Renault Duster 2026 : రెనో డస్టర్ ఈజ్ బ్యాక్..సరికొత్త లుక్..అదిరిపోయే ఫీచర్లు..రూ.21,000కే బుకింగ్

రెనో డస్టర్ ఈజ్ బ్యాక్..సరికొత్త లుక్..అదిరిపోయే ఫీచర్లు..రూ.21,000కే బుకింగ్

Update: 2026-01-27 02:00 GMT

Renault Duster 2026 : మూడేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఐకానిక్ SUV రెనాల్ట్ డస్టర్ సరికొత్త అవతారంలో భారత మార్కెట్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. 2022లో మొదటి జనరేషన్ మోడల్‌ను నిలిపివేసిన రెనాల్ట్, ఇప్పుడు నేరుగా గ్లోబల్ థర్డ్-జనరేషన్ మోడల్‌ను మేడ్ ఫర్ ఇండియా ట్యాగ్‌తో విడుదల చేసింది. అదిరిపోయే లుక్, మోడ్రన్ ఫీచర్లు, హైబ్రిడ్ ఇంజిన్ ఆప్షన్లతో వస్తున్న ఈ SUV ఇప్పటికే బుకింగ్స్ షురూ చేసుకుంది. కొత్త డస్టర్ తన పాత బాక్సీ, గంభీరమైన రూపాన్ని కొనసాగిస్తూనే, మరింత మోడ్రన్ ఎలిమెంట్స్‌ను అద్దుకుంది. అంతర్జాతీయ మోడల్‌తో పోలిస్తే ఇండియా మోడల్‌లో కొన్ని మార్పులు చేశారు. ముందు భాగంలో వై-షేప్ ఎల్ఈడీ హెడ్ లాంప్స్, వెనుక వైపున ఒకదానికొకటి కలిపినట్లు ఉండే కనెక్టెడ్ ఎల్ఈడీ టెయిల్ లైట్స్ దీనికి ప్రీమియం లుక్ ఇస్తాయి. భారీ బంపర్, సిల్వర్ ఫినిషింగ్, 18-అంగుళాల అల్లాయ్ వీల్స్ మరియు 212 మిమీ భారీ గ్రౌండ్ క్లియరెన్స్‌తో ఈ SUV ఆఫ్-రోడింగ్‌కు కూడా పక్కాగా సరిపోతుంది.

ఇంటీరియర్, ఫీచర్లు

లోపలి భాగం ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. డ్రైవర్ ఫోకస్డ్ క్యాబిన్‌లో 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి. పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జింగ్, 360-డిగ్రీ కెమెరా, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 6-వే పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు అందించారు. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్స్ ప్రామాణికంగా వస్తాయి. అంతేకాకుండా, 17 రకాల ఫీచర్లు కలిగిన లెవల్ 2 ADAS ప్యాకేజీని రెనో ఇండియాలో మొదటిసారి ఈ కారుతోనే పరిచయం చేస్తోంది. ఇందులో ఏకంగా 700 లీటర్ల బూట్ స్పేస్ ఉంది, ఇది ఈ సెగ్మెంట్‌లోనే టాప్ అని చెప్పొచ్చు.

కొత్త డస్టర్ మూడు ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది:

1.3L Turbo TCe 160: ఇది 163 PS పవర్, 280 Nm టార్క్ ఇస్తుంది. దీనికి 6-స్పీడ్ DCT గేర్‌బాక్స్ జత చేశారు.

1.8L E-Tech 160 (Strong Hybrid): ఇందులో 1.4 kWh బ్యాటరీ ఉంటుంది. సిటీలో 80% ప్రయాణాన్ని కేవలం ఎలక్ట్రిక్ మోడ్‌లోనే పూర్తి చేయవచ్చని కంపెనీ చెబుతోంది. దీనికి 8-స్పీడ్ DHT గేర్‌బాక్స్ ఉంది.

1.0L Turbo TCe 100: సిటీ డ్రైవింగ్ కోసం ఇది బెస్ట్. 100 PS పవర్‌తో 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది.

బుకింగ్, వారంటీ

కొత్త డస్టర్ ప్రీ-బుకింగ్స్ రూ.21,000 చెల్లించి చేసుకోవచ్చు. దీని ధరలను మార్చి నెలలో ప్రకటించనున్నారు (సుమారు రూ. 10 లక్షల నుంచి 20 లక్షల వరకు ఉండొచ్చు). టర్బో వేరియంట్ల డెలివరీలు ఏప్రిల్ నుంచి, స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్ డెలివరీలు దీపావళి 2026 నాటికి ప్రారంభమవుతాయి. వినియోగదారులకు మరింత భరోసా కల్పించడానికి రెనాల్ట్ ఏకంగా 7 ఏళ్ల వారంటీని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది.

Tags:    

Similar News