చల్లని కబురు... వారం ముందే రుతుపవనాలు

Update: 2018-05-12 07:56 GMT

మండే ఎండలతో ఉస్సూరంటున్న వారందరికీ శుభవార్త. ఈ ఏడాది వేసవి కష్టాలు ఒక వారం రోజులు తగ్గనున్నాయి. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు వారం రోజులు ముందే ప్రవేశిస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. మే 25న రుతు పవనాలు కేరళ తీరాన్ని తాకవచ్చునని IMD అంచనా వేసింది. ఏడేళ్ల తర్వాత రుతుపవనాలు ఇంత ముందుగా వస్తున్నాయి.

ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు నిర్ణీత గడువు కంటే ముందుగా దేశంలోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్టు భారత వాతావరణ శాఖ తెలిపింది. సాధారణం కంటే వారం రోజుల ముందుగా మే 25న రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. రుతుపవనాల ప్రయాణం మే రెండో వారంలో ప్రారంభమై గాలుల దిశ క్రమంగా పశ్చిమాభిముఖంగా మారుతుంది. ఇవి సాధారణంగా నైరుతి రుతుపవనాలు జూన్‌ 1న కేరళ తీరాన్ని తాకుతాయి. అయితే ఈ ఏడాది మే 11 నుంచి 17 మధ్యనే ఈ ప్రక్రియ ప్రారంభం కావడంతో వారం ముందుగానే రుతుపవనాలు పలకరించనున్నాయి. 

గత ఏడాది కూడా రుతుపవనాలు రెండు రోజులు ముందుగా మే 30న దేశంలోకి ప్రవేశించాయి. గడిచిన ఏడేళ్లతో పోలిస్తే ఈ ఏడు రుతుపవనాలు చాలా ముందుగా వస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఐఎండీ తయారుచేసిన వాతావరణ నమూనాల ప్రకారం గాలులు దిశ మార్చుకొనే అవకాశం ఉందని.. దీంతో దక్షిణాదిలో మంచి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందంటున్నారు.

Similar News