గుడివాడ అద్దేపల్లి కాంప్లెక్స్ లో భారీ అగ్నిప్రమాదం

కృష్ణా జిల్లా గుడివాడ పట్టణం నడిబొడ్డున నెహ్రూ చౌక్‌లోని అద్దేపల్లి షాపింగ్ కాంప్లెక్స్‌లో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం జరిగింది.

Update: 2025-12-14 05:15 GMT

గుడివాడ: కృష్ణా జిల్లా గుడివాడ పట్టణం నడిబొడ్డున నెహ్రూ చౌక్‌లోని అద్దేపల్లి షాపింగ్ కాంప్లెక్స్‌లో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం జరిగింది. తొలుత కాంప్లెక్స్ లోని సెల్‌ఫోన్ షాపులో ప్రమాదం చోటుచేసుకుంది. కొద్దిసేపటికే మంటలు పక్కన ఉన్న షాపులకు వ్యాపించాయి. కాంప్లెక్స్ పరిసర ప్రాంతాల్లో దట్టంగా పొగ అలుముకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అధికారులు సమీప ప్రాంతాల నుండి ఫైర్ ఇంజన్లను రప్పించారు. భారీ స్థాయిలో మంటలు వ్యాపించడంతో చుట్టుపక్కల ప్రాంతాల వారు భయాందోళనకు గురయ్యారు. తెల్లవారుజామున ప్రమాదం జరగడంతో ప్రాణ నష్టం ఏమీ జరగలేదు.

ఈ ప్రమాదంలో కోట్లాది రూపాయల విలువైన దుకాణాల్లోని వస్త్రాలు, విలువైన యంత్ర సామాగ్రి కాలి బూడిదయ్యాయి. అగ్ని ప్రమాదం గురించి తెలుసుకున్న దుకాణదారులు పరుగుపరుగున కాంప్లెక్స్ వద్దకు చేరుకుని, షాపులు మంటల్లో కాలిపోవటం చూసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కంటతడి పెట్టుకుంటున్నారు. ఉయ్యూరు, హనుమాన్ జంక్షన్, పరిసర ప్రాంతాల నుండి అగ్నిమాపక శకటాలను తెప్పించి, సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదం జరిగిన కాంప్లెక్స్ లో ఓ జూనియర్ కళాశాల, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నెహ్రూ చౌక్ కార్యాలయాలు కూడా ఉన్నాయి.

అగ్నిప్రమాదం బాధాకరం:ఎమ్మెల్యే వెనిగండ్ల రాము

అగ్ని ప్రమాదం జరిగిన అద్దేపల్లి కాంప్లెక్స్ భవనాన్ని ఎమ్మెల్యే రాము సందర్శించి, పరిశీలించారు. అగ్నికి అహుతయిన కాంప్లెక్స్ లోని దుకాణాల యజమానులకు జరిగిన నష్టాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నష్టపోయిన దుకాణదారులతో మాట్లాడుతూ వారికి మనోధైర్యం చెప్పారు. ప్రభుత్వపరంగా అవకాశం ఉంటే సహాయం అందిస్తామన్నారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన వారిలో జనసేన పట్టణ ఇన్ చార్జి బూరగడ్డ శ్రీకాంత్, ఇమేజ్ రవి, టిడిపి నాయకులు చేకూరు జగన్మోహన్రావు తదితరులు ఉన్నారు.

Tags:    

Similar News