EPFO: మీ జీతం రూ.30 వేలు పైనే ఉంటే.. మీకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా..?

EPFO: మీ జీతం రూ.30 వేలు పైనే ఉంటే.. మీకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా..?

Update: 2026-01-18 00:57 GMT

EPFO Pension Rules: ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న కోట్లాది మంది ఉద్యోగులు తమ ఉద్యోగ జీవితం ముగిసిన తర్వాత ఆర్థిక భద్రత ఎలా ఉంటుందన్న ఆలోచనతో తరచూ ఆందోళన చెందుతుంటారు. ఉద్యోగంలో ఉన్నప్పుడు వచ్చే జీతం రిటైర్మెంట్ తర్వాత కూడా సరిపోతుందా? పెన్షన్ రూపంలో లభించే ఆదాయం పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని తట్టుకోగలదా? అనే సందేహాలు వారికి నిత్యం వెంటాడుతుంటాయి. అయితే ఈ భయాలకు కొంతవరకు ఉపశమనం కలిగించేలా తాజా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం, ఈపీఎఫ్ఓ కలిసి పెన్షన్ లెక్కింపు విధానంలో కీలక మార్పులు చేయడానికి సన్నద్ధమవుతున్నాయి.

ప్రస్తుతం ఈపీఎఫ్ఓ పరిధిలో పెన్షన్ లెక్కింపుకు ఒక ముఖ్యమైన పరిమితి ఉంది. ఉద్యోగి ఎంత జీతం తీసుకుంటున్నా, పెన్షన్ గణనకు గరిష్ట ప్రాథమిక జీతాన్ని నెలకు రూ.15,000 వరకే పరిగణనలోకి తీసుకుంటున్నారు. అంటే ఒక ఉద్యోగి వాస్తవంగా రూ.50 వేలైనా, లక్ష రూపాయలైనా జీతం పొందుతున్నా, పెన్షన్ ఫండ్‌కు సంబంధించిన లెక్కలు మాత్రం రూ.15 వేల ఆధారంగానే జరుగుతున్నాయి. ఈ కారణంగానే పదవీ విరమణ తర్వాత చాలా మందికి పెన్షన్ మొత్తం తక్కువగా వస్తోంది. ప్రస్తుతం ఈ విధానం ప్రకారం గరిష్టంగా నెలకు సుమారు రూ.7,500 వరకు మాత్రమే పెన్షన్ లభిస్తుండగా, కనీసంగా రూ.1,000తో సరిపెట్టుకోవాల్సి వస్తోంది.

ఇప్పుడు ఈ పరిస్థితిని మార్చే దిశగా చర్చలు జరుగుతున్నాయి. పెన్షన్ లెక్కింపుకు ఉన్న రూ.15 వేల జీత పరిమితిని రూ.30 వేల వరకు పెంచాలనే ప్రతిపాదనపై ప్రభుత్వం పరిశీలన చేస్తోంది. సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల మేరకు ఈ మార్పు అమలులోకి వస్తే, ప్రైవేట్ ఉద్యోగుల రిటైర్మెంట్ జీవితం మరింత సుస్థిరంగా మారే అవకాశం ఉంది.

ఈపీఎఫ్ఓ పెన్షన్‌ను ఒక నిర్దిష్ట సూత్రం ఆధారంగా లెక్కిస్తుంది. ఉద్యోగి గత 60 నెలల సగటు ప్రాథమిక జీతాన్ని “పెన్షన్ జీతం”గా పరిగణించి, దాన్ని మొత్తం సేవా సంవత్సరాలతో గుణించి 70తో భాగిస్తారు. ఈ లెక్కన జీత పరిమితి రూ.30,000కు పెరిగితే ఫలితం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకు, ఒక ఉద్యోగి 35 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసి ఉంటే, ప్రస్తుతం అతనికి లభిస్తున్న సుమారు రూ.7,500 పెన్షన్ కొత్త నిబంధనలతో దాదాపు రూ.15,000 వరకు పెరిగే అవకాశం ఉంటుంది. అంటే నెలవారీ పెన్షన్ దాదాపు రెండింతలు అవుతుంది.

ఇదే సమయంలో ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్ కింద కనీస పెన్షన్ కూడా గణనీయంగా పెరిగే సూచనలు ఉన్నాయి. ప్రస్తుతం రూ.1,000గా ఉన్న కనీస పెన్షన్ భవిష్యత్తులో రూ.4,000కు పైగా చేరవచ్చని అంచనా వేస్తున్నారు. జీత పరిమితి పెరగడం వల్ల ఈపీఎస్ ఖాతాలో ప్రతి నెల జమ అయ్యే మొత్తం కూడా ఎక్కువవుతుంది. దీని ప్రభావం దీర్ఘకాలంలో స్పష్టంగా కనిపించి, రిటైర్మెంట్ సమయంలో పెద్ద మొత్తంలో పెన్షన్ నిధి అందుబాటులోకి వస్తుంది.

పెరుగుతున్న ఖర్చులు, ఆరోగ్య వ్యయాలు, జీవన ప్రమాణాల మధ్య ప్రైవేట్ ఉద్యోగులకు ఇది ఒక బలమైన ఆర్థిక రక్షణగా నిలుస్తుంది. ఎన్నో సంవత్సరాలుగా తక్కువ పెన్షన్ సమస్యతో ఇబ్బంది పడుతున్న ఉద్యోగులకు ఈ మార్పులు నిజంగా ఊరటనిచ్చే అంశాలుగా మారనున్నాయి. సుప్రీంకోర్టు జోక్యంతో పీఎఫ్, పెన్షన్ నిబంధనలు మరింత న్యాయసమ్మతంగా మారి, ప్రైవేట్ ఉద్యోగుల పెన్షన్ కల నిజమయ్యే దిశగా అడుగులు పడుతున్నాయనే చెప్పాలి.

Tags:    

Similar News