Donkey Farming : లక్షాధికారి కావాలా? అయితే గాడిదలను పెంచండి.. కేంద్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్

గాడిదల సంఖ్యను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ లైవ్‌స్టాక్ మిషన్ కింద రూ.50 లక్షల వరకు 50% సబ్సిడీ అందిస్తోంది. నిరుద్యోగులకు ఇది ఒక అద్భుతమైన ఉపాధి అవకాశంగా మారింది.

Update: 2026-03-05 04:29 GMT

Donkey Farming Subsidy India

Donkey Farming :"గంగిగోవు పాలు గరిటడైనను చాలు.. కడివెడైననేమి ఖరము పాలు" అని సుమతీ శతకంలో ఎప్పుడో చెప్పారు. కానీ కాలం మారింది.. ఇప్పుడు గాడిద పాలకు ఉన్న డిమాండ్ చూస్తే గంగిగోవు కూడా ఆశ్చర్యపోవాల్సిందే. ఒకప్పుడు భారీ బరువులు మోసే పనులకు మాత్రమే వాడే గాడిదలకు ఇప్పుడు మంచి రోజులు వచ్చాయి. గాడిద పాలలో ఉండే ఔషధ గుణాలు, వాటితో తయారయ్యే కాస్మెటిక్స్ వల్ల వీటికి విపరీతమైన క్రేజ్ పెరిగింది. ఈ నేపథ్యంలో గాడిదల పెంపకాన్ని ఒక లాభసాటి వ్యాపారంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. నిరుద్యోగ యువతకు, రైతులకు ఏకంగా రూ.50 లక్షల వరకు భారీ ఆర్థిక సాయం ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది.

దేశంలో రోజురోజుకూ తగ్గిపోతున్న గాడిదల సంఖ్యపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, గత కొన్ని ఏళ్లలో వీటి సంఖ్య ఏకంగా 60 శాతం పడిపోయింది. 2019 పశుగణన నాటికి దేశంలో కేవలం 1.23 లక్షల గాడిదలు మాత్రమే ఉన్నాయి. రాజస్థాన్, యూపీ, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో వీటి ఉనికి ఉన్నా.. కొన్ని చోట్ల పట్టుమని పది కూడా లేకపోవడం గమనార్హం. అందుకే వీటి జాతిని సంరక్షించడంతో పాటు పాల ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు నేషనల్ లైవ్‌స్టాక్ మిషన్ (NLM) కింద కేంద్రం భారీ సబ్సిడీలను అందిస్తోంది.

ఈ పథకం కింద గాడిదలు, గుర్రాలు లేదా ఒంటెల పెంపకం కేంద్రాలను ఏర్పాటు చేసే వారికి ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇస్తోంది. మీరు ఏర్పాటు చేసే ప్రాజెక్ట్ ఖర్చులో 50 శాతం సబ్సిడీని కేంద్రమే భరిస్తుంది. ఉదాహరణకు మీరు ఒక కోటి రూపాయల పెట్టుబడితో బ్రీడింగ్ సెంటర్ పెడితే, అందులో రూ.50 లక్షలు ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తుంది. రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, స్వయం సహాయక బృందాలు లేదా సెక్షన్ 8 కింద నమోదైన కంపెనీలు ఈ సాయం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కేవలం వ్యక్తులకే కాకుండా, జాతి సంరక్షణ కోసం పనిచేసే రాష్ట్ర ప్రభుత్వాలకు ఏకంగా రూ.10 కోట్ల వరకు నిధులు కేటాయిస్తోంది.

మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. గాడిద పాలను ఫుడ్ ఐటమ్‎గా గుర్తించాలని ప్రభుత్వం FSSAIని కోరింది. గాడిద పాలు సౌందర్య సాధనాల తయారీలో (సోపులు, క్రీములు) ఎక్కువగా వాడుతుండటంతో మార్కెట్‌లో వీటికి లీటరుకు వేల రూపాయల ధర పలుకుతోంది. ఉపాధి లేక ఇబ్బంది పడే యువతకు ఇదొక అద్భుతమైన వ్యాపార అవకాశంగా నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వం ఇస్తున్న ఈ 50 లక్షల దన్నుతో గాడిదల పెంపకం ఇకపై గౌరవప్రదమైన, లాభదాయకమైన వ్యాపారంగా మారబోతోంది.

Tags:    

Similar News