Nissan : ఈ కారంటే పడిచచ్చిపోతున్న విదేశీయులు..మారుతి, హ్యుందాయ్‌లకు ఇది గట్టి షాకే

ఈ కారంటే పడిచచ్చిపోతున్న విదేశీయులు..మారుతి, హ్యుందాయ్‌లకు ఇది గట్టి షాకే

Update: 2026-01-30 07:00 GMT

Nissan : భారతదేశ ఆటోమొబైల్ రంగం అనగానే మనకు వెంటనే గుర్తొచ్చే పేర్లు మారుతి సుజుకి, హ్యుందాయ్. కానీ విదేశాలకు కార్ల ఎగుమతుల విషయంలో ఇప్పుడు సీన్ మారింది. ఎవరూ ఊహించని విధంగా ఒక చిన్న కారు దిగ్గజ బ్రాండ్‌లను వెనక్కి నెట్టి నంబర్ 1 స్థానానికి దూసుకెళ్లింది. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.. మారుతి బలేనో, హ్యుందాయ్ వెర్నా వంటి పాపులర్ కార్లను కాదని నిస్సాన్ మాగ్నైట్ ఎగుమతుల్లో రికార్డు సృష్టించింది. భారత ప్యాసింజర్ వాహన రంగానికి 2025 సంవత్సరం ఒక మధుర జ్ఞాపకంలా నిలిచిపోనుంది. జీఎస్టీ తగ్గింపు, పండుగ సీజన్ అమ్మకాలతో దేశీయంగా కార్ల విక్రయాలు జోరుగా సాగాయి. అయితే విదేశీ ఎగుమతుల విషయంలో మాత్రం గత డిసెంబర్ నెలతో పోలిస్తే 9.36 శాతం స్వల్ప తగ్గుదల కనిపిస్తోంది. మొత్తం 69,100 యూనిట్ల కార్లు విదేశాలకు ఎగుమతి కాగా, ఇందులో ఒక కారు మాత్రం అద్భుతమైన వృద్ధిని కనబరిచింది. అదే నిసాన్ మాగ్నైట్. సబ్-4 మీటర్ ఎస్‌యూవీ విభాగంలో ఈ కారు ఇప్పుడు గ్లోబల్ మార్కెట్‌లో హాట్ కేకులా అమ్ముడవుతోంది.

గణాంకాలను పరిశీలిస్తే.. డిసెంబర్ 2025లో నిస్సాన్ మాగ్నైట్ ఎగుమతులు ఏకంగా 260.62 శాతం పెరిగాయి. గత ఏడాది ఇదే నెలలో కేవలం 2,570 యూనిట్లు ఎగుమతి అవ్వగా, ఈ ఏడాది ఆ సంఖ్య ఏకంగా 9,268 యూనిట్లకు చేరింది. భారతదేశం నుంచి ఎగుమతి అవుతున్న మొత్తం కార్లలో మాగ్నైట్ వాటా 13.41 శాతంగా ఉండటం విశేషం. మేక్ ఇన్ ఇండియా.. మేక్ ఫర్ ద వరల్డ్ అనే నినాదంతో తయారైన ఈ కారును ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్, లాటిన్ అమెరికా సహా సుమారు 65 దేశాలకు భారత్ నుంచే సరఫరా చేస్తున్నారు.

ఇక కంపెనీల వారీగా చూస్తే.. మారుతి సుజుకి ఇప్పటికీ 36.8 శాతం వాటాతో అతిపెద్ద ఎగుమతిదారుగా కొనసాగుతోంది. అయితే గతేడాదితో పోలిస్తే మారుతి ఎగుమతులు భారీగా తగ్గాయి. ముఖ్యంగా స్విఫ్ట్, ఫ్రాంక్స్, బలేనో వంటి మోడళ్ల షిప్‌మెంట్‌లు గణనీయంగా పడిపోవడం మారుతికి గట్టి ఎదురుదెబ్బ. మరోవైపు హ్యుందాయ్ తన పట్టును నిరూపించుకుంటూ నంబర్ 2 స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. హ్యుందాయ్ వెర్నా, i10 మోడళ్లకు విదేశాల్లో మంచి డిమాండ్ లభించింది.

నిస్సాన్ కంపెనీకి మాగ్నైట్ ఒక వరంగా మారింది. ఈ ఒక్క మోడల్ వల్లే నైసాన్ కంపెనీ తన ఓవరాల్ ఎగుమతుల్లో భారీ లాభాలను ఆర్జించింది. అయితే అదే సంస్థకు చెందిన సన్నీ సెడాన్ అమ్మకాలు మాత్రం తగ్గుముఖం పట్టాయి. ఇక ఫోక్స్‌వ్యాగన్ విషయానికి వస్తే, ఆ కంపెనీకి గతేడాది నిరాశే మిగిలింది. టైగూన్, వర్టస్ వంటి కార్ల ఎగుమతులు ఆశించిన స్థాయిలో లేవు. టయోటా, కియా బ్రాండ్లు మాత్రం స్వల్ప వృద్ధిని సాధించి తమ స్థానాలను నిలబెట్టుకున్నాయి. మొత్తానికి ఎగుమతుల మార్కెట్ ఇప్పుడు సెడాన్ల నుంచి ఎస్‌యూవీల వైపు మళ్లుతోందని ఈ ట్రెండ్ చూస్తుంటే అర్థమవుతోంది.

Tags:    

Similar News