అక్టోబర్ 25న అసెంబ్లీ, హైకోర్టు నమూనా ఖరారు

Update: 2017-09-14 14:24 GMT

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో ప్రతిష్టాత్మకమైన మార్పునకు నాంది పలకబోతున్నారు. ఏపీ శాశ్వత అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టుకు సంబంధించిన నమూనాకు సీఎం చంద్రబాబు అక్టోబర్ 25న అంతిమ ఆమోదం తెలపనున్నారు. లండన్‌కు చెందిన ఫోస్టర్ ప్రతినిధులు చంద్రబాబుకు సెప్టెంబర్ 13న నమూనాను సమర్పించారు. ఈ నమూనాను పరిశీలించిన ఆయన హైకోర్టు బాహ్య ఆకృతిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆకర్షణీయంగా లేదని.. వెంటనే దాని డిజైన్‌ను మార్చాలని సూచించారు. అసెంబ్లీ డిజైనింగ్‌కు సంబంధించి ఫోస్టర్ ప్రతినిధులను చంద్రబాబు అభినందించారు.

ఇదిలా ఉంటే, సీఎం చంద్రబాబు ఈ నిర్మాణాలకు సంబంధించి సినీ దర్శకుడు రాజమౌళి సలహాలను అడగాలని భావిస్తున్నారు. బాహుబలి సినిమా తొలి, తుది భాగాల్లో రాజమౌళి సృష్టించిన అద్భుత ప్రపంచం ఎలా ఉందో అందరికీ తెలిసిందే. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుని రాజమౌళి సలహాలను ఏపీ సర్కార్ కోరనున్నట్లు తెలిసింది. సీఎం చంద్రబాబుకు ఏపీ అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టుకు సంబంధించి ఫోస్టర్ ప్రతినిధులు ఇచ్చిన నమూనాలో ముఖ్యాంశాలివి.. 

* ప్రస్తుత నమూనా ప్రకారం ఏపీ అసెంబ్లీ వజ్రం ఆకారంలో ఉండబోతోంది.
* 35 ఎకరాల్లో ఏపీ అసెంబ్లీని నిర్మించబోతున్నారు
* నాలుగు అంతస్థుల్లో నిర్మించనున్న ఈ భవనం 40 మీటర్ల ఎత్తు ఉంటుందట.
* మొదటి ఫ్లోర్ నాలుగు భాగాలుగా విభజించబడి ఉంటుంది. ముఖ్యమంత్రి కార్యాలయం, మంత్రుల చాంబర్లు, స్పీకర్ కార్యాలయం, పబ్లిక్, ప్రెస్‌కు సంబంధించిన ప్రాంతాలు ఈ ఫ్లోర్‌లోనే ఉంటాయి.
* ఈ భవనంలోనే శాసనసభ, శాసనమండలి రెండూ ఉంటాయి.
* అసెంబ్లీలో 250 మంది నుంచి 300 మంది వరకూ కూర్చునేలా సీట్లను కేటాయించారు.
* శాసనమండలిలో 125మంది సభ్యులకు సీట్లు కేటాయించారు.
* ఇరు చట్టసభల బాల్కనీలు త్రిభుజాకారంలో ఉండేలా ఆకర్షణీయంగా డిజైన్ చేశారు.
* పై అంతస్థులో ప్రజలు తిలకించేందుకు మ్యూజియంను ఏర్పాటు చేశారు.
*హైకోర్టు భవనం బుద్ధ స్థూపం ఆకారంలో ఉండేలా రూపొందించారు.
* ఆరంస్థుల హైకోర్టు భవనాన్ని 50 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబోతున్నారు.
*  5వేల మంది హైకోర్టు భవనంలో ఒకేసారి ఉండేంతలా విస్తీర్ణం ఉండబోతోంది. 

Similar News