Oracle Layoffs: ఒరాకిల్ బిగ్ షాక్ ..ఏఐ కోసం వేలాది మంది ఉద్యోగుల బలి
Oracle Layoffs: టెక్ ప్రపంచంలో మరోసారి కుదుపు మొదలైంది. నిన్న అమెజాన్, నేడు ఒరాకిల్.. దిగ్గజ సంస్థలు తీసుకుంటున్న నిర్ణయాలు సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల్లో గుబులు రేపుతున్నాయి.
Oracle Layoffs: ఒరాకిల్ బిగ్ షాక్ ..ఏఐ కోసం వేలాది మంది ఉద్యోగుల బలి
Oracle Layoffs: టెక్ ప్రపంచంలో మరోసారి కుదుపు మొదలైంది. నిన్న అమెజాన్, నేడు ఒరాకిల్.. దిగ్గజ సంస్థలు తీసుకుంటున్న నిర్ణయాలు సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల్లో గుబులు రేపుతున్నాయి. ముఖ్యంగా ఒరాకిల్ సంస్థ నుండి వినిపిస్తున్న వార్తలు ఐటీ రంగాన్ని విస్మయానికి గురిచేస్తున్నాయి. టెక్ రంగంలో 'లేఆఫ్స్' పర్వం ఇప్పట్లో ముగిసేలా లేదు. ఇప్పటికే అమెజాన్ వంటి దిగ్గజాలు ఉద్యోగులను తొలగిస్తుండగా, తాజాగా యూఎస్ టెక్ జెయింట్ 'ఒరాకిల్' సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తన ఖర్చులను తగ్గించుకుని, భవిష్యత్తు టెక్నాలజీ వైపు అడుగులు వేయడానికి ఏకంగా 20 వేల నుంచి 30 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపేందుకు సిద్ధమవుతోంది.
ఎందుకు ఈ నిర్ణయం?
ఒరాకిల్ లాంటి పెద్ద కంపెనీ ఇంత పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించడానికి ప్రధాన కారణం 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్' (AI). ప్రస్తుతం ప్రపంచమంతా ఏఐ మయమవుతోంది. ఈ రేసులో వెనకబడిపోకూడదని ఒరాకిల్ భావిస్తోంది.ఏఐ డేటా సెంటర్లు, క్లౌడ్ కంప్యూటింగ్ విభాగాల్లో గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలతో పోటీ పడాలంటే భారీగా నిధులు అవసరం.కొత్త టెక్నాలజీపై పెట్టుబడులు పెట్టడానికి అవసరమైన మూలధనాన్ని సమకూర్చుకోవడానికి, ప్రస్తుతం ఉన్న నిర్వహణ ఖర్చులను తగ్గించుకోవాలని కంపెనీ చూస్తోంది. రాబోయే కొన్నేళ్ల పాటు 'ఏఐ-రెడీ' డేటా సెంటర్ల నిర్మాణమే లక్ష్యంగా ఒరాకిల్ తన వ్యాపార వ్యూహాన్ని మార్చుకుంది.
ఉద్యోగుల్లో ఆందోళన
క్లౌడ్ మౌలిక సదుపాయాల కోసం నిధులను మళ్లించే క్రమంలో ఈ లేఆఫ్స్ జరుగుతుండటంతో, దీర్ఘకాలంగా సంస్థలో పనిచేస్తున్న వారు కూడా ఆందోళన చెందుతున్నారు. కేవలం ఖర్చు తగ్గించుకోవడమే కాకుండా, భవిష్యత్తులో ఏఐ అవసరాలకు తగ్గట్టుగా నైపుణ్యం ఉన్న వారికే ప్రాధాన్యత ఇవ్వాలని కంపెనీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
మారిన టెక్ ముఖచిత్రం
ఒకప్పుడు సాఫ్ట్‌వేర్ రంగం అంటే భరోసాకు మారుపేరు. కానీ ఇప్పుడు టెక్నాలజీ మారుతున్న వేగం మనుషుల అవసరాన్ని తగ్గిస్తోందా? అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఏఐ మనకు సౌకర్యాలను ఇస్తోంది కానీ, అదే సమయంలో వేలాది మంది జీవనోపాధిపై దెబ్బకొడుతుండటం గమనార్హం.