Meta: మెటాలో 'లేఆఫ్స్' ప్రకంపనలు.. 16 వేల మంది ఉద్యోగులపై వేటు?

Meta: మెటా సంస్థలో మరోసారి భారీ లేఆఫ్స్ కలకలం! ఏఐ (AI) రంగంలో పెట్టుబడులు పెంచేందుకు దాదాపు 16,000 మంది ఉద్యోగులను తొలగించేందుకు మార్క్ జుకర్‌బర్గ్ సిద్ధమవుతున్నారా? రాయటర్స్ నివేదిక సారాంశం, టెక్ పరిశ్రమలో మారుతున్న పరిణామాల గురించి పూర్తి వివరాలు ఈ స్టోరీలో చదవండి.

Update: 2026-03-14 12:24 GMT

Meta: మెటాలో 'లేఆఫ్స్' ప్రకంపనలు.. 16 వేల మంది ఉద్యోగులపై వేటు? 

Meta: ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ వంటి సోషల్ మీడియా దిగ్గజ ప్లాట్‌ఫారమ్‌ల మాతృసంస్థ మెటా (Meta) మరోసారి భారీ ఎత్తున ఉద్యోగుల తొలగింపునకు (Layoffs) సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ వార్తా సంస్థ 'రాయటర్స్' నివేదిక ప్రకారం.. మెటా తన మొత్తం సిబ్బందిలో దాదాపు 20 శాతం మందిని అంటే సుమారు 16,000 మందిని ఇంటికి పంపే అవకాశం ఉందని సమాచారం.

లేఆఫ్స్‌కు ప్రధాన కారణం ..

కంపెనీ కార్యకలాపాలలో సామర్థ్యాన్ని పెంచడంతో పాటు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోసం భారీగా వెచ్చించాల్సి రావడమే ఈ తొలగింపులకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. జనరేటివ్ ఏఐ రంగంలో ప్రపంచ దేశాలతో పోటీ పడాలంటే ఖర్చు తగ్గించుకోవాలని మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ భావిస్తున్నట్లు సమాచారం. గతేడాది డిసెంబర్ నాటికి మెటాలో సుమారు 79,000 మంది ఉద్యోగులు ఉండగా, అందులో 20 శాతం మేర అంటే 16,000 మందిపై వేటు పడవచ్చు ఈ నివేదిక పేర్కొంటుంది. అయితే ఈ నివేదికలపై మెటా ప్రతినిధి ఆండీ స్టోన్ స్పందిస్తూ.. ఇవన్నీ కేవలం 'అంచనాలు' మాత్రమేనని కొట్టిపారేశారు. ఉద్యోగుల తొలగింపుపై ఇప్పటి వరకు ఎటువంటి తుది నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. మెటా గతంలో 2022 - 2023లో కూడా ఖర్చు తగ్గించుకునే క్రమంలో దాదాపు 21,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించింది.

మోర్గాన్ స్టాన్లీ ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం.. ఏఐ వల్ల ఉద్యోగాలకు దీర్ఘకాలికంగా పెద్ద ముప్పు ఉండకపోవచ్చని పేర్కొంది. ఏఐ వల్ల కొన్ని పనులు ఆటోమేట్ అయినప్పటికీ, మనుషులు కొత్త రకమైన నైపుణ్యాలను నేర్చుకుని సరికొత్త ఉద్యోగాల్లోకి మారతారని ఈ నివేదిక స్పష్టం చేసింది. కేవలం మెటా మాత్రమే కాకుండా, ఏఐపై దృష్టి పెట్టే క్రమంలో ఒరాకిల్ (Oracle) 20,000 నుంచి 30,000 ఉద్యోగాలను, అమెజాన్ (Amazon) ఇటీవలే 16,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించాయి. టెక్ ప్రపంచంలో ఏఐ విప్లవం ఒకవైపు సంచలనం సృష్టిస్తుంటే, మరోవైపు ఆ విప్లవానికి అనుగుణంగా మారే క్రమంలో వేల సంఖ్యలో ఉద్యోగులు తమ ఉపాధిని కోల్పోతుండటం ఆందోళన కలిగిస్తోంది.

Tags:    

Similar News