పిడుగులు ఎందుకు పడతాయో తెలుసా!!

Update: 2018-05-03 06:31 GMT

ఆంధ్రప్రదేశ్‌లో పిడుగులు హడలుగొడుతున్నాయి. ఒకవైపు ఎండలు దంచికొడుతుంటే... మరోవైపు పిడుగుల వర్షం ప్రజలను భయపెడుతున్నాయి. ఎప్పుడు... ఎక్కడ... పిడుగు పడుతుందో... ఎవరు మృత్యువాత పడతారో తెలియక భయకంపితులవుతున్నారు. నిన్న ఒక్కరోజే 41వేలకు పైగా పిడుగులు పడినట్లు... ఏపీ విపత్తుల నిర్వహణ కేంద్రం ప్రకటించడంతో... గ్రామీణ ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో పిడుగుల వర్షం కురిసింది. నిన్న ఒక్కరోజే 41వేలకు పైగా పిడుగులు పడినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ కేంద్రం ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా 41వేలకు పైగా పిడుగులు పడితే.... ఒక్క నెల్లూరు జిల్లాలోనే 12వేల పిడుగులు పడినట్లు ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ తెలిపింది. అలాగే శ్రీకాకుళం జిల్లాలో 4వేల 703 పిడుగులు, విజయనగరం జిల్లాలో 3వేల 901, విశాఖ జిల్లాలో 2వేల 698, తూర్పుగోదావరిలో 3వేల 216, పశ్చిమగోదావరిలో 768, కృష్ణాజిల్లాలో 2వేల 925 పిడుగులు, గుంటూరు జిల్లాలో 4వేల 101, ప్రకాశంలో 4వేల 725 పిడుగులు, చిత్తూరు జిల్లాలో 1706, కడపలో 327 పిడుగులు పడినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ ప్రకటించింది. ఇక నిన్న కురిసిన పిడుగుల వర్షానికి 11 జిల్లాల్లో మొత్తం 14మంది బలైపోయారు.

పిడుగుపాటును అరగంట ముందుగానే గుర్తించి ప్రజలను అప్రమత్తం చేసే పరిజ్ఞానాన్ని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ శాఖ వినియోగిస్తోంది. అందుకోసం అమెరికాకు చెందిన ఎర్త్‌ నెట్ వర్క్‌తో పాటు, ఇస్రో సహకారం తీసుకుంటోంది. ఎర్త్ నెట్‌వర్క్ సెన్సార్ల ద్వారా ఎక్కడ ఏ సమయంలో పిడుగులు పడే అవకాశముందో... ప్రజల ఫోన్లకు ఎస్‌ఎంఎస్‌లు పంపి అప్రమత్తం చేస్తున్నారు. అయినప్పటికీ అనేకమంది మృత్యువాత పడుతూనే ఉన్నారు.

పిడుగు... ఎప్పుడు... ఎక్కడ.... పడుతుందో గుర్తించే పరిజ్ఞానం ఉన్నప్పటికీ... చిన్నచిన్న జాగ్రత్తలతో పిడుగు ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చని నిపుణులు అంటున్నారు. ఉరుములు మెరుపులు వస్తున్నప్పుడు ఇంటి నుంచి బయటికి రాకపోవడమే మేలంటున్న వాతావరణశాఖ అధికారులు... ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో చిక్కుకుంటే.... చెట్ల కిందకి, టవర్ల కిందకు వెళ్లకూడదని సూచిస్తున్నారు. 

Similar News