టీడీపీలో చేరకపోతే కేసులు పెడతామంటూ బెదిరిస్తున్నారు

Update: 2018-06-11 08:56 GMT

రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, ప్రధానిపై టీడీపీ నేతల అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా విజయవాడ ధర్నాచౌక్‌లో బీజేపీ నేతలు ధర్నాకు దిగారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, మాజీ మంత్రి మాణిక్యాలరావు, దగ్గుబాటి పురందేశ్వరి,విష్ణువర్ధన్ రెడ్డి, సురేష్ రెడ్డి, రమేష్ నాయుడు, కవితలు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని, శాంతి భద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని మండిపడ్డారు. పోలీసులను ఉపయోగించుకుని ముఖ్యమంత్రి తన ప్రత్యర్ధులపై దాడులకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు.

రాష్ట్రంలోని ఇతర పార్టీల నేతలపై చంద్రబాబు తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. టీడీపీలో చేరకపోతే కేసులు పెడతామంటూ పోలీసులతో బెదిరింపులకు దిగుతున్నారని మండిపడ్డారు. పోలీసులు దమనకాండ సాగిస్తున్నారని, అధికార పక్షానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఖాకీ డ్రెస్‌ వేసుకొని పచ్చ జెండా కింద పని చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. అలిపిరిలో అమిత్‌ షాపై రాళ్లదాడి చంద్రబాబు ఆదేశాలతోనే జరిగిందని ఆయన ఆరోపించారు. దీనిపై పోలీస్ స్టేషన్ లో కేసు పెడితే బీజేపీ కార్యకర్తలపై ఎదురు కేసులు పెట్టారని కన్నా ధ్వజమెత్తారు. గతంలో సోము వీర్రాజు ఇంటిపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారని గుర్తుచేశారు.  
 

Similar News