Stock Market Crash: స్టాక్ మార్కెట్‌లో 'బ్లాక్ వీక్'.. ఒక్క వారంలో రూ. 4.48 లక్షల కోట్లు ఆవిరి!
Stock Market Crash: మిడిల్ ఈస్ట్ యుద్ధ ఉద్రిక్తతలు, ముడి చమురు ధరల పెరుగుదల వల్ల భారత స్టాక్ మార్కెట్ భారీగా కుప్పకూలింది. గత వారం రోజుల్లోనే సెన్సెక్స్ టాప్-10 కంపెనీల మార్కెట్ క్యాప్ రూ. 4.48 లక్షల కోట్లు ఆవిరైంది. ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ వంటి దిగ్గజ బ్యాంకులు, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎదుర్కొన్న భారీ నష్టాల పూర్తి వివరాలు ఈ స్టోరీలో చదవండి.
Stock Market Crash: స్టాక్ మార్కెట్‌లో 'బ్లాక్ వీక్'.. ఒక్క వారంలో రూ. 4.48 లక్షల కోట్లు ఆవిరి!
Stock Market Crash: మిడిల్ ఈస్ట్‌లో ముదురుతున్న యుద్ధ మేఘాలు, ముడి చమురు ధరల పెరుగుదల ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లను కుదిపేస్తున్నాయి. దీని ప్రభావం భారతీయ మార్కెట్లపై తీవ్రంగా పడింది. గత ఐదు ట్రేడింగ్ రోజుల్లో దలాల్ స్ట్రీట్ భారీ పతనాన్ని చవిచూసింది. గడిచిన వారంలో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ 4,355 పాయింట్లు (5.51%) నష్టపోగా, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 1,299.35 పాయింట్లు (5.31%) పతనమైంది.
రూ.4.48 లక్షల కోట్లు హాంఫట్..
అమెరికా-ఇజ్రాయెల్ .. ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలతో మదుపరుల నమ్మకం సడలింది. పలు నివేదిక ప్రకారం.. కేవలం గత వారం ఐదు రోజుల్లోనే సెన్సెక్స్ టాప్-10 కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ కంబైన్డ్ గా రూ. 4.48 లక్షల కోట్లు తగ్గిపోయింది. ప్రధానంగా ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ (SBI), ప్రైవేట్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులు భారీగా నష్టపోయాయి.
పెట్టుబడిదారులకు కోలుకోలేని దెబ్బ..
* ఎస్‌బీఐ: గత వారంలో అత్యధికంగా నష్టపోయింది ఈ ప్రభుత్వ రంగ బ్యాంకే. దీని మార్కెట్ విలువ రూ.89,306.22 కోట్లు తగ్గి ప్రస్తుతం రూ.9.66 లక్షల కోట్లకు పడిపోయింది.
* హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఇన్వెస్టర్లకు రూ.61,715.32 కోట్ల నష్టం వాటిల్లింది. దీని మార్కెట్ విలువ రూ.12.57 లక్షల కోట్లకు చేరుకుంది.
* బజాజ్ ఫైనాన్స్ & టీసీఎస్: బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ క్యాప్ రూ.59,082.49 కోట్లు తగ్గగా, ఐటీ దిగ్గజం టీసీఎస్ విలువ రూ.53,312.12 కోట్లు ఆవిరైంది.
* రిలయన్స్ ఇండస్ట్రీస్: ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ కూడా నష్టాల నుంచి తప్పించుకోలేకపోయింది. ఈ సంస్థ మార్కెట్ క్యాప్ రూ.33,289.88 కోట్లు తగ్గి ప్రస్తుతం రూ.18.68 లక్షల కోట్లుగా ఉంది.
భారతీ ఎయిర్‌టెల్ (రూ.38,688 కోట్లు), ఐసీఐసీఐ బ్యాంక్ (రూ.42,205 కోట్లు), ఎల్ఐసీ (రూ.31,245 కోట్లు), ఇన్ఫోసిస్ (రూ.24,230 కోట్లు), హెచ్‌యూఎల్ (రూ.15,401 కోట్లు) మార్కెట్ విలువ కూడా గణనీయంగా తగ్గింది. యుద్ధం, గ్లోబల్ టెన్షన్స్ కారణంగా భారీ నష్టాలు చవిచూసినప్పటికీ, మార్కెట్ క్యాప్ పరంగా దేశంలోనే అతిపెద్ద కంపెనీగా ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. ఆ తర్వాతి స్థానాల్లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంకులు ఉన్నాయి.