ఏపీలో వేడెక్కిన రాజకీయం..వైసీపీ అభ్యర్థిని ప్రకటించిన జగన్

Update: 2018-01-07 09:17 GMT

ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య వార్ నడుస్తోంది. ఒకరి ఇలాఖాలో మరొకరు పాగా వేసేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. 2019 ఎన్నికలే టార్గెట్‌గా నేతల సవాళ్లు, ప్రతి సవాళ్లు చేసుకుంటున్నారు. పులివెందుల ఈ సారి మాదేనంటుంటే.. మరొకరు కుప్పంలో గెలుపు ఖాయమంటున్నారు. ఏపీలో ఎన్నికల ఫీవర్ మొదలైంది. 2019 ఎన్నికల ప్రచారాన్ని తలపించేలా అధికార, ప్రతిపక్ష నేతలు మాటల తూటాలు పేలుస్తున్నారు. పులివెందుల టార్గెట్‌గా టీడీపీ, కుప్పం టార్గెట్‌గా వైసీపీ వ్యూహాలు రచిస్తున్నాయి. 

జన్మభూమి మావూరు పేరుతో పులివెందులకు వెళ్లిన సీఎం చంద్రబాబు.. పులివెందుకు నీరిచ్చిన ఘనత నాదేనంటున్నారు. గత పదేళ్లలో ఏమీ చేయలేకపోయారని పరోక్షంగా జగన్‌పై విమర్శలు చేస్తూ.. స్థానికుల అభిమాన్ని పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంతకాలం టీడీపీని గెలిపించలేదని, ఈ సారి ఆదరిస్తారన్న నమ్మకం తనకు ఉందని పదే పదే చెబుతున్నారు చంద్రబాబు.  

మరోవైపు అధికారంలోకి రావడం ఖాయమని ఫిక్స్ అయిపోయిన ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్.. అందుకు అన్ని అస్త్రాలను ఉపయోగిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో పాదయాత్ర చేస్తున్న జగన్.. బీసీ కార్డుతో కుప్పం కుర్చీని కూల్చేందుకు ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు సొంత నియోజకవర్గం చంద్రగిరి అని, ఆయన అక్కడ పోటీ చేయకుండా బీసీలు అత్యధికంగా ఉన్న కుప్పంలో పోటీ చేస్తున్నారని విమర్శలు చేశారు.

చంద్రబాబు బీసీలకు చేసిందేమీ లేదంటున్న జగన్.. నవరత్నాలతో బీసీలకు మేలు చేస్తానని హామీ ఇచ్చారు. కుప్పంలో చంద్రబాబుపై పోటీ చేసేందుకు బీసీ వర్గానికి చెందిన మాజీ ఐఏఎస్ అధికారి చంద్రమౌళిని వైసీపీ అభ్యర్థిగా ప్రకటించారు. ఆయన్ను గెలిపిస్తే.. పార్టీ అధికారంలోకి రాగానే కుప్పం నుంచి గెలిచిన అభ్యర్థిని కేబెనెట్‌లో చేర్చుకుంటానని హామీ ఇచ్చారు. మొత్తానికి అధికార, ప్రతిపక్ష నేతలు పులివెందుల వర్సెస్ కుప్పం గెలుపు లక్ష్యంగా వ్యూహ,ప్రతివ్యూహాలు రచిస్తున్నారు. మరి ఎవరి ప్రయత్నాలు ఫలిస్తాయో చూడాలి.

Similar News