గోవిందుడు ఎవరి వాడు... ఏడుకొండలపై ఏంటీ వివాదాలు

Update: 2018-05-16 05:54 GMT

తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు సంచలనానికి తెరలేపారు. ఏడుకొండలపై జరుగుతున్న శాస్త్ర విరుద్ధ పనులపై గళమెత్తారు. తిరుమల ఆలయంలో రాజకీయా నేతల పెత్తనం, అధికారుల అనాలోచిత చర్యలను ఎండగట్టారు. రాజకీయ నాయకులు ఆలయాన్ని బ్రష్టు పట్టిస్తున్నారని రమణ దీక్షితులు ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ నాయకులు స్వామి వారి లడ్డూ ప్రసాదాన్ని వ్యాపార కేంద్రంగా మారుస్తున్నారన్నారని విమర్శలు గుప్పించారు. అనాదిగా స్వామివారిని తాకే శాస్త్రాధికారం, స్వామికి కైంకర్యాదనలు చేసే విధిలో ఉన్న తమ అర్చక వారసత్వాన్ని ప్రభుత్వం రద్దు చేయడం ఆగమ శాస్త్ర విరుద్ధమ‌ని దీక్షితులు చెప్పారు. 

స్వామివారి గురించి, ఆలయం గురించి తెలియని వారిని అధికారులగా నియమించి ప్రభుత్వం పెద్ద తప్పు చేస్తోందని రమణ దీక్షితులు అన్నారు. అధికారులు ఆలయ నియమని బంధనలు మారుస్తున్నారని దుయ్యబట్టారు. ప్రధానార్చకుడిగా తనకే టీటీడీ ఆభరణాల వివరాలు తెలియటంలేదని.. వాటి లెక్కాపద్దూ చెప్పేవారు లేరని ఆరోపించారు. ఏ చరిత్ర తెలియని సినిమావాళ్లు, రాజకీయ నాయకులు, అధికారులు పాలక మండలిలో ఉండటం వల్లే ఆలయ ప్రతిష్ట మంట కలుస్తోందని వాపోయారు. దీనిపై సీబీఐ విచారణ జరగాలని డిమాండ్ చేశారు. కేంద్ర ఎక్స్‌పర్ట్‌ కమిటీ వేసి అతి ప్రాచీన ఆలయాలను కాపాడాలని రమణ దీక్షితులు కోరారు.  

స్వామివారి కైంకర్యమే మహాపుణ్యమంటూ అవమానాలు ఇంతకాలం భరిస్తూ వచ్చామని.. ఇప్పుడు భక్తులకు స్వామి సేవా భాగ్యం లేకుండా చేస్తున్నారని రమణ దీక్షితులు వాపోయారు.  పాలకులు చేస్తున్న పాపాల వల్ల శ్రీవారి ఆగ్రహం చవిచూడాల్సి వస్తుందని రమణ దీక్షితులు హెచ్చరించారు. ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా పాలకులు, అధికారులు చేస్తున్న పిచ్చి చేష్టల వలన స్వామివారు ఆగ్రహానికి గురై మహాపరాదం జరుగుతుందన్నారు.

Similar News