Toyota Corolla : నమ్మిన టయోటా నట్టేట ముంచింది..కొరోలా క్రాస్ సేఫ్టీ టెస్ట్ చూస్తే వణకాల్సిందే

నమ్మిన టయోటా నట్టేట ముంచింది..కొరోలా క్రాస్ సేఫ్టీ టెస్ట్ చూస్తే వణకాల్సిందే

Update: 2026-01-29 05:50 GMT

Toyota Corolla : ప్రపంచవ్యాప్తంగా సేఫ్టీకి మారుపేరుగా నిలిచే టయోటా కంపెనీకి గ్లోబల్ NCAP షాక్ ఇచ్చింది. టయోటా నుంచి వచ్చిన పాపులర్ మోడల్ కొరోలా క్రాస్ క్రాష్ టెస్టులో ఘోరంగా విఫలమైంది. గ్లోబల్ NCAP నిర్వహించిన సేఫర్ కార్స్ ఫర్ ఆఫ్రికా క్యాంపెయిన్‌లో ఈ కారుకు కేవలం 2-స్టార్ రేటింగ్ మాత్రమే లభించింది. టయోటా వంటి దిగ్గజ సంస్థ నుంచి ఇలాంటి ఫలితం రావడం వాహన ప్రియులను విస్మయానికి గురిచేస్తోంది.

టయోటా కార్లు అంటేనే గట్టి బాడీ, అత్యుత్తమ భద్రతకు కేరాఫ్ అడ్రస్ అని అందరూ భావిస్తారు. కానీ ఆఫ్రికా మార్కెట్ కోసం తయారు చేసిన కొరోలా క్రాస్ విషయంలో ఇది తప్పని నిరూపితమైంది. గ్లోబల్ NCAP నిర్వహించిన తాజా క్రాష్ టెస్టులో ఈ ఎస్‌యూవీకి పెద్దల భద్రతలో 34 పాయింట్లకు గాను 29.27 పాయింట్లు వచ్చాయి. స్కోరు బాగానే ఉన్నప్పటికీ, స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లు తక్కువగా ఉండటంతో రేటింగ్ కేవలం 2-స్టార్లకే పరిమితమైంది.

ఫ్రంటల్ ఇంపాక్ట్ టెస్టులో డ్రైవర్, ప్యాసింజర్ తల,మెడకు మంచి రక్షణ లభించింది. అయితే, డ్యాష్‌బోర్డ్ వెనుక ఉన్న కొన్ని లోహపు భాగాలు ప్రయాణికుల మోకాళ్లకు గాయాలు చేసే అవకాశం ఉందని గుర్తించారు. అలాగే, కారు బాడీ షెల్ స్థిరంగా ఉన్నప్పటికీ, కాళ్ళ వద్ద ఉండే ఫుట్‌వెల్ ఏరియా అస్థిరంగా ఉన్నట్లు తేలింది. సైడ్ ఇంపాక్ట్ టెస్టులో తల, పొత్తికడుపుకు రక్షణ దక్కినప్పటికీ, ఛాతీ భాగం కేవలం సరిపోవు స్థాయిలో మాత్రమే రక్షణ పొందింది. సైడ్ హెడ్ ప్రొటెక్షన్ ఎయిర్‌బ్యాగ్‌లు స్టాండర్డ్‌గా లేకపోవడంతో, సైడ్ పోల్ ఇంపాక్ట్ టెస్ట్ నిర్వహించలేదు, దీనివల్ల సున్నా పాయింట్లు వచ్చాయి.

పిల్లల భద్రత విషయంలో ఈ కారుకు 49 పాయింట్లకు గాను 33 పాయింట్లు వచ్చాయి. ఇక్కడ 3-స్టార్ రేటింగ్ లభించింది. 18 నెలల చిన్నారికి పూర్తి భద్రత లభించినప్పటికీ, 3 ఏళ్ల చిన్నారి తల భాగానికి తగినంత రక్షణ దక్కలేదని గ్లోబల్ NCAP వెల్లడించింది. వెనుక వైపు అమర్చిన చైల్డ్ సీట్లు ఇంపాక్ట్ సమయంలో తల గాయాలను అడ్డుకోలేకపోయాయి. ఇది తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేసే అంశం.

గ్లోబల్ NCAP ప్రధానంగా ఒక విషయంపై ఆందోళన వ్యక్తం చేసింది. అభివృద్ధి చెందిన దేశాల్లో అమ్ముతున్న టయోటా కార్లలో ఉండే అన్ని రకాల ఎయిర్‌బ్యాగ్‌లు, లేన్ అసిస్ట్, స్పీడ్ అసిస్ట్ వంటి ఫీచర్లు ఆఫ్రికా మార్కెట్‌లోని కార్లలో లేకపోవడంపై మండిపడింది. కేవలం ఖర్చు తగ్గించుకోవడానికే కంపెనీలు ఇలా భద్రతతో రాజీ పడటం సరికాదని హితవు పలికింది. అన్ని దేశాల్లోనూ ఒకే రకమైన సేఫ్టీ స్టాండర్డ్స్‌ను పాటించాలని కంపెనీలను డిమాండ్ చేసింది. ఈ రిజల్ట్స్ చూసిన తర్వాత వాహనదారులు కారు బ్రాండ్‌ను మాత్రమే కాకుండా, అందులో ఉన్న సేఫ్టీ కిట్‌ను కూడా క్షుణ్ణంగా తనిఖీ చేయాల్సిన అవసరం ఉందని స్పష్టమవుతోంది.

Tags:    

Similar News