ఆస్తుల చిట్టా విప్పిన రేవంత్‌

Update: 2018-09-29 11:12 GMT

తన పోరాటం గల్లీలోని టీఆర్ఎస్‌ నేతలతో కాదని ప్రగతి భవన్‌లోని కేసీఆర్‌తో అన్నారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. మోడీతో కుమ్మక్కై తనపై కేసులు పెడితే భయపడేది లేదంటూ ఆయన స్పష్టం చేశారు. రెండు రోజుల పాటు తన నివాసంలో జరిగిన ఐటీ రైడ్స్‌పై ప్రెస్‌మీట్ నిర్వహించిన ఆయన కేసీఆర్‌పై తీవ్ర స్ధాయిలో విమర్శలు గుప్పించారు.  కాంగ్రెస్ నేతలను చూసి అభద్రతకు గురవుతున్న కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారని రేవంత్ విమర్శించారు. 2014 తరువాత ఒక్కసారి విదేశీ పర్యటన చేయని తాను  విదేశాల్లో అకౌంట్లు ఎలా ఓపెన్ చేస్తానంటూ ప్రశ్నించారు. భారతీయుడిగా ఉన్న తనకు విదేశాల్లో అకౌంట్లు ఎలా ఇస్తారో తెలియకుండా విమర్శలు చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు.  

తాను తొలిసారి 2007లో శాసన మండలికి ఎన్నికయ్యాయని రేవంత్ తెలిపారు. 2009 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆస్తుల కొన్న విలువను ప్రకటించానని వెల్లడించారు. అప్పుడు ఆస్తుల విలువ రూ. 2-3 కోట్లుగా ఉందన్నారు. 2014 నాటికి ఎన్నికల సంఘం ఆస్తుల మార్కెట్ విలువను ప్రకటించాలని సూచించిందని పేర్కొన్నారు. దీంతో తన ఆస్తుల విలువ ఒక్కసారిగా రూ.12-14 కోట్లకు చేరుకుందన్నారు. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల నాటికి తన ఆస్తుల విలువ ఇంకా పెరిగే అవకాశముందనీ, ఇందులో వింత ఏముందని రేవంత్ ప్రశ్నించారు. ఈసీ నిర్ణయంతో పాతికేళ్ల క్రితం బంజారాహిల్స్ లో రూ.25 లక్షలకు కొన్న ఇంటి విలువ కోట్లలోకి వెళ్లిపోయిందన్నారు. 2014లో తన పేర ఉన్న ఆస్తులను 2009లో ఉన్నవాటితో పోల్చిచూడాలని ఆయన సూచించారు. 2009 తర్వాత తాను ఎక్కడా ఆస్తులు కొనుగోలు చేయలేదని ఆయన స్పష్టం చేశారు. గోపన్‌పల్లి, వట్టినాగులపల్లి, కొండారెడ్డి, కొడంగల్‌లో ఆస్తులన్నీ ఎన్నికల అఫిడవిట్‌లో పొందుపరిచామని వివరించారు. తనకు పిల్లను ఇచ్చిన మామ కిరోసిన్‌ హోల్‌సేల్‌‌ డీలర్‌ అని.. 1992 కంటే ముందే ఆయనకు హైదరాబాద్‌లో భూములు ఉన్నాయని రేవంత్‌ వివరించారు.

 

Similar News