Infosys Q3 Results: 6,806 కోట్ల లాభాలను ఆర్జించిన ఇన్ఫోసిస్..!

Infosys Q3 Results: ఇన్ఫోసిస్ సంస్థ మూడు నెలల్లో లాభాలను సాధించింది.

Update: 2025-01-17 07:32 GMT

Infosys Q3 Results: ఇన్ఫోసిస్ సంస్థ మూడు నెలల్లో లాభాలను సాధించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో గత సంవత్సరంతో పోలిస్తే 11.46 శాతం పెరిగి రూ.6,806 కోట్ల లాభాలను ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ.6,106 కోట్ల నికర లాభాన్ని సాధించింది. గురువారం స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో ఇన్ఫోసిస్ తన నిర్వహణ ఆదాయం 7.58 శాతం పెరిగి రూ.41,764 కోట్లకు చేరుకుందని, గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఇది రూ.38,821 కోట్లుగా ఉందని తెలిపింది.

ఆర్థిక సేవలు, తయారీ రంగం ఆదాయానికి వరుసగా 27.8 శాతం, 15.5 శాతం తోడ్పడ్డాయి. దీని తరువాత రిటైల్, ఎనర్జీ ఉన్నాయి. ఇన్ఫోసిస్ భారతదేశం, యూరప్‌లో సంవత్సరానికి రెండంకెల వృద్ధిని నమోదు చేసింది. ఉత్తర అమెరికా దాదాపు ఐదు శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసింది. ఈ త్రైమాసికంలో లాభాల భాటలో పయనిస్తున్నాయని ఇన్ఫోసిస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO), మేనేజింగ్ డైరెక్టర్ (MD) సలీల్ పరేఖ్ అన్నారు. మూడవ త్రైమాసికంలో యూరోపియన్ ఆర్థిక సేవలలో మెరుగుదల ఉందని తెలిపారు. అలాగే అమెరికాలో రిటైల్, వినియోగ ఉత్పత్తుల పరిశ్రమలలో ఒత్తిళ్లు తగ్గుముఖం పట్టడంతో లాభాల ఆర్జించినట్టు కంపెనీ ప్రకటించింది.

వరుసగా మూడో త్రైమాసికంలో ఇన్ఫోసిస్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి తన టార్గెట్ ను పెంచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఇప్పుడు 4.5 నుండి 5 శాతం ఆదాయ వృద్ధిని ఆశిస్తోంది. ఇది గత త్రైమాసికంలో ఇచ్చిన 3.75-4.50 శాతం అంచనా కంటే ఎక్కువ. ఆపరేటింగ్ మార్జిన్ అంచనాలు 20-22 శాతం వద్ద మారలేదు. ఈ త్రైమాసికంలో కంపెనీ 5,591 మంది ఉద్యోగులను తీసుకొంది. దీనితో మొత్తం ఉద్యోగుల సంఖ్య 3,23,379కి చేరింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 15,000 మందికి పైగా ఉద్యోగులను నియమించుకుంటుందని ఇన్ఫోసిస్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జయేష్ సంఘ్రాజ్కా చెప్పారు.వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2025-26) 20,000 మందికి పైగా కొత్త వారిని నియమించుకోవాలని అనుకుంటున్నట్లు ఆయన తెలిపారు.

Tags:    

Similar News