వ్యూహం వికటించి డీలాపడ్డ కాంగ్రెస్

Update: 2018-03-30 06:54 GMT

తెలంగాణ బడ్జెట్ సమావేశాలు పూర్తి ఏకపక్షంగా సాగాయి. ఇవే తమకి చివరి సెషన్స్ కావడంతో అస్త్రశస్త్రాలతో దాడికి సిద్ధమైన ప్రధాన ప్రతిపక్షాన్ని బడ్జెట్ సెషన్స్  వరకు సస్పెండ్ చేసిన సర్కార్ ఎలాంటి ఒత్తిడి లేకుండా సభను నడిపింది. అసెంబ్లీలో అనుకోకుండా ప్రతిపక్ష పాత్ర పోషించే అవకాశం వచ్చినా బీజేపీ సమర్థంగా వినియోగించుకో లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. శాసనసభలో ప్రభుత్వాన్ని ఇరుకున పెడాదమనుకున్న తెలంగాణ కాంగ్రెస్‌కు కథ అడ్డం తిరిగింది. ఇద్దరు సభ్యుల తొందరపాటుతో పార్టీ సభ్యులంతా సభకు దూరం కావాల్సి వచ్చింది. ఎన్నడూ లేని విధంగా ప్రతిపక్ష నేత సైతం బడ్జెట్ సమావేశాల నుంచి సస్పెండైన చేదు అనుభవాన్ని మూట గట్టుకుంది. 

ప్రధాన ప్రతిపక్షం లేకుండా సభలో ప్రధానమైన బిల్లులను ఎలాంటి చర్చ లేకుండా ప్రభుత్వం పాస్ చేయించుకున్నా కాంగ్రెస్ స్పందన అంతంత మాత్రమే. సభ బయట పోరాటం చేయాలని హస్తం పార్టీ నిర్ణయించినా బడ్జెట్ కేటాయింపులపై కాంగ్రెస్ స్పందించిన తీరు ప్రజలకు చేరలేదు. ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లు, పంచాయితీరాజ్ బిల్లులపై సభ బయట ముఖ్యనేతలంతా తమకు పట్టనట్టు వ్యవహరించారు.
ప్రతిపక్ష పాత్ర పోషించేందుకు అంది వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవడంలో విఫలమైంది బీజేపీ. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కేంద్రాన్ని కడిగి పారేస్తున్నా బీజేపీ సభ్యులు గట్టిగా సమాధానం చెప్పలేకపోయారు. ప్రైవేట్ విశ్వవిద్యాలయాల బిల్లుపై వ్యూహాత్మకంగా వ్యవహరించలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పంచాయితీరాజ్ చట్టంలో కనీసం సవరణలు కూడా చేయించలేక పోయిందనే అపవాదు బీజేపీకి వచ్చింది.

Similar News