ఉద్దానానికి ఊపిరిపోస్తారా... ఉద్యమంగా మారుస్తారా? జనసేనాని లక్ష్యమిదే!!

Update: 2018-05-28 08:32 GMT

ప్రజాపోరాట యాత్ర అంటూ ఒకవైపు పవన్ బస్సు యాత్ర. మధ్యలో ఒకరోజు దీక్ష. యాత్ర మధ్యలో దీక్షతో, పవన్‌ కొత్త ట్రెండ్‌ సెట్‌ చేశాడా? ఉద్దాన సమస్యను, దీక్షతో ఉద్యమంగా మలచబోతున్నాడా? వాస్తవానికి పవన్ కల్యాణ్ వెళ్లినప్పుడు మాత్రమే ఉద్దానం సమస్య ఎందుకు తెరపైకి వస్తోంది. అదీగాక తనకు సీఎం పదవీకాంక్ష లేదని, అధికారం అసలు లక్ష్యం కాదని, చాలాసార్లు అన్నారు. కానీ మారుతున్న రాజకీయ పరిణామాలు, ముఖ్యంగా కర్ణాటకలో కుమారస్వామి సీఎం అయిన సమీకరణల సారం, పవన్‌ ఆలోచనల్లో మార్పు తెచ్చిందని చాలా మంది భావిస్తున్నారు. ఎందుకంటే, కార్యకర్తలు, అభిమానులు సీఎం కావాలని నినాదాలు చేస్తేనే సరిపోదు, అందుకు తగ్గట్టు కష్టపడాలని పవన్‌ తన మనసులోని మాటను బయటపెట్టారు. నిజంగా జనసేన కార్యకర్తలు, ఫ్యాన్స్ భావిస్తున్నట్టు, ఏపీలో పవన్ కల్యాణ్ కింగ్ మేకర్‌ అవుతారా? 

కర్ణాటకలో ఎలాంటి పరిస్థితుల్లో కుమారస్వామి ముఖ్యమంత్రి అయ్యారో దేశమంతా చూసింది. 222 స్థానాల్లో 104 సీట్లను కైవసం చేసుకుని బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తే, 78 స్థానాలతో కాంగ్రెస్‌ రెండోస్థానంలో నిలిచింది. కేవలం 37 స్థానాల్లో విజయం సాధించింది జేడీఎస్. ఏ పార్టీకి మెజారిటీ మార్క్‌ రాకపోవడంతో, బీజేపీ అధకారపీఠంపై కూర్చోరాదన్న ఏకైక లక్ష్యంతో, ఎన్నికల తర్వాత జేడీఎస్‌తో జట్టుకట్టింది కాంగ్రెస్. కుమారస్వామికి సీఎం ఆఫర్ చేసింది. ఇవే పరిణామాలు 2019లో ఆంధ్రప్రదేశ్‌లో జరగవన్న గ్యారంటీ ఏంటి? జనసేన కార్యకర్తల నినాదాల వెనక ఆశ ఇదేనా? 

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో చాలా పార్టీలు రేసులో ఉన్నాయి. టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్‌, బీజేపీ, వామపక్షాలు, జనసేన గట్టిగా పోరాడాలనుకుంటున్నాయి. కానీ టీడీపీ, వైసీపీల మధ్యే అసలైన పోటీ ఉంటుందనడంలో సందేహం లేదు. కానీ జనసేనను కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదన్నది విశ్లేషకుల మాట. ఎందుకంటే, ఏపీలో కాపు సామాజికవర్గం ఓట్లు దాదాపు 20శాతం. అదే వర్గానికి చెందిన పవన్‌కు, ఏదో ఒకస్థాయిలో హారతిపట్టొచ్చు. యూత్‌లో క్రేజ్‌ ఉన్న హీరోకావడంతో, యువత కూడా పవన్‌ వైపు మొగ్గుచూపే ఛాన్సుంది. ఈ సమీకరణలతోనే జనసేన ఎన్నోకొన్ని సీట్లతో కింగ్‌మేకర్‌ అవుతుందని, కింగ్‌ అయ్యే ఛాన్స్‌ గబ్బర్‌సింగ్‌కు వస్తుందని, ఆ పార్టీ కార్యర్తలు, అభిమానులు లెక్కలేసుకుంటున్నారు.

మొత్తానికి ప్రజాపోరాట యాత్ర చేస్తూనే, ఒకరోజు దీక్ష చేసి, కొత్త ట్రెండ్‌ సెట్‌ చేసిన పవన్ కల్యాణ్, ముఖ్యమంత్రి రేసులోనూ నిలిచారు. కానీ కర్ణాటకలో జరిగినట్టే, టీడీపీ, వైసీపీలకు అరకొర సీట్లొచ్చి, జనసేనకు నిర్ణయాత్మక స్థానాలొస్తేనే, సీఎం అంచనాలకు లెక్క కుదురుతుంది. లేదంటే నో లెక్క. ఈ సమీకరణలు ఎలాంటి రూపు సంతరించుకుంటాయో, రానున్న కాలమే తేల్చాలి.

Similar News