వచ్చే నెల 3 నుంచి రంగంలోకి కేసీఆర్‌...ప్రచార షెడ్యూల్‌ విడుదల...

Update: 2018-09-26 05:03 GMT

కేసీఆర్‌ ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్‌ ఖరారైంది. పార్టీ ముఖ్యనేతలతో చర్చించిన కేసీఆర్‌ బహిరంగ సభల షెడ్యూల్‌ను ఫైనలైజ్‌ చేశారు. అక్టోబర్ 3నుంచి 8వరకు ఉమ్మడి జిల్లాల వారీగా తొలి దశ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న కేసీఆర్‌ మళ్లీ దసరా తర్వాత నియోజకవర్గాల వారీగా సుడిగాలి పర్యటనలు చేయనున్నారు.

టీఆర్‌ఎస్‌ స్టార్‌ క్యాంపెయినర్‌, గులాబీ బాస్‌ కేసీఆర్‌ అక్టోబర్‌ నుంచి రంగంలోకి దిగనున్నారు. 90 శాతానికి పైగా అభ్యర్ధులను ప్రకటించి ప్రత్యర్ధి పార్టీలను కంగుతినిపించిన కేసీఆర్ ప్రతిపక్షాల అభ్యర్ధులు ఖరారు కాకముందే తొలి దశ ప్రచారాన్ని పూర్తి చేయాలని భావిస్తున్నారు. అక్టోబర్ 3నుంచి బహిరంగ సభలకు ప్లాన్‌ చేసిన టీఆర్‌ఎస్‌ ఉమ్మడి జిల్లాల వారీగా ప్రజా ఆశీర్వాద సభలను నిర్వహించాలని నిర్ణయించింది. అక్టోబర్‌ 3న నిజామాబాద్‌, 4న నల్గొండ, 5న మహబూబ్‌నగర్‌, అక్టోబర్‌ 7న వరంగల్‌, 8న ఖమ్మంలో నిర్వహించే బహిరంగ సభల్లో కేసీఆర్ పాల్గోనున్నారు. మళ్లీ దసరా తర్వాత నియోజకవర్గాల వారీగా సభలు నిర్వహించేలా గులాబీ పార్టీ ప్రణాళికలు రూపొందించుకుంది. నాలుగున్నరేళ్ల టీఆర్‌ఎస్‌ పాలనలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే తమను గెలిపిస్తాయని గులాబీ నేతలు అంటున్నారు.

Similar News