Hormuz Crisis: ఆపత్కాలంలో భారత్ కు బాసటగా రష్యా.. మాస్కో ఆఫర్ ను ఇండియా ఒప్పుకుంటుందా?
Hormuz Crisis: హార్ముజ్ జలసంధి మూతపడటంతో భారత్‌లో చమురు సంక్షోభం తలెత్తే అవకాశం! ఈ ఆపత్కాలంలో రష్యా భారీగా చమురు సరఫరా చేస్తామని ఆఫర్ ఇచ్చింది. ట్రంప్ ఆంక్షలు, ఇరాన్ హెచ్చరికల మధ్య భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది? పూర్తి విశ్లేషణ ఇక్కడ చదవండి.
Hormuz Crisis: ఆపత్కాలంలో భారత్ కు బాసటగా రష్యా.. మాస్కో ఆఫర్ ను ఇండియా ఒప్పుకుంటుందా?
Hormuz Crisis: పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధం అంతర్జాతీయ చమురు మార్కెట్‌ను అతలాకుతలం చేస్తోంది. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన 'హార్ముజ్ జలసంధి' (Strait of Hormuz)ని తాము పూర్తి నియంత్రణలోకి తీసుకున్నట్లు ఇరాన్ ప్రకటించడంతో ప్రపంచ దేశాల్లో ఆందోళన మొదలైంది. ఈ సంక్షోభ సమయంలో భారత్ ఆర్థిక వ్యవస్థను ఆదుకోవడానికి, ఇండియాకు బాసటగా నిలవడానికి రష్యా మరోసారి సిద్ధమైంది.
హార్ముజ్ జలసంధి ఎందుకు కీలకం అంటే..
హార్ముజ్ జలసంధి మార్గం గుండానే ప్రపంచంలోని చమురు ఎగుమతుల్లో ఎక్కువ భాగం జరుగుతుంది. భారత్‌కు ఇరాక్, సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్ నుంచి వచ్చే రోజువారీ 2.5 - 2.7 mbd (మిలియన్ బ్యారెళ్ల) చమురు ఈ జలసంధి గుండానే ప్రయాణిస్తుంది. ఇరాన్ ఈ మార్గాన్ని అడ్డుకుంటే, చమురు సరఫరా నిలిచిపోయి వాటి ధరలు ఆకాశాన్ని తాకే ప్రమాదం ఉంది. హార్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతల నేపథ్యంలో, భారత్ - చైనాలకు చమురు సరఫరాను పెంచడానికి సిద్ధంగా ఉన్నట్లు రష్యా ఉప ప్రధాన మంత్రి అలెగ్జాండర్ నోవాక్ బుధవారం ప్రకటించారు. ఫిబ్రవరి నెలలో రష్యా నుంచి భారత్‌కు రోజుకు 1.1 mbd చమురు దిగుమతి అయ్యింది. ప్రస్తుత సంక్షోభం దృష్ట్యా, పశ్చిమాసియా దేశాల నుంచి తగ్గే సరఫరాను భర్తీ చేయడానికి రష్యా ఒక 'బఫర్'లా పనిచేయనుంది.
రంగంలోకి ట్రంప్ ..
మరోవైపు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ పరిణామాలపై తీవ్రంగా స్పందించారు. చమురు ట్యాంకర్లకు రక్షణ కల్పించడానికి అమెరికా నావికాదళం సిద్ధంగా ఉందని ఆయన ప్రకటించారు. నావిగేషన్ స్వేచ్ఛను కాపాడటం తమ బాధ్యతని వాషింగ్టన్ స్పష్టం చేసింది. అయితే, ఇరాన్ మాత్రం ఈ మార్గంలో ప్రయాణించే నౌకలకు క్షిపణులు, డ్రోన్ల ముప్పు ఉంటుందని హెచ్చరించింది. పశ్చిమాసియాలో సైనిక దాడులు తీవ్రతరం కావడంతో భారతీయ రిఫైనరీలు ఇప్పుడు ప్రత్యామ్నాయ వనరుల వైపు చూస్తున్నాయి. ఈ క్రమంలో రష్యా అందిస్తున్న మద్దతు భారత్ వంటి దేశాలకు పెద్ద ఊరటనిచ్చే అంశం అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.