ఘోర విమాన ప్రమాదం..గాల్లోనే పేలిపోయిన విమానం..71 మంది దుర్మరణం

Update: 2018-02-12 03:56 GMT

రష్యాలో విమానం కూలిపోయింది. టేకాఫ్‌ అయిన కొద్ది సేపటికే ... విమానంలో మంటలు చెలరేగి కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 71 మంది చనిపోయినట్టు తెలుస్తోంది. దట్టమైన మంచు కురుస్తుండటంతో సహాయక బృందాలు అతి కష్టం మీద ఘటనాస్థలానికి చేరుకున్నాయి.

రష్యాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. మాస్కోలోని డొమొడెడొవో విమానాశ్రయం నుంచి ఉరల్‌ పర్వతశ్రేణుల్లోని ఓర్క్స్‌ పట్టణానికి బయలుదేరిన ఆంటొనోవ్‌ ఏఎన్‌–148 జెట్‌ విమానం టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే కూప్పకూలిపోయింది. దీంతో ఈ విమానంలో ప్రయాణిస్తున్న 71 మంది చనిపోయారు. మృతుల్లో ఆరుగురు సిబ్బందితో పాటు 65 మంది ప్రయాణికులు ఉన్నట్లు రష్యా అత్యవసర విభాగం తెలిపింది. 

సరతోవ్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఈ విమానం మాస్కోకు 80 కిలోమీటర్లు ఆగ్నేయాన ఉన్న రామెన్‌స్కీ జిల్లాలోని అర్గునోవో గ్రామం సమీపంలో కూప్పకూలిపోయింది. తీవ్రంగా మంచు కురుస్తుండటంతో దాదాపు 150 మంది సహాయక సిబ్బంది కాలినడకన ప్రమాదస్థలికి చేరుకున్నారు. అర్గునోవో గ్రామం సమీపంలో విమాన శకలాలతో పాటు కొన్ని మృతదేహాలను గుర్తించారు.  

మరోవైపు విమానం గాల్లోనే కాలిపోతూ కుప్పకూలిపోవడాన్ని తాము చూసినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.  ప్రమాదస్థలితో పాటు మంచులో చెల్లాచెదురుగా పడిపోయి ఉన్న విమాన శకలాల వీడియోను రష్యా ప్రభుత్వ టీవీ ప్రసారం చేసింది. 

Similar News