Google Chrome: గూగుల్ క్రోమ్ యూజర్లకు ‘హై అలర్ట్’.. మీ బ్రౌజర్‌ను వెంటనే అప్‌డేట్ చేయండి!
Google Chrome: గూగుల్ క్రోమ్ వినియోగదారులకు తీవ్ర భద్రతా హెచ్చరిక జారీ చేసింది. క్రోమ్‌లో రెండు ప్రమాదకరమైన 'జీరో-డే' లోపాలను గుర్తించిన గూగుల్, వెంటనే బ్రౌజర్‌ను అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది. హ్యాకర్ల బారిన పడకుండా మీ డేటాను ఎలా కాపాడుకోవాలి? అప్‌డేట్ చేయడానికి అనుసరించాల్సిన స్టెప్స్ ఏమిటి? అనే పూర్తి వివరాలు ఈ స్టోరీలో చదవండి.
Google Chrome: గూగుల్ క్రోమ్ యూజర్లకు ‘హై అలర్ట్’.. మీ బ్రౌజర్‌ను వెంటనే అప్‌డేట్ చేయండి!
Google Chrome: ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉపయోగించే వెబ్ బ్రౌజర్ గూగుల్ క్రోమ్ వినియోగదారులకు గూగుల్ సంస్థ హై అలర్ట్ జారీ చేసింది. క్రోమ్‌లో రెండు ప్రమాదకరమైన 'జీరో-డే' (Zero-day) భద్రతా లోపాలు ఉన్నట్లు కంపెనీ ధృవీకరించింది. వీటిని హ్యాకర్లు ఇప్పటికే వినియోగిస్తున్నట్లు తేలడంతో, సుమారు 3.5 బిలియన్ల మంది వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం.. క్రోమ్‌లో CVE-2026-3909, CVE-2026-3910 అనే రెండు తీవ్రమైన లోపాలను గూగుల్ గుర్తించింది. ఇవి 'జీరో-డే' వల్నరబిలిటీలు కావడం వల్ల, సాఫ్ట్‌వేర్ సంస్థకు తెలిసేలోపే హ్యాకర్లు వీటి ద్వారా దాడులకు పాల్పడే అవకాశం ఉంటుంది.
CVE-2026-3909 (Skia లోపం): ఇది క్రోమ్ గ్రాఫిక్స్ లైబ్రరీ సిస్టమ్‌కు సంబంధించిన లోపం. దీని ద్వారా హ్యాకర్లు యూజర్లను ప్రమాదకరమైన వెబ్‌సైట్లకు మళ్లించి, వారి సిస్టమ్‌లో హానికరమైన కోడ్‌ను ప్రవేశపెట్టగలరు.
CVE-2026-3910 (V8 ఇంజిన్ లోపం): ఇది క్రోమ్ జావాస్క్రిప్ట్ ఇంజిన్‌లో ఉన్న లోపం. దీని ద్వారా దాడి చేసేవారు కేవలం ఒక HTML పేజీ సహాయంతో యూజర్ డేటాను దొంగిలించే ప్రమాదం ఉంది.
కోట్ల రూపాయల రివార్డ్..
భద్రతా లోపాలను గుర్తించే పరిశోధకులను గూగుల్ 'వల్నరబిలిటీ రివార్డ్ ప్రోగ్రామ్' ద్వారా ప్రోత్సహిస్తుంది. గత 15 ఏళ్లలో ఈ ప్రోగ్రామ్ కింద సుమారు $81.6 మిలియన్ల (దాదాపు రూ.680 కోట్లు) బహుమతిని అందజేసింది. 2025 ఒక్క ఏడాదిలోనే సుమారు $17 మిలియన్లను పరిశోధకులకు చెల్లించి క్రోమ్ భద్రతను పటిష్టం చేస్తోంది. ఈ ముప్పు నుంచి తప్పించుకోవడానికి గూగుల్ ఇప్పటికే సెక్యూరిటీ అప్‌డేట్‌ను విడుదల చేసింది. అయితే, ఇది అందరికీ ఆటోమేటిక్‌గా అందడానికి సమయం పట్టవచ్చు. కాబట్టి వినియోగదారులు మాన్యువల్‌గా ఇలా అప్‌డేట్ చేసుకోవాలి.
* మీ సిస్టమ్‌లో Google Chrome ఓపెన్ చేయండి.
* కుడివైపు పైన ఉన్న మూడు చుక్కల (Three-dots) మెనూపై క్లిక్ చేయండి.
* అక్కడ Help ఆప్షన్‌ను ఎంచుకుని, About Google Chrome పై క్లిక్ చేయండి.
* కొత్త అప్‌డేట్ అందుబాటులో ఉంటే వెంటనే డౌన్‌లోడ్ అవుతుంది.
* అప్‌డేట్ పూర్తయ్యాక, బ్రౌజర్‌ను Relaunch (పునఃప్రారంభం) చేయడం మర్చిపోకండి.