కడప జిల్లాలో భగ్గుమన్న ఫ్యాక్షన్ పాలిటిక్స్‌

Update: 2018-06-04 07:03 GMT

కడప జిల్లాలో ఫ్యాక్షన్ రాజకీయాలు భగ్గుమన్నాయి. జమ్మలమడుగు కేంద్రంగా టీడీపీ, వైసీపీ శ్రేణులు కత్తులు దూసుకుంటున్నాయి. కడప ఎంపీ అవినాష్‌రెడ్డిని. జమ్మలమడుగు వైసీపీ నేత తన ఇంటికి ఆహ్వానించడంతో... మంత్రి ఆదినారాయణరెడ్డి వర్గీయులు దాడులకు దిగారు. స్థానిక వైసీపీ లీడర్ ఇంటిని ఆది అనుచరులు ధ్వంసం చేయడంతో... పెదదండ్లేరులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో పొలిటికల్‌ వార్ హీటెక్కుతోంది. టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య మొదలైన రాజకీయ రగడ తీవ్ర ఉద్రిక్తతకు కారణమైంది. జమ్మలమడుగు మండలం పెదదండ్లేరులో వైసీపీ నేత ఇంటిపై టీడీపీ శ్రేణులు దాడి చేయడంతో మొదలైన గొడవ... చినికిచినికి గాలివానగా మారింది. ఇరువర్గాలు పరస్పరం దాడులు చేసుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. విషయం తెలుసుకున్న కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి... తన అనుచరులతో కలిసి పెదదండ్లేరు బయల్దేరడంతో మార్గమధ్యంలోనే... పోలీసులు అడ్డుకున్నారు. దాంతో వైసీపీ శ్రేణులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది.

జమ్మలమడుగు నియోజకవర్గం పెదదండ్లేరుకు చెందిన వైసీపీ నేత మేరవ సంజీవరెడ్డి.... ఎంపీ అవినాష్ రెడ్డిని తన ఇంటికి ఆహ్వానించడం... గొడవకు కారణమైంది. అవినాష్ రెడ్డిని ఎందుకు రమ్మన్నావంటూ... మంత్రి ఆదినారాయణరెడ్డి వర్గీయులు... సంజీవరెడ్డి ఇంటిని ధ్వంసం చేశారు. దాంతో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. పెదదండ్లేరు సరిహద్దుల్లో మంత్రి ఆదినారాయణరెడ్డి అనుచరులు మోహరించడంతో  పోలీసులు అవినాష్ రెడ్డిని గ్రామంలోకి అనుమతించలేదు. తీవ్ర తోపులాటల తర్వాత అవినాష్ రెడ్డితో పాటు కడప మేయర్ సురేష్ బాబు, కడప వైసీపీ ఇన్‍ఛార్జ్ సుధీర్ బాబును పోలీసులు అరెస్ట్ చేశారు.

పెదదండ్లేరులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు పెద్దసంఖ్యలో మోహరించారు. పారా మిలటరీ బలగాలను కూడా రప్పించారు. పరిస్థితి చేయిదాటకుండా డీఐజీ దగ్గరుండి శాంతిభద్రతల్ని పర్యవేక్షిస్తున్నారు. అయితే వాతావరణం నివురుగప్పిన నిప్పులా మారడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న టెన్షన్‌ నెలకొంది.

Similar News