కంపెనీలకు టాక్స్ హాలీడే ప్రకటిస్తారా?

కొత్తగా 500 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చే కంపెనీలకు టాక్స్ హాలీడే ప్రకటించాలని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రతిపాదించినట్టు తెలుస్తోంది.

Update: 2020-05-13 01:22 GMT
tax holiday in India for industries (rep.image)

కరోనా మహామ్మరితో ఆర్ధిక వ్యవస్థలు తారుమారవుతున్నాయి. పారిశ్రామిక రంగం స్తంభించిపోయింది. ఎక్కడికక్కడ ఉత్పత్తులు నిలిచిపోయాయి. ఇప్పుడు లాక్ డౌన్ పరిస్థితులు చక్కబడినా.. పారిశ్రామిక రంగం ఎంత మేరకు.. ఎంత త్వరగా కోలుకోగలదనేది పెద్ద ప్రశ్నే! ఇక కొత్త పెట్టుబడులు వస్తాయా లేదా అనేదీ తెలియని పరిస్థితి. ఈ నేపధ్యంలో దేశ ఆర్ధిక వ్యవస్థను చక్కదిద్దేందుకు ప్రధాని మోడీ 20 లక్షల కోట్ల రూపాయల భారీ ప్యాకేజీ ప్రకటించారు.

కొత్తగా 500 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చే కంపెనీలకు టాక్స్ హాలీడే ప్రకటించాలని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రతిపాదించినట్టు ప్రముఖ ఎకనామిక్ టైమ్స్ కథనం పేర్కొంది. దీని ప్రకారం ఆ విధంగా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చే కంపెనీలకు పదేళ్ళ పాటు పన్నులు వసూలు చేయకుండా ఉండాలని ప్రతిపాదన. మెడికల్ పరికరాలు, ఎలక్ట్రానిక్స్, టెలికాం పరికరాలు, క్యాపిటల్ గూడ్స్ వంటి రంగాలకు పన్నుల నుంచి ఉపశమనం కల్పించాలని వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. అయితే, ఇందుకోసం కంపెనీలు ఈ ఏడాది జూన్ 1 నుంచి మూడేళ్ళ లోపు తమ కార్యకలాపాల్ని ప్రారంభించాల్సి ఉంటుంది.

టెక్స్‌టైల్,ఫుడ్ ప్రాసెసింగ్,లెదర్,ఫుట్‌వేర్, తదితర రంగాల్లో 100 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టే కంపెనీలకు నాలుగేళ్ల ట్యాక్స్ హాలీడే(పన్ను మినహాయింపు) ప్రకటించాలని వానిజ్యశాఖ ప్రతిపాదిస్తోంది. అదేవిధంగా ఇక రాబోయే ఆరేళ్ల కాలానికి కేవలం 10శాతం కార్పోరేట్ పన్ను రేటును ప్రతిపాదించింది.

ఈ ప్రతిపాదనలకు కేంద్ర ఆర్ధిక శాఖ ఆమోదించాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి ఈ ప్రతిపాదనలను ఆ శాఖ ఆమోదించలేదు. అయితే, భారీ ప్యాకేజీ ప్రకటించిన నేపధ్యంలో టాక్స్ హాలిడే ప్రతిపాదనలకు ఆమోదం లభించవచ్చని భావిస్తున్నారు.

Tags:    

Similar News