Volkswagen : ఫార్చ్యూనర్ పని ఖతం? మార్కెట్లోకి 5 డేంజర్స్ వెపన్స్ దింపుతున్న ఫోక్స్‌వ్యాగన్
ఫార్చ్యూనర్ పని ఖతం? మార్కెట్లోకి 5 డేంజర్స్ వెపన్స్ దింపుతున్న ఫోక్స్‌వ్యాగన్
Volkswagen : జర్మనీకి చెందిన ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం ఫోక్స్‌వ్యాగన్ భారత మార్కెట్లో తన ఉనికిని మరింత చాటుకునేందుకు సిద్ధమైంది. 2026 సంవత్సరాన్ని తన రీబిల్డింగ్ ఇయర్‌గా ప్రకటించిన ఈ కంపెనీ, ప్రతి మూడు నెలలకొకటి చొప్పున మొత్తం 5 కొత్త మోడళ్లను లాంచ్ చేయనున్నట్లు అధికారికంగా వెల్లడించింది. ఇందులో ఎస్‌యూవీలు, సెడాన్లతో పాటు హ్యాచ్‌బ్యాక్ కార్లు కూడా ఉండటం విశేషం.
ఫోక్స్‌వ్యాగన్ ఇండియా తన భవిష్యత్తు ప్రణాళికలను ప్రకటిస్తూ వాహన ప్రియుల్లో ఆసక్తిని పెంచింది. ముఖ్యంగా 2026లో ప్రీమియం విభాగంలో తన పట్టును పెంచుకోవడమే లక్ష్యంగా కంపెనీ ముందుకు వెళ్తోంది. ఈ క్రమంలోనే టైరాన్ R-లైన్ అనే ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీని మొదటగా విడుదల చేయనుంది. ఇది ప్రస్తుతం ఉన్న టిగువాన్ కంటే పెద్దదిగా, ఏడుగురు ప్రయాణించడానికి వీలుగా ఉండేలా రూపొందించబడింది.
టైరాన్ R-లైన్ ప్రత్యేతకలు: ఈ కారును ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఆల్‌స్పేస్‌కు వారసురాలిగా పరిగణిస్తున్నారు. ఇది MQB EVO ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించబడింది. యూరో NCAP క్రాష్ టెస్టులో 5-స్టార్ రేటింగ్ సాధించి అత్యంత సురక్షితమైన కారుగా నిలిచింది. ఇందులో 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది, ఇది 201 bhp పవర్‌ను విడుదల చేస్తుంది. దీని లోపల ఉండే 15-అంగుళాల భారీ టచ్‌స్క్రీన్, మెట్రిక్స్ LED హెడ్ లాంప్స్, 30 రంగుల మూడ్ లైటింగ్ కారుకు రాజసం తీసుకొస్తాయి. ముఖ్యంగా డ్రైవర్, కో-ప్యాసింజర్ సీట్లకు మసాజ్, వెంటిలేషన్ సదుపాయం ఉండటం దీని ప్రత్యేకత.
2026లో రాబోయే ఇతర మోడళ్లు: కంపెనీ టైరాన్‌తో పాటు మరికొన్ని అప్‌డేటెడ్ మోడళ్లను కూడా తీసుకురానుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, అత్యంత ప్రజాదరణ పొందిన టైగన్, వర్టస్ కార్లకు ఫేస్‌లిఫ్ట్ వెర్షన్లను కంపెనీ ప్లాన్ చేస్తోంది. అంతేకాకుండా, ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ Volkswagen ID.4, స్పోర్ట్స్ హ్యాచ్‌బ్యాక్ ప్రేమికుల కోసం Golf GTI సెకండ్ బ్యాచ్‌ను కూడా 2026లోనే ఇండియాకు తీసుకువచ్చే అవకాశం ఉంది. మధ్యతరగతి వినియోగదారుల కోసం టెరా పేరుతో ఒక బడ్జెట్ ఎస్‌యూవీని కూడా కంపెనీ పరిశీలిస్తోంది.
ధర, పోటీ: టైరాన్ R-లైన్ ధర భారత్‌లో సుమారు రూ.43 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ఉండవచ్చు. ఇది నేరుగా టయోటా ఫార్చ్యూనర్, స్కోడా కొడియాక్, జీప్ మెరిడియన్, రాబోయే ఎంజీ మెజెస్టర్ వంటి కార్లతో తలపడనుంది. ఇతర మోడళ్లను కూడా లోకల్ గానే అసెంబుల్ చేయాలని కంపెనీ భావిస్తోంది, తద్వారా ధరలను పోటీగా ఉంచే వీలుంటుంది. మొత్తానికి 2026లో ఫోక్స్‌వ్యాగన్ భారతీయ రోడ్లపై కొత్త సంచలనం సృష్టించడానికి సిద్ధమైపోయింది.