిలీంధ్రంపై కన్నేసినట్టు తెలుస్తోంది. నిజానికి అద్భుత ఔషధ గుణాలున్న కార్డిసెప్స్‌పై అస్సాంలోని బోడో విశ్వవిద్యాలయ పరిశోధకులు 8 ఏల్లుగా పరిశోధనలు చేస్తున్నారు. ప్రయోగశాలలో నియంత్రిత వాతావరణంలో వీటిని సాగు చేస్తున్నారు. మైనస్ 86 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద ఆరబెట్టి, పోషక, ఔషధ గుణాలకు నష్టం వాటిల్లకుండా జాగ్రత్త పడుతున్నారు.
అత్యంత విలువైన ఈ శిలీంధ్రంపై చైనా కన్నేసింది. దాన్ని వెతికే పనిని సైన్యానికి అప్పజెప్పినట్టు తాజా నివేదికలతో తెలుస్తోంది. అప్పనంగా కోట్ల రూపాయలను కొల్లగొట్టే అవకాశం ఉండడంతో ఆయా ప్రాంతాలను దక్కించుకునేందుకు డ్రాగన్ కుట్రలు పన్నుతోంది. ఈ క్రమంలోనే తవాంగ్‌లో చైనా సైన్యం ఘర్షణకు దిగినట్టు తెలుస్తోంది.