Palak Paneer Row గొడవ: అమెరికా యూనివర్సిటీకి చుక్కలు చూపించిన భారత విద్యార్థులు.. రూ. 1.82 కోట్ల పరిహారం!

అమెరికాలో పాలక్ పనీర్ వాసనపై వివాదం. భారత విద్యార్థులకు రూ. 1.82 కోట్ల భారీ పరిహారం చెల్లించిన కొలరాడో యూనివర్సిటీ. ఆహారంపై జాతి వివక్షపై (Food Racism) గెలిచిన ఆదిత్య ప్రకాశ్, ఉర్మి భట్టాచార్య.

Update: 2026-01-21 08:23 GMT

విదేశాల్లో భారతీయుల ఆహారపు అలవాట్లపై వివక్ష చూపడం కొత్తేమీ కాదు. కానీ, తన ఆహారాన్ని తక్కువ చేసినందుకు ఒక అమెరికా యూనివర్సిటీని కోర్టుకు లాగి, ఏకంగా రూ. 1.82 కోట్ల ($2,00,000) పరిహారం పొంది వార్తల్లో నిలిచారు ఇద్దరు భారతీయ విద్యార్థులు. 'ఫుడ్ రేసిజం'పై జరిగిన ఈ పోరాటం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది.

అసలేం జరిగింది?

కొలరాడో విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ చేస్తున్న ఆదిత్య ప్రకాశ్, ఆయన కాబోయే భార్య ఉర్మి భట్టాచార్యలకు 2023లో ఒక చేదు అనుభవం ఎదురైంది.

పాలక్ పనీర్ వివాదం: క్యాంపస్ మైక్రోవేవ్‌లో ప్రకాశ్ తన లంచ్ కోసం తెచ్చుకున్న 'పాలక్ పనీర్' వేడి చేస్తుండగా, ఒక బ్రిటిష్ స్టాఫ్ మెంబర్ వచ్చి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ కూర 'ఘాటైన' వాసన వస్తోందని, అలాంటివి వేడి చేయకూడదని మందలించారు.

వివక్ష: "అలాంటి రూల్ ఎక్కడుంది?" అని ప్రకాశ్ ప్రశ్నించగా.. కూరలు కాకుండా శాండ్‌విచ్‌లు తెచ్చుకోవడం మంచిదని సదరు సిబ్బంది హేళనగా సమాధానమిచ్చారు.

యూనివర్సిటీ ప్రతీకార చర్యలు!

ఈ చిన్న సంఘటనతో మొదలైన వివాదం ముదిరి పాకాన పడింది. ఈ వివక్షపై ప్రశ్నించినందుకు యూనివర్సిటీ యాజమాన్యం ఆ జంటపై ప్రతీకార చర్యలకు దిగింది:

  1. వారి రీసెర్చ్ ఫండ్స్ నిలిపివేసింది.
  2. టీచింగ్ ఉద్యోగాల నుంచి తొలగించింది.
  3. వారి పీహెచ్‌డీ అడ్వైజర్లను మార్చేసింది.

దీంతో విసిగిపోయిన విద్యార్థులు పౌర హక్కుల దావా వేశారు. ఇది కేవలం ఆహారం గురించి కాదని, తమ సంస్కృతిని అవమానించడంపై ఇస్తున్న సందేశమని వారు స్పష్టం చేశారు.

భారీ సెటిల్‌మెంట్.. కానీ షరతులు!

దీర్ఘకాలిక కోర్టు కేసుల వల్ల పరువు పోతుందని భావించిన విశ్వవిద్యాలయం, సెప్టెంబర్ 2025లో విద్యార్థులతో రాజీ కుదుర్చుకుంది.

పరిహారం: విద్యార్థులకు రూ. 1.82 కోట్ల సెటిల్‌మెంట్ ఇచ్చేందుకు అంగీకరించింది.

డిగ్రీలు: వారికి పీహెచ్‌డీ డిగ్రీలు ఇవ్వడానికి ఒప్పుకుంది.

నిషేధం: అయితే, భవిష్యత్తులో ఆ యూనివర్సిటీలో చదవడం లేదా ఉద్యోగం చేయడంపై వారిపై నిషేధం విధించింది.

కమలా హారిస్‌కూ తప్పలేదు!

ఈ సందర్భంగా ఉర్మి భట్టాచార్య మాట్లాడుతూ.. అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌పై కూడా ఇలాంటి 'కూర వాసన' వ్యాఖ్యలు వచ్చాయని గుర్తుచేశారు. భారతీయులను అవమానించడానికి 'ఆహారాన్ని' అస్త్రంగా వాడుకోవడం దురదృష్టకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ జంట భారతదేశానికి తిరిగి వచ్చారు.

Tags:    

Similar News