టీఆర్ఎస్ పార్టీలో రాజ్యసభ సీట్లకు ఫుల్లు డిమాండ్

Update: 2018-02-24 07:00 GMT

త్వరలో ఖాళీ అవుతున్న మూడు రాజ్యసభ సీట్లకు అధికార టీఆర్ఎస్ పార్టీలో ఫుల్ డిమాండ్ ఏర్పడింది. పెద్దల సభలో సీట్లు దక్కించుకొనేందుకు లాబీయింగ్ మొదలు పెట్టారు కొందరు సీనియర్ నేతలు. ఖాళీ అవుతున్న మూడు సీట్లు టీఆర్ఎస్‌ ఖాతాలోనే పడే అవకాశం ఉండటంతో ఎవరికి లక్కీ చాన్స్ ఎవరికి దక్కుతుందోనని ఎవరికి వారే లెక్కల్లో మునిగి తేలుతున్నారు.

వచ్చే ఏప్రిల్‌లో తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తున్న ముగ్గురు రాజ్యసభ సభ్యుల పదవీ కాలం ముగియనుంది. విభజన తర్వాత తెలంగాణకు 7 రాజ్యసభ సీట్లు వచ్చాయి. అందులో కాంగ్రెస్ ఎంపీ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి మరణించగా కాంగ్రెస్ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్, టీడీపీకి చెందిన సీఎం రమేష్ రిటైరవుతున్నారు. దీంతో తెలంగాణ నుంచి మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. శాసనసభలో బలాబలాలను బట్టి మూడు సీట్లు అధికార టీఆర్ఎస్‌కే దక్కడం ఖాయం.

నామినేషన్ వేస్తే సీటు గ్యారంటీ కావడంతో కారు పార్టీలో నేతల మధ్య రాజ్యసభ ఎంపీ స్థానాలకు తీవ్ర పోటీ నెలకొంది. ఇప్పటికే సీఎం కేసీఆర్ కొన్ని పేర్లపై చర్చలు మొదలుపెట్టినట్టు సమాచారం. అన్ని సామాజిక సమీకరణాలు బేరీజు వేసుకొని అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉందని పార్టీ సీనియర్లు అంచనా వేస్తున్నారు. అయితే రాజ్యసభ రేసులో కొన్ని పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి, పార్టీ జనరల్ సెక్రటరీ జోగినిపల్లి సంతోష్ పేర్లు పరిశీలనలో ఉన్నట్టు పార్టీలో చర్చ జరుగుతోంది. వనపర్తి నియోజకవర్గానికి చెందిన ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి పేరు కూడా గట్టిగా వినిపిస్తోంది. కేసీఆర్‌కు అంతరంగికుడిగా ఉంటూ మొదటి నుంచి పార్టీ అంతర్గత వ్యవహారాల్లో కీలకపాత్ర పోషిస్తున్న రాజయ్య యాదవ్‌కు పెద్దల సభకు వెళ్లే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఆశావహులు ఎంతో కాలంగా తమ వినతులను ప్రగతి భవన్‌కు పంపిస్తున్నా అవి సీఎం దగ్గరకు వెళ్తాయా అనేది అనుమానమేనని పార్టీలో చర్చ జరుగుతోంది. 

Similar News