కన్నడ వైకుంఠపాళి ఏ మలుపు తిరగనుంది?

Update: 2018-05-02 10:12 GMT

కర్ణాటక ఎన్నికల పోరు వైకుంఠపాళిని తలపిస్తోంది. ఒక పార్టీ, కులమనే నిచ్చెనతో పైకి ఎగబాకాలని ప్రయత్నిస్తే, గుటుక్కున పాము నోట్లో పడి, మళ్లీ మొదటికే వస్తోంది. మరొక పార్టీ, మతం కార్డు ప్రయోగించి నిచ్చెనెక్కాలని పాచికలు వేస్తూ, వైరి వర్గానికి ముచ్చెమటలు పోయిస్తోంది. మరి కర్ణాటక వైకుంఠపాళిలో ఎవరెవరు ఎలాంటి పాచికలు వేస్తున్నారు...ఎవరు పాము నోటికి దగ్గరగా ఉన్నారు....ఎవరు నిచ్చెనమెట్లతో ఎగబాకేందుకు ఆలోచిస్తున్నారు.

నిన్నటి వరకూ ఒక లెక్క. కర్ణాటక ఎన్నికల సంగ్రామంలో, మోడీ ప్రవేశించిన తర్వాత మరో లెక్క. వస్తూవస్తూనే పాత అస్త్రాలన్నింటికీ పాతరేసి, సరికొత్త ఆయుధాలతో ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు మోడీ. 15 నిమిషాల ఛాలెంజ్ అడిగావు కదా, పేపర్ చూకుండా నీకు ఇష్టమొచ్చిన భాషలో అనర్గళంగా మాట్లాడు దమ్ముంటే అని, సవాల్‌ విసిరారు. అటు రాహుల్, సిద్దరామయ్య కూడా సవాళ్లతో ఎన్నికల సంగ్రామాన్ని రసవత్తరంగా మార్చారు. 

లింగాయత్‌లు. కర్ణాటకలో వంద అసెంబ్లీ స్థానాల్లో గెలుపోటములను శాసించగల వర్గం. సంఘ సంస్కర్త బసవన్న బోధనలతో స్ఫూర్తిపొందిన లింగాయత్‌లు, తమది హిందూమతం కాదని, ప్రత్యేక మతంగా గుర్తించి మైనార్టీ హోదా కావాలని డిమాండ్ చేస్తున్నారు. కర్ణాటకలోని కాంగ్రెస్‌ సర్కారు, దీనికి ఓకే చెప్పింది. ఆమోదించాలని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి పంపింది. లింగాయత్‌లపై కాంగ్రెస్, బీజేపీ వ్యూహాలు ఎలాంటి మలుపులు తిరుగుతున్నాయి?

మంత్రాలకు చింతకాయలు రాల్తాయో లేదో కానీ, పూజలకు మాత్రం ఓట్లు రాలతాయని రాజకీయ నాయకులు గట్టిగా డిసైడ్‌ అయ్యారు. కట్టూబొట్టూతో పూజలు చేస్తే, ఓటర్లను కనికట్టు చేయొచ్చని స్ట్రాంగ్‌గా ఫీలవుతున్నట్టున్నారు. అందుకే కర్ణాటక ఎన్నికల సమరంలో, మోడీ, అమిత్‌ షా, రాహుల్‌ గాంధీలు ఎక్కడికి వెళ్లినా స్థానిక ఫేమస్ టెంపుల్స్ లో పూజలు చేస్తూ, ఫోటోలకు ఫోజులిస్తున్నారు. మఠాలను సందర్శిస్తూ, స్వామిజీల కాళ్లమీదపడుతున్నారు. మరి వీరి పూజలు, ఓట్లు రాలుస్తాయా?

కర్ణాటకలో మత సమీకరణలు అలా ఉంటే, కుల సమీకరణలూ కీలకమే. రకరకాల సామాజిక లెక్కలను సరి చూసుకుంటున్నాయి బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్. అటు స్వామిజీలు, మఠాధిపతులు కూడా రంగంలోకి దిగుతూ, కన్నడ రణక్షేత్రంలో తలపడుతున్నారు. ఇలా కులమత సమీకరణలన్నీ ఒకవైపు సాగుతుంటే, మరోవైపు తెలుగు ఓటర్ల తీర్పు కూడా, కన్నడ పోరులో కీలకం కాబోతోంది. అందుకే అన్ని పార్టీల నాయకులు, తెలుగు ప్రజల మనసులు గెలిచేందుకు తెగ ప్రయత్నిస్తున్నారు. మరి కర్ణాటక జనం ఎలాంటి తీర్పు వెల్లడిస్తారో ఈనెల 15న తేలిపోతుంది. 

Similar News