Rewind 2025: రాకెట్ వేగంతో బంగారం, పాతాళానికి రూపాయి.. ఈ ఏడాది మార్కెట్‌ను వెంటాడిన అనిశ్చితి..!

Rewind 2025: 2025 దేశ ఆర్థిక వాణిజ్య ముఖచిత్రంలో కీలక మలుపులు, మార్పులకు కేంద్ర బిందువైంది. జీఎస్టీ శ్లాబ్ ల సవరణతో మధ్యతరగతికి ఊరట కలిగినా, ట్రేడ్ వార్, టారిఫ్ వార్ పర్యవసానాలు పెను ప్రభావం చూపాయి.

Update: 2025-12-29 08:39 GMT

Rewind 2025: 2025 దేశ ఆర్థిక వాణిజ్య ముఖచిత్రంలో కీలక మలుపులు, మార్పులకు కేంద్ర బిందువైంది. జీఎస్టీ శ్లాబ్ ల సవరణతో మధ్యతరగతికి ఊరట కలిగినా, ట్రేడ్ వార్, టారిఫ్ వార్ పర్యవసానాలు పెను ప్రభావం చూపాయి. బంగారం, వెండి ధరలు ఈ ఏడాది రాకెట్ లా దూసుకెళ్లగా మన రూపాయి మహా పతనాన్ని చవిచూసింది. ఇక స్టాక్ మార్కెట్లనూ అనిశ్చితి వెంటాడింది.

ఈ ఏడాది చోటుచేసుకున్న అంతర్జాతీయ పరిణామాలు మన ఆర్ధిక వ్యవస్ధను ప్రభావితం చేశాయి. ఇరాన్, ఇజ్రాయెల్ ..రష్యా_ ఉక్రెయిన్ వార్ , మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలు ఆర్ధిక వాణిజ్య రంగాలపై ప్రతికూల ప్రభావం చూపాయి. భారత్, చైనా సహా పలు దేశాల ఎగుమతులపై అమెరికా ఎడాపెడా సుంకాలతో విరుచుకుపడింది. టారిఫ్ ల భారం నుంచి ఉపశమనం కల్పించేందుకు అమెరికాతో భారత్ చర్చలు జరుపుతున్నా ట్రేడ్ డీల్ ఓ కొలిక్కిరాకపోవడం నిరాశపరుస్తోంది. పలు దేశాలతో అమెరికా వాణిజ్య ఒప్పందాలను క్లియర్ చేస్తేనే అంతర్జాతీయ ఆర్ధిక వృద్ధికి బాటలు పడతాయని నిపుణులు చెబుతున్నారు.

మరోవైపు అంతర్జాతీయ ఆర్ధిక అనిశ్చితి ప్రభావంతో బంగారం వెండి ధరలు భగ్గుమన్నాయి. గోల్డ్, సిల్వర్ లో పెట్టుబడులకు మగువలూ, మదుపుదారులూ మొగ్గుచూపడంతో యల్లోమెటల్ ఎల్లలు లేకుండా పెరుగుతున్నది. ఏడాది చివరిలోనూ గోల్డ్ రేస్ కు బ్రేక్ పడటం లేదు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపు అంచనాలతో గోల్డ్ ధరలు చుక్కలు చూస్తున్నాయి. 2024డిసెంబర్ లో తులం బంగారం రూ. 75,000 కాగా ప్రస్తుతం పదిగ్రాముల పసిడి 1,43,190 రూపాయలు దాటి పరుగులు పెడుతోంది. ఏడాదిలోనే గోల్డ్ ధరలు ఏకంగా 80 శాతంపైగా పెరిగాయి. ఇక కిలో వెండి ఏడాది ఆరంభంలో దాదాపు లక్ష రూపాయలు పలుకగా ఇప్పుడది రెండున్నర లక్షల మార్క్ కు చేరి సామాన్యుడికి దూరమైంది. ఏడాది వ్యవధిలో సిల్వర్ ఏకంగా 165 శాతం పెరిగింది. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లలో కోత విధిస్తుందనే అంచనాలతో హాట్ మెటల్స్ చుక్కలు తాకుతున్నాయి.

అంతర్జాతయ ఆర్ధిక అనిశ్చితి స్టాక్ మార్కెట్లలోనూ ప్రతిబింబించింది. కీలక సూచీలు ఊగిసలాట ధోరణితోనే కదిలాయి. ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఎఫ్ ఐఐలు ఎగ్జిట్ మోడ్ తీసుకోవడంతో పలు రంగాల షేర్లు నేలచూపులు చూశాయి. ఈ ఏడాది 78,507 పాయింట్ల వద్ద సెన్సెక్స్ పయనం కొనసాగగా ప్రస్తుతం 85,041 పాయింట్ల వద్ద కదలాడుతున్నది. ఇక ఎన్ ఎస్ ఈ నిఫ్టీ 23742 పాయింట్ల వద్ద ఈ ఏడాది ని ఆరంభించి ప్రస్తుతం 26,042 పాయింట్ల ప్రస్ధానానికి చేరింది. మరి కొత్త ఏడాదిలోనైనా కీలక సూచీలు పరుగులు పెడతాయా అనేది చూడాలి. రూపాయి పతనానికి అడ్డుకట్ట వేయడం, ఎఫ్ఐఐలను ఆకట్టుకునేలా సుస్ధిర వృద్ధిని కొనసాగించే చర్యలు చేపడితేనే స్టాక్ మార్కెట్లు మళ్లీ దూసుకెళ్లే అవకాశం ఉంది.

ఇక బంగారం, వెండికి డిమాండ్ పెరగడంతో పాటు ఎఫ్ఐఐల నిష్క్రమణ, ట్రేడ్ డీల్స్ లో జాప్యం, ఆర్బీఐ నుంచి ఆశించిన మేర చర్యలు లేకపోవడంతో మన రూపాయి విలువ పాతాళానికి చేరుకుంది. ఓ దశలో డాలర్ తో రూపాయి మారకం ఏకంగా 91 రూపాయలకు చేరువవడం మన కరెన్సీ బలహీనతను ఎత్తిచూపింది. డాలర్ తో ఆసియా కరెన్సీలు దారుణంగా పడిపోయినా రూపాయి విలువ మరింత ఎక్కువగా పతనమవడం ఆందోళన రేకెత్తిస్తోంది. రూపాయి విలువ పతనంతో మన దిగుమతులు భారం కావడంతో పాటు నిత్యావసరాల ధరలు భగ్గుమనే అవకాశం ఉంది.

Tags:    

Similar News