అమరావతి: ఈనెల 21న పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లూ చేశారని వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. 5 ఏళ్లలోపు పిల్లల్లందరికీ పోలియో చుక్కల్ని తప్పకుండా వేయించాలని, కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని రాష్ట్రాల్లో నిర్వహిస్తారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 54,07,663 మంది 5 ఏళ్ల లోపు పిల్లలకు 38,267 బూత్ లలో పోలియో చుక్కలు వేస్తారు. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు 61,26,120 డోస్ లను పంపించారని తెలిపారు. డిసెంబరు 21 పోలియో దినం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా బూత్ స్థాయిలో పిల్లలకు పోలియో చుక్కల్ని వేస్తారని, ఆ రోజు పలు కారణాలవల్ల పోలియో చుక్కలు వేసుకోలేకపోయిన పిల్లలకు తిరిగి ఈనెల 22, 23 తేదీల్లో ఇంటింటికి వెళ్లి వేస్తారని తెలిపారు. ఇందుకోసం 76,534 బృందాలను నియమించినట్లు మంత్రి పేర్కొన్నారు.
భారతదేశం పోలియో రహిత దేశం అయినప్పటికీ, మళ్లీ పోలియో రాకుండా ఉండేందుకు తగు ముందస్తు జాగ్రత్తల్ని తీసుకోవాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించిందని తెలిపారు. 1704 మెడికల్ అధికారులు, 39,494 ఇతరులు (ఫార్మసిస్టులు, నర్సింగ్ విద్యార్థులు, ఇతర సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ఉపాధ్యాయులు), 4206 మంది పర్యవేక్షకులు నేషనల్ ఇమ్యునైజేషన్ డే కార్యక్రమంలో పాల్గొంటారని వివరించారు. పల్స్ పోలియో ఏర్పాట్లకు సంబంధించి వైద్యారోగ్య శాఖ కార్యదర్శి అధ్యక్షతన స్టేట్ టాస్క్ ఫోర్స్ సమావేశం జరిగిందని, జిల్లా, పట్టణ, మండల స్థాయి టాస్క్ ఫోర్స్ సమావేశాలు జరుగుతున్నాయని, ఏర్పాట్ల గురించి ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ లేఖలు రాశారని మంత్రి పేర్కొన్నారు.